Take a fresh look at your lifestyle.

తెలంగాణ వ్యతిరేకులతో అలయ్‌ ‌బలయ్‌..!

  • ఇం‌డ్ల నిర్మాణానికి రూ.వందలకోట్ల స్థలాలు
  • ఆంధ్ర సినీకళాకారులపై అంతప్రేమ ఎందుకో?
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి తలసాని వరుస భేటీలు
  • జీహెచ్‌ఎం‌సి ఎన్నికల కోసమేనంటున్న తెలంగాణవాదులు

“తెలంగాణ వ్యతిరేకుల ఫొటోలు మొదటి పేజీ లో వేయడం ‘ప్రజాతంత్ర’’ వ్యతిరేకం…ఆంధ్ర హీరోలు తెలంగాణ వ్యతిరేకి మంత్రి తలసాని తో సమావేశమయిన ఫోటో ప్రచురించడం లేదు.”

2009 డిసెంబర్‌ 9 ‌ప్రకటన తరువాత..మరుసటి రోజు 10. సినిమా హీరో, అప్పటి కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభసభ్యుడు చిరంజీవి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు జెండా ఎగిరేసిండు..అది మొదలు విభజనను వ్యతిరేకించిన సమైక్యవాదుల వొత్తిడితో కేంద్రప్ర భుత్వం ప్రకటనను వెనుకకు తీసుకున్నది..డిసెంబర్‌ 23‌న శ్రీకృష్ణకమిటీని నియమించింది..దీంతో తెలంగాణ వొస్తదో రాదో అన్న ఆందోళనతో వందలాది విద్యార్థులు, యువతీ, యువకులు రాష్ట్రసాధన కోసం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ బలిదానాలకు కారణమయినవారిని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్స హించడం..పెద్దపీటవేయడం దురదృష్టకరం. నీళ్లు…నిధులు…నియామకాలు ఇవీ తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌. ‌రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవన్నీ లభిస్తాయనే ఆశతో తెలంగాణ ప్రజలు కులమత వయో భేదాలకు అతీతంగా ఉప్పెనలా ఉద్యమించారు.

కానీ, తెలంగాణ సిద్ధించి ఆరేళ్లు గడుస్తున్నా ప్రజలు అశించిన ఫలితాలు అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన వారికి ప్రభుత్వం సాగిలపడిందనే ఆరోపణలు తెలంగాణవాదుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తించారు. అయినా తెలంగాణ సమాజం సహించింది. కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకుంది. అయితే, రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ అస్థిత్వాన్ని, చరిత్రను తెలిపే విధంగా సినిమాల నిర్మాణం జరగడంపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. తెలంగాణకు చెందిన దర్శకుడైన ఎన్‌.‌శంకర్‌తో పాటు ఇతర కళాకారులు, టెక్నీషియన్లను కూడా ప్రభుత్వం సరైన విధంగా గుర్తించిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై తెలంగాణ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ కళాకారులను అందలం ఎక్కించడంతో పాటు వారి ప్రాపకం కోసం వెంపర్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర కళాకారుల ఆధిపత్యం కొనసాగుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమను అందలం ఎక్కించే దిశగా చర్యలు చేపడుతుండటం గమనార్హం. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఇటీవల తెలుగు చలనచిత్ర ప్రముఖులైన చిరంజీవి, నాగార్జునతో వరుస భేటీలు నిర్వహిస్తుండటం ఇందుకు నిదర్శనం.

