Take a fresh look at your lifestyle.

అమరావతి కథ..!

తెలుగు దేశం అధ్యక్షుడు నారా చంద్రబాబును విభజిత ఆంధప్రదేశ్‌ను నవ్యాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని ఆరేళ్ళ పాటు ప్రజలను ఊహల లోకాల్లో విహరింపజేశారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజధానులను లోకం చుట్టిన వీరునిలా తిరిగొచ్చి ఒక్కొక్క సారి  ఒక్కో ఊహా చిత్రాన్ని తన అనుకూల మీడియా ద్వారా ప్రజలకు చూపించి కాళీ పట్నం చూడరబాబు అంటూ చూపించారు. తీరా అవేమీ నిజమైన నిర్మాణాలు కావనీ, బాహుబలి గ్రాఫిక్స్ అని తెలిసేసరికి రాష్ట్ర ప్రజలకు ఐదేళ్ళు పట్టింది. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సైతం ఆశ్చర్యం కలిగించే రీతిలో  అమరావతి గ్రాఫిక్స్‌ను చూపడంలో బాబు అనుకూల మీడియా రాజమౌళి వంటి సినీ దర్శకులను మించిపోయింది. అమరావతి కథ విషాదాంతం కావడానికి వేరెవరో కారణం కాదు. కుల జాత్యంహంకారులు, ఉప ప్రాంతీయ విధేయతలు అమరావతి కలలు భగ్నం కావడానికి కారణం అయ్యాయి.  అమరావతి నిర్మాణంలో బాబు ప్రతిపక్షాలను భాగ స్వామ్యం చేయలేదు.

అంతా తానై నడిపించారు. ఆయన మాటలలోనే 29 సార్లు విదేశీ పర్యటనలు చేసి ఆయా రాజధానులు నమూనాలను  తెప్పించారు. అవేమీ నచ్చకపోతే చివరికి బాహుబలి దర్శకుడు రాజమౌళిని సంప్రదించారు.ఈలోగా పదవీ కాలం పూర్తి అయింది. తన మీద అభిమానంతో తాను ఒక్క పిలుపు ఇవ్వగానే 33 వేల ఎకరాల భూములు ఇచ్చారంటూ ఎక్కడికి వెళ్ళినా చాలా ఘనంగా చెప్పుకునే వారు. రైతులు పొలాలను ఇచ్చారన్నది నిజమే కావచ్చు. కానీ, రాజధాని నిర్మాణంలో ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. బాబుగారిని  సమర్థించే పారిశ్రామిక, కార్పొరేట్‌ ‌వర్గాలేవీ తమ కార్యాలయాలను కూడా అమరావతిలో ఏర్పాటు చేయలేకపోయాయి అంటే అక్కడ ప్రాథమిక వసతులు ఏవీ లేకపోవడమే కారణం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని చూపించి దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖులకూ, రాష్ట్ర ప్రజలకూ భ్రమలు కల్పించేవారు. ఆ విధంగా అమరావతి ఒక ఊహాస్వర్గంగా మిగిలిపోయింది. రాజకీయ నాటకానికి ఒక ఇతి వృత్తంగా మిగిలి పోయింది. అమరావతి పేరిట సాగిన నాటకాలకు తెలుగు ప్రజలు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. అమరావతికి బహుళ జాతి సంస్థలు తరలి వస్తున్నాయనీ, ఇంకేముంది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయనీ ఆశలూరించే రీతిలో ప్రకటనలు చేశారు. అయితే ఆ కలలన్నీ మూడు రాజధానుల బిల్లును, సిఆర్‌డిఏ బిల్లులనూ గవర్నర్‌ ‌బిశ్వచందన్‌ ‌హరిభూషణ్‌ ఆమోదించడంతో కల్లలయ్యాయి.

