ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు మరిన్ని నిధులు సవరణ చేసిన తర్వాత అయినా కనీసం కేటాయించాలని టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వర్రావు కేంద్రానికి సూచన చేశారు. శుక్రవారం ఆయన బడ్జెట్‌పై లోక్‌సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు నూతన విమానాశ్రయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం భారీ సాగు నీటి ప్రాజెక్టుకు జాతీయ హెూదా కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్‌లో గిరిజన సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్నారు. నీటి ఆయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పథకాలకు ఆర్ధిక సాయం అందించాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు.
భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్ర భాగాన నిలచిన తెలంగాణ రాష్ట్రంలో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసి, బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్-నాగపూర్, వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రీయల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని రీజనల్ రింగ్ రోడ్ మంజూరు చేయాలని కోరారు. 993.65 కోట్ల రూపాయల నిధులతో సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని నామ కేంద్రన్ని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలన్నారు. మౌళిక సదుపాయల కల్పనకు అధిక నిధులు ఇవ్వాలన్నారు.
మౌళిక సదుపాయాల కల్పన కింద దాదాపు 7400 ప్రాజెక్టులను చేపట్టినట్టు కేంద్రమంత్రి వివరించారని, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హెూదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణలో ఇతర పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించాలన్నారు. భారత మాల పరియోజన పథకం కింద 31.80 కి.మీ కోదాడ – ఖమ్మం నాలుగు లైన్ల రహదారిని తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించాలన్నారు.
కొత్త జిల్లాల్లో నవోదయ, కేంద్రీయ, సైనిక స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాలో కూడా జవహార్ నవోదయ, కేంద్రీయ విద్యాలాయాల ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్లో ఐఐఐటీ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో నదులు అనుసంధానం చేయాలంటూ తన బడ్జెట్ ప్రసంగం ముగించారు. అయితే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ జిఎస్టీ నిధుల ప్రస్తావన తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించడం నామా మర్చిపోయారు.