Take a fresh look at your lifestyle.

రక్తసిక్తమైన అమరావతి

 ap capital issueఅమరావతిరాజధాని ఆందోళన రక్తసిక్తంగా మారింది. రాజధానిని మూడు ముక్కలు చేయాలని ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు గత ఇరవై అయిదు రోజులుగా చేస్తున్న ఆందోళన శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. ఏపి పోలీసు లాఠీలు విచక్షణారహితంగా రైతులపై విన్యాసాలుచేశాయి. ఆరుగాలం కష్టించి మూడు పంటలు పండే తమ భూములను రాజధానికోసం త్యాగంచేస్తే రైతులకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతి లాఠీచార్జీ. నిన్నటి వరకు ఇంటి నుండి బయటికి వెళ్ళని అనేకమంది మహిళారైతులు తమ త్యాగాలకు ఫలితం లేకుండా పోవడంపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వారి తలలు పగులగొట్టి, కాళ్ళు చేతులు రక్తసిక్తం చేసింది ఏపి ప్రభుత్వం. ఇంత దారుణంగా వారిపై పోలీసులు విరుచుకుపడే నేరం ఏంచేశారన్న దానికి ఎవరు సమాధానం చెబుతారు. విజయవాడ కనకదుర్గాదేవిని దర్శించుకుని తమ బాధలను చెప్పుకుని, అమ్మవారికి పొంగళి సమర్పించుకునేందుకు వెళ్ళే మహిళ)ను కూడా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారన్న ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు. తమ కోర్కెలను ఈడేర్చే దేవతలను తమ బాధలను విన్నవించుకోవడానికి తమ ఆచారం ప్రకారం వెళ్ళే మహిళలపై పోలీసులు ఎందుకు విరుచుకుపడ్డారో తెలియదు. తమను దుర్గ గుడికి వెళ్ళనీయాలని కొందరు మహిళలు పోలీసుల కాళ్ళావేళ్ళాపడినప్పటికీ పోలీసులు కనికరించలేదు. వయస్సుతో సంబంధం లేకుండా బలవంతంగా పోలీసు వ్యాన్‌లోకి నెట్టారు. నేరస్తులను కుక్కినట్లు ఒకరికి పదిమంది పోలీసులు చుట్టుముట్టి బట్టలు ఊడిపోతున్నా పట్టించుకోకుండా వ్యాన్‌లోకి నెట్టివేయడం చాలా దారుణం.

కాగా అమరావతి పరిరక్షణ కమిటి ఇచ్చిన పిలుపునందుకుని వేలాదిసంఖ్యలో మహిళలు విజయవాడలో ర్యాలీ చేపట్టగా, వారిని అడ్డుకోవడంలో బాగంగా షాపింగ్‌ ‌కోసం బజారుకొచ్చిన మహిళలను కూడా పోలీసులు బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు. మహిళలు ప్రధానంగా ఏపిలో అత్యంత ఉత్సాహవంతంగా జరుపుకునే అతి పెద్ద పండుగలో ఒకటైన సంక్రాంతికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవడానికి ఇంటి బయటికి వొచ్చిన తమ చుట్టూ పోలీసు వలయముండడాన్ని చూసి కొందరు మహిళలు ఆశ్చర్యపోయారు. తాము పుట్టిపెరిగిన ఊరిలో రోడ్డుపై నడవడానికి, గుడికి వెళ్ళడానికి కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తాము ఏపిలో ఉన్నామో, పాకిస్తాన్‌లో ఉన్నామో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఈ సన్నివేశాలను అందిస్తున్న మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ దారుణ పరిస్థితి జాతీయ మీడియాలో కూడా ప్రసారం కావడంతో అనేక మంది దీనిపై స్పందించారు. దీన్ని ప్రత్యక్షంగా వీక్షించిన జాతీయ మీడియా కమిషన్‌ ‌చైర్మన్‌ ‌రేఖ శర్మ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవడమే కాకుండా, దీన్ని సుమోటోగా తీసుకుని వెంటనే ఇద్దరు కమిషన్‌ ‌సభ్యులను ఘటనా స్థలానికి పంపించే ఏర్పాటు చేసిందంటే ఈ సంఘటన సీరియస్‌నెస్‌ ఎలా ఉందో అర్థమవుతోంది.

 ap capital issueఇదిలా ఉంటే ఏపిలో మూడు రాజధానుల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుండీ జరుగుతున్న అందోళనలో ఇప్పటి వరకు దాదాపు పదకొండు మంది రైతులు చనిపోయినట్లు తెలుస్తున్నది. తాజాగా శుక్రవారం విజయవాడలో జరిగిన ఆందోళనలో కూడా ఒక మహిళా రైతు మృతి చెందినట్లు వార్తలు వొస్తున్నాయి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని గత కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్‌ ‌ప్రభుత్వం ఎప్పుడైతే మూడు రాజధానులు ప్రస్తావన తీసుకువచ్చిందో అప్పటి నుండి ఈ ఉద్యమం ఉదృతంగా మారింది. అయితే ఇది టిడిపి, వైఎస్‌ఆర్‌ ‌పార్టీల మధ్య, కులాల మధ్య గొడవగా చూపించే ప్రయత్నాలు జరిగాయి. దీని వెనుక టిడిపి ప్రోద్భలం ఉందని ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ ‌పార్టీ నాయకులు, మంత్రులు ఆరోపిస్తూనే ఉన్నారు. కాని, రాజధాని కోసం 30వేల ఎకరాల భూములను దారాదత్తం చేసిన రైతులు భవిష్యత్‌లో రాజధాని తమ ప్రాంతంలోనే ఉంటుందని, మిగిలిన తమ భూములకు డిమాండ్‌ ‌వొస్తుందని, తమ పిల్లలకు మంచి భవిష్యత్‌ ఉం‌టుందని భావించారు. కాని, రాజధానిని మూడు భాగాలుగా చేయాలని వైఎస్‌ఆర్‌ ‌పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుండీ భూములు అందజేసిన 29 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. రాజధానిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయనుకున్న వారిప్పుడు తమ జీవనంపై ఆవేదన చెందుతున్నారు. ఇంత గొడవ జరుగుతున్న కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఏర్పాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందేనని కేంద్రం పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు. ఏ రాష్ట్రంలో నైనా ప్రజలు అసంతృప్తితో ఉంటే పట్టించుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఈ విషయంలో ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని వేలాది ఎకరాలను దారాదత్తం చేసిన రైతులకు న్యాయం చేసే విధంగా ఆలోచన చేయాల్సిందిగా అమరావతి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags: maravathi issue, ap capital issue, ys jagan, ap govt, telugudesam party

Leave a Reply