తెలుగు దేశం పార్టీ ఓటమి పాలైన నాటి నుంచి     అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజల చేత నిరంతరం నిరసన ప్రదర్శనలు జరిపించడంలో(ఇప్పటికీ జరిపిస్తుండటంలో) బాబు కృతకృత్యులయ్యారు. అమరావతి కలల సౌధాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి కుప్పకూల్చారంటూ చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే  మీడియా అయితే మరింత తీవ్రమైన ఆరోపణలు చేస్తూ జనం సహనాన్ని పరీక్షించే రీతిలో ప్రచారం చేస్తోంది. నిజానికి అమరావతి గురించి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలకు తప్ప రాష్ట్రంలోని 13 జిల్లాల వారికీ ఏమాత్రం ఆసక్తి లేదు. అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రజల ఆకాంక్ష. గవర్నర్‌ ఆమోదం తర్వాత  గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌కూడా వెలువడింది. అయితే, ఈ రెండు బిల్లులను సవాల్‌ ‌చేస్తూ దాఖలైన మూడు వ్యాజ్యాలు హైకోర్టు విచారణలో ఉన్నాయి. అవన్నీ దాటుకుని వస్తే చట్టరూపం ధరిస్తాయి. ఈ బిల్లును న్యాయపరంగా ఎదుర్కొంటామని చంద్రబాబునాయుడు  ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ లోకి ఫిరాయించిన ఆయన  విశ్వాస పాత్రుడైన ఎంపీ సుజనా చౌదరి అమరావతిని ఒక్క ఇంచుకూడా ఎవరూ కదల్చలేరు ఇది కేంద్రం చేతులలో ఉందంటూ ప్రకటించడం, బీజేపీ రాష్ట్ర ఇన్‌ ‌చార్జ్‌లు  దానిని ఖండించడం, పార్టీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడు  సోము వీర్రాజు కూడా ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ప్రకటించడం జరిగింది. గవర్నర్‌ ‌హరిచందన్‌  ‌రాబోయే న్యాయపరమైన అడ్డంకుల గురించి న్యాయ, రాజ్యాంగ నిపుణులను సంప్రదించిన తర్వాతే ఆమోదం తెలిపినట్టు రాజకీయ వర్గాల ప్రచారం. జన సేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ ‌కల్యాణ్‌  ‌రాజధాని తరలింపునకు ఇది సమయం కాదని అంటూనే, ముందు కొరోనా వల్ల పిట్టల్లా రాలిపోతున్న వారి ప్రణాలు నిలబెట్టండంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పార్టీలో ఉంటూనే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రోజుకో ప్రకటనతో జగన్‌పై బాణాలు వేస్తున్నారు. ఆయనను అనర్హునిగా ప్రకటించాలని మిగిలిన వైసీపీ ఎంపీలు లోక్‌ ‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లాను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయన చేత బీజేపీ పెద్దలే మాట్లాడిస్తున్నారన్న ప్రచారం ఉంది. అయితే, నైతికంగా ఆయనకు ఆ హక్కు లేదు. పవన్‌ ‌కల్యాణ్‌ ‌వ్యాఖ్యలను బట్టి ఆయన మూడు రాజధానుల అంశంపై పెద్ద సీరియస్‌గా లేరనిపిస్తోంది. అమరావతిపై రిఫరెండంను నిర్వహించాలని చంద్రబాబునాయుడు, రఘరామ కృష్ణం రాజు ప్రభృతులు కోరుతున్నారు. అయితే, అమరావతి వేడి తగ్గకుండా ఉండటం కోసం మరి కొంత కాలం దాని పేరు చెప్పుకుని రాజకీయం చేయడానికి మాత్రమే అది ఉపయోగ పడుతుంది. కేంద్రంలో బీజేపీ పెద్దలు కూడా మూడు రాజధానులకు అనుకూలమేననీ ఉత్తరాఖండ్‌లో మూడు రాజధానులు ఎప్పుడో అమలులోకి వచ్చాయని మరి కొందరంటున్నారు. మొత్తం మీద ఎన్నో విమర్శలూ, ఆరోపణలు వచ్చినా సాహసంగా ముందుకు సాగుతున్న జగన్‌కు అమరావతి ప్రాంత 29 గ్రామాల ప్రజలు మినహా 13  జిల్లాల ప్రజలు  జేకొడుతున్నారు. గడిచిన రెండు రోజుల నుంచి ఆయన కట్‌ ఔట్లకు పాలాభిషేకాలు జరుపుతున్నారు. అమరావతి కథను మరికొంత కాలం పొడిగించేందుకు చంద్రబాబునాయుడు, ఆయన అనుకూల  మీడియా కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఒక టెలివిజన్‌ ‌ఛానల్‌ అయితే నిర్ణీత కాల వ్యవధిలో కాకుండా నిరంతరం జగన్‌పై విమర్శలకు   ఎక్కడెక్కడి వారినో పిలిపించి గోష్టులు నిర్వహిస్తోంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ‌కుమార్‌ ‌వ్యవహారంలో మాదిరి ఈ విషయంలో కూడా  తమదే అంతిమ విజయమని బాబు అనుకూల వర్గీయలు ఆశిస్తున్నారు.

Leave a Reply