ఇటీవల ప్రముఖ నటుడు చిరంజీవితో మరో ప్రముఖ నటుడు నాగార్జునతో కలసి ఆయన నివాసంలో సమావేశమైన తలసాని చలనచిత్ర పరిశ్రమను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ భేటీ తరువాత మూడు రోజులకే నటుడు నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోలో మరోమారు చిరంజీవితో పాటు సినీ ప్రముఖులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ చలన చిత్ర పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు. శంషాబాద్‌ ‌విమానాశ్రయానికి సమీపంలోఅంతర్జాతీయ స్థాయి తెలంగాణ చలనచిత్ర శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్యారు. అంతేకాకుండా ఆగమేఘాల మీద వెంటనే అందుకు అవసరమైన స్థలాన్ని సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, జూబ్లీహిల్స్, ‌నానక్‌రామ్‌గూడలో 24 విభాగాల కళాకారులకు సాంకేతిక శిక్షణ కేంద్రం, సాంస్క్నతిక కేంద్రం నిర్మిస్తామని ప్రకటించారు. మరోవైపు, సినీ, టీవీ కళాకారుల ఇళ్ల నిర్మాణానికి చిత్రపురి కాలనీ పేరుతో మరో 10 ఎకరాల స్థలం కేటాయిస్తామని చెప్పారు. అలాగే,చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ప్రముఖులతో త్వరలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సమావశం జరిపించేందుకు కృషి చేస్తానని కూడా హామీ ఇచ్చారు. అయితే, ఇవన్నీ తలసాని కేవలం మంత్రి హోదాలోనే కాకుండా వీటి విధి విధానాల రూపకల్పనకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీనియర్‌ ‌నటులు చిరంజీవి, నాగార్జునలతో రెండోసారి సమావేశమైనట్లు వెల్లడించారు. చలనచిత్ర శిక్షణ సంస్థకు శంషాబాద్‌ అనువుగా ఉంటుందని చిరంజీవి, నాగార్జున తెలపగా మంత్రి మరో ఆలోచన లేకుండా సుముఖత వ్యక్తం చేశారు. సినీ కళాకారులు క్యాన్సర్‌ ‌వంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందించాలని నాగార్జున, చిరంజీవి కోరగా వెంటనే వారికి సీఎం సహాయ నిధి నుంచి ఆదుకుంటామని వెల్లడించారు. వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. కొత్త సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలను పెంచి విక్రయించుకునే అవకాశం థియేటర్ల యాజమాన్యాలకు కల్పించాలని ఇద్దరు సినీ ప్రముఖులు కోరగా మంత్రి అందుకు సైతం సరే అనేశారు.

కదలని జర్నలిస్టుల ఇళ్ళ ఫైల్‌..:
అయితే, రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉందని స్వయంగా సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా ప్రకటించగా, చలన చిత్ర ప్రముఖుల గొంతెమ్మ కోర్కెలను తీర్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని మంత్రి తలసాని హామీలు గుప్పించడంపై తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర యాజమాన్యాల ఆదేశాలను, తమ ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి జర్నలిస్టులు స్వరాష్ట్ర సాధన కోసం ముందు వరుసలో నడిచారు. వారికి నివాస స్థలాలను కేటాయించే అంశంపై కేసీఆర్‌ ‌సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఊరిస్తూనే ఉన్నారు. డబుల్‌ ‌బెడ్‌రూం హౌస్‌లు నిర్మించి ఇస్తామని ఒకసారి, అందమైన గేటెడ్‌ ‌కమ్యూనిటీ నిర్మించి ఇస్తామని మరోసారి మాయా ప్రపంచంలో విహరింపజేస్తున్నారు. తమకు నివాస స్థలాలను కేటాయించే అంశంపై ప్రెస్‌మీట్లలో గుర్తు చేసినప్పుడలా ప్రశ్నించినప్పుడల్లా సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది తీర్పు వెలువడిన మరుసటి రోజే మీకు స్థలాలంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ఆధిపత్యం ఉన్న చలనచిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులకు మాత్రం జూబ్లీహిల్స్‌లోని చిత్రపురి కాలనీ వంటి అత్యంత ఖరీదైన స్థలంలో రూ.వందల కోట్ల విలువ చేసే 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని వారు అడగకుండానే వరాల జల్లు కురిపించారు.

బల్దియా ఎన్నికలు :
అయితే, ఆంధ్ర కళాకారుల ఆధిపత్యం కొనసాగుతున్న చలనచిత్ర పరిశ్రమకు సీఎం కేసీఆర్‌ ‌వరాల జల్లు కురిపించడం వెనక పెద్ద వ్యూహమే దాగుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరికొద్ది నెలల్లో జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర సినీ కళాకారులను అవమానించేలా వ్యవహరించిన కేసీఆర్‌ ఇప్పుడు అదే చలనచిత్ర పరిశ్రమపై వరాల జల్లుకురిపించడంలో ఆంతర్యం ఏమిటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన జీహెచ్‌ఎం‌సి ఎన్నికల ప్రచారంలో సైతం సీఎం కేసీఆర్‌ ఉద్యమ సమయంలో వారిని అవమానించిన విషయాన్ని పక్కనబెట్టి హైదరాబాద్‌ ‌మహానగరంలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ఓటర్ల కాలికి ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చేసిన వ్యాఖ్యానాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సినీ పరిశ్రమపై అడగకుండానే వరాల జల్లు కురిపించడం, రూ. కోట్ల విలువైన స్థలాన్ని నివాల గృహాల నిర్మాణం కోసం కేటాయిస్తామని హామీలు ఇవ్వడం వెనక వచ్చే జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో వారి ఓట్లను దండుకునేందుకేనని పరిశీలకులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో నగరంలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజల ఓట్ల కోసం వారితో అంటకాగుతున్న ప్రభుత్వం అంతే దూకుడును తెలంగాణ ప్రజల విషయంలో ఎందుకు ప్రదర్శించడం లేదని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply