తెలంగాణ ప్రజల చైతన్య దీపిక
విద్యతోనే ఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు తొలుగుతాయి..
దళిత, గిరిజనుల కోసం సిఎం కేసీఆర్ అనేక పథకాలను చేపడుతున్నారు
సిద్ధిపేటలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున నెలకొల్పిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కాదు విప్లవ రూపమనీ, అంబేడ్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్‌రావు బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ…ఆర్థిక సమానత్వం, విద్యతోనే అస్పృశ్యత తొలగించడం సాధ్యమవుతుందనీ సిఎం భావించారనీ, అందుకే దళితుల ఆర్థిక సమానత్వం కోసం దళిత బంధు, విద్యాభివృద్ధి కోసం గురుకుల పాఠశాలలను సిఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. అంబేడ్కర్ ఆలోచన, ముందుచూపుతో భారతదేశం కులాలు, మతాలకతీతంగా అందరం కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆదర్శంగా ముందుకు పోతుందనీ, దళిత జాతి, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రంలో కేసీఆర్ అనేక పథకాలను చేపడుతున్నారు. విద్యతోనే ఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు తొలుగుతాయని చెప్పిన అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్య వ్యవస్థ నడుస్తుందనీ వీటిలో రెసిడెన్షియల్ విద్యాసంస్థలు చారిత్రాత్మకమైనవన్నారు.
దేశంలో ఎక్కడలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం 1000 రెసిడెన్షియల్ విద్యాసంస్థలను రాష్ట్రంలో సిఎం కేసీఆర్ నె•లకొల్పడం జరిగిందనీ, గురుకుల విద్యాలయాల్లో సంవత్సరానికి ఒక విద్యార్థి మీద లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. పోటీ ప్రపంచంతో పోటీ పడేలా గురుకుల విద్యాసంస్థలు తర్ఫీదునిస్తున్నాయనీ, పదవ తరగతితో విద్య ఆగకూడదని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేయడం జరిగిందనీ, అన్ని విద్యాసంస్థల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. దళిత బాలికల కోసం 50ఎస్సీ ఉమెన్స్ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నాణ్యమైన ఉచిత విద్య కోసం పీజీ, లా రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు దళితుల ఉన్నత విద్య కోసం బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 20 లక్షల రూపాయల గ్రాండ్‌ను అందజేస్తుందనీ, కొత్త జిల్లాల ఏర్పాటుతో అట్టడుగు వర్గాల ప్రజలకు పరిపాలన అందుబాటులోకి వొచ్చిందన్నారు. దళితబంధు లాంటి వినూత్న పథకం దేశంలోనే ఎక్కడ లేదనీ, ఎంతో సాహసోపేతంగా సిఎం అమలు చేస్తున్నారు.
సచివాలయానికి ఇరువైపులా అమర వీరుల స్థూపం, 125ఫీట్ల దేశంలోనే పెద్దదైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామనీ, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాప్రతినిధులు, అధికారుల్లో రగిలించేందుకు డాక్టర్ బిఆర్. అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం స్ఫూర్తినిస్తాయన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పేది అంబేద్కర్ విగ్రహం కాదు సామాజిక విప్లవం-భావితరాలకు గొప్ప స్ఫూర్తి అని ఎత్తిన అంబేడ్కర్ చేయి రాజ్యాంగ స్ఫూర్తి, విలువలను కాపాడే బాధ్యతను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలుపుతుందన్నారు. ఈరోజు దేశం మొత్తం హైదరాబాద్‌లో జరిగే అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వైపే చూస్తుందన్నారు. సిద్ధిపేటలో అన్ని కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయనీ, అందరూ కలిసి వొస్తే దళితులు, గిరిజనుల అభివృద్ధికి మరింత కృషి చేద్దామన్నారు. సిద్ధిపేట నియోజకవర్గంలో 8 గ్రామాలలో డైరీ ఫామ్‌ల ఏర్పాటుకు ప్రోత్సహం అందించి 80 క్యాటిల్ హాస్టల్లను ఏర్పాటు చేశామనీ, సిద్దిపేటలో దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చామనీ, సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం నూతనంగా నిర్మించిన భవనంలోకి కలెక్టరేట్ మారిన తర్వాత పాత కలెక్టరేట్ భవనాన్ని దళితులకు అందించామనీ, అంబేద్కర్ భవన్‌లో షెట్టర్లు పెట్టడం, ఫంక్షన్ హాల్‌గా ఉపయోగించుకునేందుకు వీలుగా తీర్చిదిద్దేందుకు కోటి రూపాయల చెక్కును అందజేసినట్లు తెలిపారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ దవాఖానలకు తెలంగాణ రాష్ట్ర పాలనలో కార్పొరేట్ హాస్పిటల్స్ కన్నా అద్భుతంగా సేవలందిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ…ఎంత కాలం బతుకుతాం అనేది కాదు ఎంత బాగా బతుకుతాం అనేది ముఖ్యం అని, అంబేద్కర్ జీవిత చరిత్రను చదవడం మూలంగా చాలా విషయాలు తెలుస్తాయనీ, వొచ్చే సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా 300 మంది దళిత లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి సబ్సిడీతో పాటు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రోత్సాహం అందజేశారు. ఇద్దరికీ 20 లక్షల రూపాయల చొప్పున ఓవర్ షిప్ స్కాలర్షిప్ గ్రాంట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మునిసిపల్ ఛైర్‌పర్సన్ మంజుల రాజనర్సు, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖాధికారి కవిత, సూడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, బిఆర్‌ఎస్ నేతలు రాజనర్సు, సాకి ఆనంద్, పోచబోయిన శ్రీహరి యాదవ్, తుపాకుల బాల్‌రంగం, బిఆర్‌ఎస్ కౌన్సిలర్లు, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గ్యాదరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.