జనవరి 3న బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ సైన్యాధిపతి జనరల్ సులేమాన్‌ను అమెరికా డ్రోన్‌లు బాంబుల వర్షం కురిపించి హతమార్చాయి. ప్రపంచానికి మెసపటోమియా నాగరికతను అందించిన ఇరాక్‌ను జనహనన ఆయుధాలను తయారు చేస్తున్నారనే నెపంతో యుద్ధానికి పాల్పడి జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ సాంస్కృతిక నాగరికతా కేంద్రంగా విలసిల్లిన పర్షియన్ ఇరాన్‌ను కూడా సామ్రాజ్యవాదం విస్తరణ కుతంత్రాలతో సంక్షోభంలోకి నెట్టివేసే ప్రయత్నాలకు తెగ బడుతున్నది. అమెరికా అనుకూల షా రాజ వంశ పాలనలో ఇరాన్ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు లోనయింది సామాజిక న్యాయం, మత విలువల పునరుద్ధరణ కోసం జరిగిన 1979 ఇస్లమిక్ విప్లవ విజయంలో యువ సైనికుడిగా సులేమానీ దేశభక్తియుత సాహసోపేత చర్యలతో ప్రజలకు చేరువయ్యాడు. విప్లవ సారథి అయతుల్లారహుల్లా. ఖోమేనికి విధేయత విశ్వసనీయత గల సహచరుడిగా ఉన్నాడు. ఇరాన్ పునర్నిర్మాణం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. తనదైన విదేశాంగ విధానాలతో జనరల్ సులేమాన్ కంటగింపుగా తయారయ్యారు.చమురు వనరులు సమృద్ధిగా ఉన్న ఇరాన్‌పై ఆధిపత్యం కోసం అమెరికా దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నది. వీటిని ఇరాన్ అప్రతిహతంగా తిప్పి కొడుతున్నది. రష్యాతో సైనిక, వ్యాపార సంబంధాలను పటిష్టం చేసుకున్నది.
[ads_color_box color_background=”#eee” color_text=”#444″][ads-quote-center cite=”]మారుతున్న ప్రపంచ ముఖచిత్రంలో భారత్ తన పాత్రను స్పష్టంగా నిర్వచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సామ్రాజ్యవాదాన్ని తొలి దెబ్బ తీసిన స్వాతంత్రోద్యమ ఘనచరిత్ర మనకు ఉంది. పెట్టుబడి లాభాపేక్షలతో, అభివృద్ధి పేరుతో సుస్థిర సంతులిత నమునాకు విఘాతం కలిగిస్తూ పర్యావరణ మార్పుకు కారణం అవుతున్న అమెరికా నాయకత్వంలోని జి- సెవెన్ కూటమి విధేయంగా ఉండడం మానుకోవాలి. శతాబ్దాలుగా రాజకీయ, సాంస్కృతిక సత్సంబంధాలు ఉన్న ఇరాన్‌కు స్నేహ హస్తాన్ని అందించాలి.[/ads-quote-center][/ads_color_box]
ఇటీవల చమురు కొనుగోలులో చైనా అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా మారింది. ఇరాన్ చమురు క్షేత్రాల అభివృద్ధికి చైనా 280 బిలియన్‌ల కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. వీటి రక్షణ బాధ్యతలను తీసుకుంది. బలమైన రక్షణ ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుని ప్రజారంజక పాలన కొనసాగిస్తున్న ఇరాన్ అమెరికా విస్తరణవాద, ఇస్లామిక్ ఉగ్రవాద బాధిత దేశాలైన సిరియా, కువైట్, ఇరాక్, లెబనాన్, యెమెన్, పాలస్తీనాలకు సహాయ సహకారాలను అందిస్తున్నది. ఇలాంటి ఇరాన్ వైఖిరిపై అగ్రరాజ్యం అక్కసుతో, అణ్వ్సస్రాలను తయారు చేస్తున్నారనే నెపంతో అనేక ఆర్థిక ఆంక్షలను విధించింది. అణు కార్యక్రమాలను నిలిపివేసే వరకు ఆర్థిక ఆంక్షలను కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2015లో భద్రతా సమితి సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్‌ల మధ్య ‘‘ఇరాన్ అణుఒప్పందం’’ కుదిరింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో