“ఒక ముఖ్యమంత్రికి తాను ఎక్కడి నుంచి పరిపాలన చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుందా? లేదా? ఒక వేళ అలా నిర్ణయించుకుంటే విబేధించే లేదా ఎక్కడ నుంచి పరిపాలన చేయాలో ఆదేశించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందా అన్నవి ఇక్కడ మౌలిక ప్రశ్నలు. రాష్ట్రం తీసుకునే రాజధాని నిర్ణయం పై జోక్యం చేసుకోగలిగే పరిధి న్యాయ స్థానానికి ఎంత వరకు ఉంటుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చలోకి రావల్సిన అంశం. రాజ్యాంగ, న్యాయ నిపుణులు మాత్రమే దీని పై మరింత లోతైన విశ్లేషణ చేయగలుగుతారు.”
ఆంధ్రప్రదేశ్‌లో గత 50 రోజులుగా రాజధాని చుట్టూనే తిరుగుతున్న రాజకీయం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే…దీనిలో తాము జోక్యం చేసుకునేది ఏమీ ఉండదని కేంద్రం పార్లమెంట్ వేదికగా తేల్చి చెప్పేయటంతో రాజధాని ఆందోళనలకు పుల్‌స్టాప్ పడుతుందో, కామా పడుతుందో ఆసక్తికరంగా మారింది.
రాజధాని-వివాదం:
రాజధాని వివాద పరిణామ క్రమాన్ని ఓ సారి చూస్తే రాజధాని వివాదం అమరావతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్లింది. గత ప్రభుత్వం అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధాని చేస్తామని చెప్పటమే కాకుండా సింగపూర్, మలేషియా, జపాన్ ఇలా పలు దేశాల నుంచి ప్రతినిధులు రావటం, రాజధాని నగర భవంతులు ఎలా ఉంటాయో గ్రాఫిక్స్‌లో ప్రదర్శించటం తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే. దీని కోసం లక్ష కోట్లకు పైబడిన బడ్జెట్ అవుతుందన్నది కూడా గత టీడీపీ ప్రభుత్వ అంచనా. ఈ గ్రాఫిక్స్ కార్యరూపంలోకి పూర్తిగా మారకముందే ప్రభుత్వం మారింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ తన ప్రాధాన్యత లో లక్ష కోట్ల రాజధాని లేదని తేల్చి చెప్పేయటమే కాకుండా, అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చింది. దీనితో చారిత్రక పేరు పెట్టుకున్న అమరావతికి శాసన రాజధాని మాత్రమే దక్కింది. కార్యనిర్వాహక రాజధాని విశాఖకు తరలిపోనుంది. హైకోర్టును రాయలసీమకు తరలించి న్యాయ రాజధానిగా పేరు పెట్టింది జగన్ సర్కార్. ముఖ్యమంత్రి ఎక్కడ కుర్చుంటే అదే రాజధాని అవుతుందని సీఎమ్ జగన్ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత ఇచ్చారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదన్నది ఆయన చేసిన మరో స్టేట్‌మెంట్.
ఏతావాతా ఏం చెప్పినా రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందన్న వాస్తవాన్ని ఆ ప్రాంత రైతులు అంగీకరించలేకపోతున్నారు. రాజధానిని మార్చవద్దంటూ ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలు ప్రారంభం అయి నిన్నటికి 50 రోజులు పూర్తయ్యాయి. ఈ ఆందోళనలు, నిరసనల వెనుక ప్రతిపక్ష టీడీపీ బలంగా నిలబడింది. లక్ష కోట్ల అమరావతి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్ట్ కావటంతో సహజంగానే ఆ పార్టీ కనుసన్నల్లోనే నిరసనలు కొనసాగుతాయి. దీంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ ఉండదు. టీడీపీకి మద్దతు ఇచ్చే కొన్ని పత్రికలు కూడా రాజధాని తరలింపును టీవీల్లోనూ, పత్రికల్లోనూ ఉద్యమంలా వ్యతిరేకిస్తున్నాయి. టీడీపీకి రాష్ట్ర బీజేపీ, ఆ పార్టీతో తాజాగా స్నేహాన్ని పునరుద్ధరించుకున్న జనసేన కూడా జగన్ ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడో విచిత్రమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో రాజధానికి భూములు ఇవ్వటానికి వ్యతిరేకించి, ఇదే స్థాయిలో నిరసనలు, ఆందోళనలు చేసిన గ్రామాలు, కొంత మంది రైతులు ఇప్పుడు రాజధాని తరలింపులు వ్యతిరేకిస్తున్నారు. సీఎమ్ జగన్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్న రైతులు, అటు ఢిల్లీ కూడా వెళ్లారు. కేంద్ర పెద్దలను కలిసి రాజధాని అమరావతి నుంచి వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అన్యాయం కాకుండా చూడాల్సిన బాధ్యత కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. దీని పై రెండో చర్చకే ఆస్కారం లేదు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్లు రాజధాని ముసుగులో భూ దందాలు జరిగి ఉంటే…వాటిని బయటపెట్టి, బాధ్యుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.
