ఆయన సిద్ధాంతం విశ్వజనీనం..సార్వజనీనం
ప్రపంచవ్యాప్తంగా అణగారిన జాతులకు ఆశాదీపం
ఆయన పేరిట ఏటా దేశ వ్యాప్తంగా అవార్డులు
రూ. 51 కోట్ల డిపాజిట్…వడ్డీగా వొచ్చే మూడుకోట్లతో ప్రదానం
వొచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మనదే అధికారం
దేశంలో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నాం
దేశ వ్యాప్తంగా ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు
అంబేద్కర్ స్ఫూర్తితో కార్యాచరణకు సిద్ధం
అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో సిఎం కెసిఆర్
కెసిఆర్‌ను అభినందించిన ప్రకాశ్ అంబేద్కర్
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను అంబేద్కర్ సూచించారన్న మనవడు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : డా బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా…ఇప్పటికీ అంబేద్కర్ జయంతులు చేసుకుంటూ పోవడమేనా? ఆయన చెప్పింది ఏమైనా ఆచరించేది ఉందా? ఆ దిశగా ఏమన్నా కార్యాచరణ ఉందా, లేదా? అని మనందరం గుండెలమీద చెయ్యేసుకొని ఆలోచించుకోవాలని సిఎం కెసిఆర్ ఉద్ఘాటించారు. ఇప్పుడు భారతదేశం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని, ఇంకా ఆటలు, పాటలే కాదు.. కార్యాచరణ ప్రారంభం కావాలని, ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రారంభోత్సవం కావాలని సిఎం పిలుపునిచ్చారు. శుక్రవారం అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా 125 అడుగుల అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఎం మీట్లాడుతూ…అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తేనో, చెబితేనో ఏర్పాటు చేసుకోలేదని, అద్భుతమైనటువంటి విశ్వమానవుని విశ్వరూపాన్ని, ఈ మూర్తి రూపాన్ని మనమిక్కడ ప్రతిష్టించుకున్నామంటే దానిలో ఒక బలమైన సందేశం ఉందనా తెలిపారు. ఈ ప్రదేశం ఒక సుందర దృశ్యమే కాకుండా రాష్ట్ర పరిపాలనా సౌధమైనటువంటి సెక్రటేరియట్ పక్కనే ఉంది. మన పరిపాలనా సౌధానికి కూడా అంబేద్కర్ పేరే పెట్టుకున్నాం. సెక్రటేరియట్ ముందే అమరుల స్మారకం కూడా ఉంది. అ పక్కనే హుస్సేస్ సాగర్ మధ్యలో అంబేద్కర్ నమ్మిన బుద్ధ విగ్రహం ఉంది. ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి చిహ్నాలు. అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, శాంతిమూర్తి బుద్ధుడిని ప్రతిరోజూ సెక్రటేరియట్‌కు వొచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, సెక్రటరీలకు ఎప్పటికప్పుడు ఆయన సిద్ధాంతం ఆలోచనల్లోకి వొస్తూ ఉండాలె. అంబేద్కర్‌ను చూస్తూ వాళ్ల మనసు ప్రభావితం కావాలని సిఎం తెలిపారు.