Take a fresh look at your lifestyle.

మానవుల్లో మహనీయుడు అల్లూరి..

నేడు  99 వ వర్థంతి

మానవులు పుడతారు … చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు … వీరిని “మృతంజీవులు” అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . అటువంటి కొందరు మహానుభావులలో అగ్రగణ్యుడు మనీం దొరగా, విప్లవజ్యోతిగా గణుతికెక్కిన తెలుగు జాతికి మణిపూస అల్లూరి సీతారామరాజు. ఆయనను స్మరించుకుందాం. ఆయన పోరాటపటిమ, ధైర్య సాహసాలు అందరికీ తెలిసినవే.. మనం ఆయనను  కొత్త కోణాల్లో దర్శించుకుందాం.

భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నాడు. సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి.   తెలుగు నేలపై జన్మించిన స్వాతంత్ర సమరయోధుడు. ఈయన దారిలోనే తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో అడవుల ప్రదేశంలో మన్యం ప్రజలు విప్లవ దారిలో నడిచాయి. అల్లూరి సీతామరాజు  4 జూలై 1897 లో పాండ్రంగి గ్రామంలో లో విజయనగరం జిల్లా దగ్గర  వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు ఒక తమ్ముడు సత్యనారాయణరాజు, ఒక చెల్లి సీతమ్మ ఉన్నారు. వారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటి లంక గోదావరిలో ముని గిపోవడం వల్ల వారు అప్పనపల్లి, అంతర్వేదిపాలెం, గుడిమాలలంక, దిరుసుమర్రు, మౌందపురం వంటి ప్రాంతాలకు వలస వెళ్ళారు.

అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన మన్యం వీరుని అసలుపేరు “శ్రీరామరాజు”. ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు.  అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంధం అట్టపైన కూఢా “శ్రీరామరాజు”, “అల్లూరి శ్రీరామరాజు” అని వ్రాసుకొన్నారు.  కాలాంతరంలో ఇతనికి “సీతారామరాజు” అనే పేరు స్థిరపడింది. తల్లి సూర్యనారాయణమ్మ సంప్ర్రదాయిక చదువు నేర్చుకొన్నది. తండ్రి వెంకటరామరాజు స్కూలు ఫైనల్ వరకు చదివారు. ఆయ్నకు చిత్రకళ, ఫొటోగ్రఫీ పట్ల మంచి అభిరుచి ఉండేది. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరావ్యాధికి గురై ఆయన తండ్రి మరణించారు.

చిన్నతనంలోనే తండ్రి మృతి రాజు జీవితంలో పెనుమార్పులు తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్ధికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు. తండ్రి పాలనలేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే సాగింది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. అప్పుడే ధారకొండ, కృష్ణదేవిపేట ప్రాంతాలు చూసారు. ఆ వయసులోనే జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నారు.

చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం ఉండేవి. తుని సమీపంలో గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశారు.  ఉత్తరభారతదేశ యాత్రలో భాగంగా బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నారు. లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యారు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతభాష నేర్చుకున్నారు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసారు.

బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చారు. గృహవైద్య గ్రంధము, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంధాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచుకొన్నారు. యుద్ధవిద్యల్లోను, ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యుడవటంచేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవారు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవారు.

చరిత్రచూస్తే రక్తపాతంలేని ఉద్యమాల్లేవు. రక్తపాతం జరక్కుండా ఉద్యమాన్ని నడిపించాలని ప్రయత్నించిన నాయకులు కూడా వున్నారు. అల్లూరి సీతారామరాజు విప్లవ నాయకుడు! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవెరైండు సార్లు కాల్పులు జరిగినా, అనవసరమైన రక్తపాతం జరగకూడదు అనే లక్ష్యంతో అనేకసార్లు అడ్డుకున్నాడు. అల్లూరి ఆదర్శ ప్రాయుడు. ఆయన విప్లవపోరాట సమయం 22 ఆగస్టు 1922 నుంచి 1924 వరకు అని చెప్పవచ్చు.

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నారు.  వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసారు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేసారు. ఆయన అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.  మన్యం లోని గిరిజనులను సమీకరించి, యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేసి తెల్ల వాళ్ళ పై సమర శంఖంఉదాడు.

శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై 4,000 రూపాయలు జరిమానా, అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి “నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది” అని కలెక్టరుకు రాజు “మిరపకాయ టపా” పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు.

1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు దేశ దాస్య విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ఈ విప్లవవీరుని గౌరవార్దం ప్రభుత్వం 26-12-1986 న ఒకప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసింది. మే 7, నేడాయాన  99 వ వర్థంతి పురస్కరించుకుని నివాళులర్పిద్దాం.

నందిరాజు రాధాకృష్ణ,   98481 28215

Leave a Reply