తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా కెసిఆర్ పాలన
బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
రాజ్‌భవన్ గణతంత్ర వేడుకలకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు..రాజ్యాంగాన్ని అవమానించడమే : ఎంఎల్ఏ ఈటల రాజేందర్
ప్రజాతంత్ర, హైదరాబాద్, జనవరి 26 : ప్రపంచంలోనే లేని గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్పవ్యక్తి అంబేడ్కర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు..అప్పటి నుంచే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన విషయం తెలిసిందేనన్నారు. ప్రపంచంలోనే ఓ గొప్ప దేశంగా..అందరూ గుర్తిస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో 73వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయి జాతీయ పతాకం ఆవిష్కరణ చేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రజలకు ఒక భరోసా అని….. పాలకులకు మార్గనిర్దేశమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు సంజయ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 370 ఆర్టికల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేశారని, అయితే రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన జరుగుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో విలేఖరులు, కవులు, ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఎంపీ అరవింద్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలకులు రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. తెలంగాణలో భిన్నమైన పాలన కొనసాగుతుందని బండి సంజయ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్, నందీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్‌భవన్ గణతంత్ర వేడుకలకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు..రాజ్యాంగాన్ని అవమానించడమే : ఎంఎల్ఏ ఈటల రాజేందర్
రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాకుండా తప్పు చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆరోపించారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కనీసం సీనియర్ మంత్రి కూడా లేకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విఘాతమని ఈటల అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వాదులు బాధపడే సంఘటన అని అభివర్ణించారు.
గవర్నర్ కుర్చీని సీఎం కేసీఆర్ అవమానించారని ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగడం రాష్ట్ర ప్రజలకు క్షేమకరం కాదన్నారు. అటు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి గణతంత్ర దినోత్సవాన మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదని అన్నారు. ప్రగతి భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడిన మాటలు రాజ్యాంగం వి•ద విషం కక్కడమే అని ఆరోపించారు. పోచారం మాటలను గమనిస్తే కావాలనే సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లలేదని స్పష్టం అవుతుందన్నారు. అటు సీఎం కేసీఆర్ తన మాటలతో ప్రజలను ఒప్పించే సత్తా కోల్పోయాడు కాబట్టే బీజేపీ నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘటనను ఉద్దేశిస్తూ ఈటల విమర్శలు చేశారు.