స్పష్టత ఇచ్చిన కేంద్రం:
రాజధాని అంశానికి సంబంధించి రెండు అంశాల దగ్గర ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడుతుందన్నది ప్రతిపక్ష టీడీపీ అంచనా. ఒకటి న్యాయస్థానం, రెండు కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే హైకోర్టులో రాజధాని తరలింపు పై పలు కేసులు దాఖలయ్యాయి. వీటి విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యాలు చేయటం గమనించాల్సిన అంశమే. తమ ఉత్తర్వులు లేకుండా అమరావతిలో ఉన్న ప్రభుత్వ శాఖలను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని స్పష్టం చేసింది. అంతే కాదు ఒక వేళ అలా తరలిస్తే తిరిగి వెనక్కి రప్పిస్తామని, తరలింపు ఖర్చులను బాధ్యులైన అధికారుల నుంచే వసూలు చేస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశం మరోసారి కార్యనిర్వాహక వర్సెస్ న్యాయ విభాగాల మధ్య వివాదం దిశగా అడుగులు వేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి తాను ఎక్కడి నుంచి పరిపాలన చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుందా? లేదా? ఒక వేళ అలా నిర్ణయించుకుంటే విబేధించే లేదా ఎక్కడ నుంచి పరిపాలన చేయాలో ఆదేశించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందా అన్నవి ఇక్కడ మౌలిక ప్రశ్నలు. రాష్ట్రం తీసుకునే రాజధాని నిర్ణయం పై జోక్యం చేసుకోగలిగే పరిధి న్యాయ స్థానానికి ఎంత వరకు ఉంటుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చలోకి రావల్సిన అంశం. రాజ్యాంగ, న్యాయ నిపుణులు మాత్రమే దీని పై మరింత లోతైన విశ్లేషణ చేయగలుగుతారు. ఇక రెండో అంశం కేంద్రం. రాష్ట్ర బీజేపీ విభాగం కూడా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఉండటంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతుందనే అభిప్రాయాన్ని విపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాయి. అయితే కేంద్ర ప్రకటన విపక్షాలకు ఎదురు దెబ్బయ్యింది. లోక్‌సభలో టీడీపీ ఎమ్‌పీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో రాజధానికి ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది. రాజధాని పై నిర్ణయం రాష్ట్రాలదే అని స్పష్టం చేసింది. అదే సమయంలో గత జీవో ప్రకారం ప్రస్తుతం అమరావతి రాజధానిగా ఉందన్న విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్రం వివరించింది. కేంద్రం ఇచ్చిన ఈ స్పష్టతతో రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం జగన్ ప్రభుత్వానికే ఉందన్న విషయంలో ఇతర వాదనలకు ఫుల్‌స్టాప్ పడినట్లే.
అమరావతి కేరాఫ్ ఇన్‌సైడ్ ట్రేడింగ్?
చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయిన అమరావతి కలను జగన్ బ్రేక్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నం వెనుక ఉన్నవి రాజకీయ సమీకరణాలే అన్నది బహిరంగ రహస్యమే. రాజధాని పేరుతో తమ సామాజిక వర్గానికి చెందిన వారిని, హితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు లబ్ది చేకూర్చే విధంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. ఎవరెవరు రాజధాని ప్రకటన కంటే ముందు సీఆర్‌డీఏ పరిధిలో భూములు కొన్నారో ఆ జాబితాను రాష్ట్ర ఆర్ధిక మంత్రి మొన్న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. ఈ జాబితాలో ఉన్నవారందరూ పరిటాల సునీత, జీవీ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, పుట్టా మహేష్ యాదవ్, దూళిపాళ నరేంద్ర, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్‌రావు వంటి టీడీపీ నేతలే. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు దారుల పేర్ల పై కూడా కోట్లాది రూపాయల భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయిన్న విషయాన్ని ప్రభుత్వం బయటపెట్టింది. మంత్రివర్గ ఉప సంఘం రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టిన ఈ వివరాలు దిగ్భ్రాంతికి గురి చేసేవే. తీగలాగితే డొంక కదిలి ఎంతమంది పెద్ద తలకాయలు బయటకు వస్తాయో లేక తప్పించుకుంటాయో చూడాలి. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగుతున్నాయి.
రాజధాని పేరుతో సాగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఈడీ సోమవారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కేసు కూడా నమోదు చేసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ చంద్రబాబు, మరి కొందరు టీడీపీ నేతలపై సీఐడీ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. 2014 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక చెబుతోంది . ప్రభుత్వం బయటపెట్టిన అంశాల్లో తెల్ల రేషన్ కార్డు దారులు అంటే బినామీ పేర్లతో భూ కొనుగోళ్లు మరో ముఖ్యమైన అంశం. అమరావతి రాజధాని కోర్ ఏరియాలో 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది. ఈ భూమి విలువ సుమారు 270 కోట్ల పై మాటే ఉంటుందని అంచనా. మొత్తం మీద 4 వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు ఇప్పటి వరకు వచ్చిన ప్రాధమిక విచారణ సమాచారం. ఈ మొత్తం ఆధారాలను ఈడీకి పంపింది సీఐడీ. అంటే తదుపరి మరింత లోతైన, మనీ ల్యాండరింగ్ వంటి ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేసే పని ఈడీ చేస్తుంది. ఒక వైపు కేంద్ర సంస్థల దర్యాప్తు, మరోవైపు రాజధాని రైతుల ఆందోళనలు…ఈ మొత్తం ప్రక్రియతో అమరావతి, మూడు రాజధానుల వ్యవహారం అనేక రంగులు, మలుపులు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.