యురేనియం, ఫ్లూటోనియం ప్రాసెస్సింగ్‌ను తగ్గించింది. ‘ఐఏఈఏ’ అనుమతించిన పరిమితులలో అణు ఇంధనాన్ని తయారుచేసుకుంటున్నది. హాఠాత్తుగా ఈ అణుఒప్పందం నుండి అమెరికా వైదొలిగింది. మరల ఆర్థిక ఆంక్షలు విధించింది. పశ్చిమాసియాలో ప్రాబల్యం విస్తరించుకుంటూ ఉన్న ఇరాన్‌పై యుద్ధోన్మాద చర్యలకు, ఆంక్షలకు తెగబడింది. దీనికి జవాబుగా ఇరాన్ తన ఆధీనంలోని హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న సౌదీ, అమెరికా వ్యాపార నౌకలపై దాడులు చేసింది. తనపై ఆంక్షలు తొలగించకపోతే జలసంధిని మూసివేసి గల్ఫ్ నుండి అమెరికా, పశ్చిమ దేశాలకు చమురు రవాణను అడ్డుకుంటామని హెచ్చరించింది. తన గగన తలంలో ప్రవేశించిన డ్రోన్లను కూల్చివేసింది. దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్ క్షిపణి రక్షణ వ్యవస్థను దెబ్బ తీయడానికి సైబర్ దాడులకు పాల్పడింది. ఈ ఉద్రిక్తతల పరంపరలో చివరకు తనకు తాలిబన్ ఇస్లామిక్ స్టేట్‌పై యుద్ధంలో పరోక్షంగా సహకరించిన ఇరాన్ సైనిక జనరల్ కాసిమ్ సులేమానీని విశ్వాసఘాతకత్వంతో అమెరికా పొట్టనబెట్టుకుంది. అంతే కాకుండా మానవ జాతి అపురూప సంపదగా ఉన్న ఇరాన్ సాంస్కృతిక కేంద్రాలను ధ్వంసం చేస్తామని తాలిబన్ ఇస్లామిక్ ఉగ్రవాదులను తలదన్నే విధంగా ప్రకటించిది. ఇరాన్ చెక్కు చెదరని సాహసంతో ఇరాక్‌లోని ఎల్బీ అల్ అసద్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణుల వర్షాన్ని కురిపించింది. అమెరికాను ఉగ్రవాద దేశంగా ప్రకటించి ట్రంప్ తలకు వెలకట్టింది.
రాజకీయ సంక్షోభం, పాలన వైఫల్యాలు సంభవించినప్పుడు ప్రజల దృష్టిని మరల్చడానికి తనకు విధేయంగా లేని దేశాలపై దాడులకు దిగడం అమెరికాకు అలవాటయింది. తీవ్ర జాతీయవాదం, విద్వేష రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్ మరింత తెంపరి తనానికి పాల్పడుతున్నాడు. మరొక వైపు ప్రపంచ సంపదలో 15% వాటాను కైవసం చేసుకొని ఆర్థిక ప్రబల శక్తిగా ఎదుగుతున్న చైనా అమెరికాను కలవరపెడుతున్నది. కృత్రిమ మేథ•, రోబోటిక్స్, అంతరిక్ష రంగాలలో చైనా శరవేగంగా దూసుకెళుతోంది. బైడు, అలిబాబా, టెనస్ట్ వంటి కంపెనీలు అనేక ఖండాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. 2014లో బిల్ట్ అండ్ ఇనిష్యేటివ్‌ను, ఆసియా ఖండ మౌలిక సౌకర్యాల కల్పన బ్యాంకును ప్రారంభించింది. ప్రపంచంలో 70 శాతం జనాభా నివసిస్తున్న 72 దేశాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు అభివృద్ధికి ఈ చర్యలు దోహదపడతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పోలీస్‌గా వ్యవహరిస్తున్న అమెరికాకు చైనా పురోగతి కంటగింపుగా మారింది. చైనాతో యుద్ధం కొనసాగిస్తూనే చైనాకు చమురు రవాణకు కీలక దేశంగా ఉన్న ఇరాన్‌పై కట్టు కథలతో కులదోయడానికి చేయడానికి సాహసం చేస్తున్నది. ఆసియన్ కూటమి చైనాల సారథ్యంలో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సారథిగా ఆసియా ఖండం ఎదిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికాతో సైనిక పరంగా ఆర్థికపరంగా పోటీపడి వెనుకబడ్డ రష్యా ఇటీవల కాలంలో మళ్లీ పోటీలోకొచ్చింది. నాటో కూటమిలో సైనిక పరంగా రెండవ పెద్ద దేశంగా ఉన్న టర్కీ అమెరికాపై ధిక్కారస్వరం వినిపించింది. సిరియాలోని కుర్దుల ప్రాంతాన్ని ఆక్రమించుకుని అక్కడ అమెరికా సైనిక స్థావరాన్ని తొలగించాలని ఆదేశించింది. కుర్దుల, టర్కీ మధ్య ఘర్షణ నివారించడానికి రష్యా రాజకీయ దౌత్యం నెరిపింది. అమెరికా బెదిరింపులు ఖాతరు చెయ్యకుండా టర్కీ రష్యా నుండి ఎస్-400 క్షిపణులను, సు-జెట్ యుద్ధవిమానాలను కొనుగోలు చేసింది. 18 సంవత్సరాల తాలిబన్ యుద్ధంలో విజయం సాధించలేక అవమానకర రీతిలో వారితో చర్చలను జరుపుతోంది. కెన్యాతో పాటు అనేక దేశాలలో అమెరికా సైనిక స్థావరాలను తొలగించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అమెరికా చుట్టూ ఉన్న లాటిన్ అమెరికా దేశాలలో అమెరికా అనుకూల ప్రభుత్వాలు కూలిపోయి సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అమెరికా పెట్టుబడులకు అనేక దేశాలలో ద్వారాలు ముసుకపోతున్నాయి. పెట్టుబడులను తిరిగి రాబట్టుకోలేక పోతున్నాయి. విదేశీ వాణిజ్యంలో భారీ లోటును ఎదుర్కొంటున్నది.
అమెరికా పట్ల ప్రపంచమంతా అలముకున్న అసంతృప్తి, ఆగ్రహం తమపై కాదని తమ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాలపైనని అమెరికా ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రపంచీకరణ సంపద కేంద్రీకృతం చేసిందని, సంక్షోభాలను వికేంద్రీకరణ చేసిందని గమనించారు. వాల్ స్ట్రీట్ ఆక్రమణ ఉద్యమ ప్రకంపనలు కొనసాగిస్తున్నారు. అలాగే యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరుపుతున్నారు. ఈ విధంగా ఇంటా, బయట పెను సంక్షోభం కారుమబ్బులు అమెరికాను కమ్ముకుంటున్నాయి. తానే రారాజు అనుకున్న ఏకధృవ ప్రపంచ కోటకు బీటలు పడుతున్నాయి. నిరాశలో అమెరికా నిస్పహతో యుద్ధ పిపాసిగా మారుతున్నది. అమెరికా ప్రజలతో సహా ప్రపంచ ప్రజల ఆందోళన, ఇరాన్‌తో జరిగే యుద్ధ ప్రభావాన్ని బేరీజు వేసుకున్న అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడికి ఉండే యుద్ధ అధికారాలను కుదించడం ఒక చిన్న ఆశాజనక పరిణామం. మారుతున్న ప్రపంచ ముఖచిత్రంలో భారత్ తన పాత్రను స్పష్టంగా నిర్వచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సామ్రాజ్యవాదాన్ని తొలి దెబ్బ తీసిన స్వాతంత్రోద్యమ ఘనచరిత్ర మనకు ఉంది. పెట్టుబడి లాభాపేక్షలతో, అభివృద్ధి పేరుతో సుస్థిర సంతులిత నమునాకు విఘాతం కలిగిస్తూ పర్యావరణ మార్పుకు కారణం అవుతున్న అమెరికా నాయకత్వంలోని జి- సెవెన్ కూటమి విధేయంగా ఉండడం మానుకోవాలి. శతాబ్దాలుగా రాజకీయ, సాంస్కృతిక సత్సంబంధాలు ఉన్న ఇరాన్‌కు స్నేహ హస్తాన్ని అందించాలి. అమెరికా పశ్చిమాసియాలో చేపడుతున్న కవ్వింపు చర్యలతో మన చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే ధరలు పెరిగాయి. ఈ ధోరణులు భారత ఉత్పత్తి, ఎగుమతి రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భూమిగా, అలీన విధానాన్ని అందించిన స్వర్ణ మెదినిగా ఉన్న భారత్ జాత్యాహంకార, సామ్రాజ్యవాద విస్తరణ దేశాల పట్ల దూరాన్ని పాటిస్తూ శాంతియుత సహజీవన ప్రపంచ నిర్మాణంలో భాగస్వామి కావాలి.
అస్నాల శ్రీనివాస్,
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
9652275560
Tags: apnala srinivas, suleman, baghdad airport, wall street, us drones