Take a fresh look at your lifestyle.

బహుజనుల బతుకుగోస ‘ఆళ్లకోస’

‘గాయపడ్డ హృదయాలే గేయాలను లిఖిస్తాయి, హేయాలను ఎదుర్కుంటూ….’ అన్నట్లుగా యోచన రాసిన ‘ఆళ్లకోస’ ను చదివితే తన అంతరార్థం, తాత్వికత రచనలోని ఆర్ధత అర్ధమవుతుంది. వరంగల్‌ ‌జిల్లా నర్సంపేట తాలూకాలోని మారుమూల పల్లె మాదన్నపేట లో పుట్టిన మట్టిపరిమళం మన యోచన.తన తండ్రి బ్రహ్మచారి స్వయానా కవి, గాయకుడు.తెలంగాణ తొలి దశ ఉద్యమానికి తన పాటలతో ఊతమిస్తే,తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మలి దశ తెలంగాణ  పోరాటంలో కొడుకు యోచన తన కలాన్ని, గళాన్ని జులిపించాడు. తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ అనేక ధూమ్‌ ‌దాం వేదికలపై తనదైన ముద్రవేసుకొని, సంచార బైరాగియై గల్లీ గల్లీ,పల్లె పల్లె కలియతిరిగి ప్రజలకు ఉద్యమ ఆకాంక్షను తన పాటలతో తెలియజెప్పిన నిబద్ధత కలిగిన తెలంగాణ ఉద్యమకళా కారుడు. అమరులు కలలు గన్న స్వప్నం కోసం ఆకలి లేని,శోకం లేని లోకం కోసం సమసమాజ నిర్మాణం కోసం, సమాజమార్పుకై నిత్యం పరితపించే నిత్య సత్యాన్వేషి, ప్రజావాగ్గేయకారుడు యోచన.   కాకి కి పర్యాయ పదం ‘ఆళ్లకోస’.

ఆళ్లకోస అనే పదాన్ని పుస్తకానికి టైటిల్‌ ‌పెట్టడంలో అతని సృజనాత్మకత,కవితాత్మకత మనకు తెలుస్తుంది.మాములు పుస్తకాన్ని చదివినట్టు చదువుకుంటూ వెళ్తే సరిపోదు, తాను ఆవిష్కరించిన తత్వాన్ని తెలుసుకోవడానికి లోతైన విశ్లేషణ పాఠకుడికి అవసరం. యోచన గొప్పతనం ఏంటంటే కవులు  ఏదో ఒక వాదాన్ని తగిలించుకుని ఆ ఒక్కదానికి పరిమితం అవుతారు, కానీ ఇతను ఎల్లలు లేని కవీంద్రుడు స్త్రీలు, దళితులు, బీసీలు, ట్రైబల్స్, అడవి బిడ్డలు, వీరులు, యోధులు, అమరులు, విప్లవకారుల తో పాటు సమకాలీన అంశాలకు వెంటనే స్పందించి అప్పటికప్పుడు కై గట్టి పాట రాసి పాడగల నేర్పరి. బహుజనుల బాధలను కష్టాలను, కన్నీళ్లను, అవమానాలను, అణిచివేతలను తానే స్వయంగా ‘కాకి’ అవతారమెత్తికలవరపడుతూ లోకమంతా కలియతిరిగుతూ బహుజనుల ఐక్యతను తన భుజాన వేసుకుని సబ్బండ జాతులను సంఘటిత పరచడానికి తాను గొంతెత్తి పాడుతూ జాతిని జాగురుత పరుస్తాడు. మార్కస్ ‌వాదాన్ని, అంబేద్కర్‌ ‌నినాదాన్ని తన పాటతో ప్రజలకు చేరువ చేస్తాడు.

కాకి(ఆళ్లకోస) గేయంలో ‘ఎగిరే పక్షుల్లో దళిత జాతి నిదమ్మా’ అన్నప్పుడు శ్రోత మొఖం ప్రశ్నార్ధకమై దానిలో తాత్వికత ను తెలుసుకునేందుకు ఆలోచనలో పడతాడు. జాతి భేదాలు మనుషుల్లో మాత్రమే కానీ, మిగితా జంతువుల్లో ఉండదు కదా..! మరి కేవలం మనమే ఈ వివక్షను ఎందుకు చూపిస్తాం?అని మనకుమనమే ప్రశ్నించుకునేలా చేస్తాడు. ఇంతటి ఆలోచనలు రేపే రచనా శైలి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమయ్య లాంటి వారి తర్వాత మనం యోచన రచనల్లో గమనించవచ్చు. ‘నన్ను గన్న నా పల్లె’ పాటలో కాలుష్యం చెరిగి కరువు కోరల నలిగి/అస్థిపంజరమోలే సచ్చి బతుకుతున్న’అని పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతల అవసరాన్ని ప్రజలకు ఎరుకపరుస్తాడు. ‘సంసారం’ గేయంలో ‘ఏం చేద్దునో ఎంతకని జేద్దునో/సంసారం సల్లగుండా సావన్న రాదాయే’అని పాడుతూ మధ్యతరగతి జీవితంలో ఉండే బాధలను చూపెడుతాడు. నాన్న, అవ్వ,అర్ధాంగి పాటలో కుటుంబం గొప్పతనాన్ని చెప్తాడు.

‘అంటరానివాళ్ళు అని అవహేళన చేస్తుంటే/మనుధర్మం మంట గలిపి కంటనీరు తుడిసినావు’అంబేద్కర్‌ ‌రాజ్యాంగాన్ని రాసిన కలాన్ని గూర్చి పాడుకుంటాడు.’ఏది నీ సొంతమనుకోకూరా/దేనికి బానిసై పోకురా/వ్యర్ధమైనది మనిషి స్వార్ధమేరా/దాన్ని లొంగదీసిన జన్మ ధన్యమేరా..’ అంటూ జీవిన తత్వాన్ని భోదిస్తాడు. బడిబాట కార్యక్రమానికి రాసిన పాటలో మోయలేని బడిసంచి వాని వీపుకెత్తిర్రు/కట్టలేని బడిఫీజు మన నెత్తి మోపుతుండు’అంటూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలను చైతన్యపరుస్తాడు.’జెనపదం’ పాటలో తెలంగాణలో జరిగిన ఉద్యమాలకు పాట ఏవిదంగా ఊతమిచ్చింది, ఆడవాళ్లను కించపరిచే నేటి సినిమా పాటలతో పోలిస్తే జానపదం ఎప్పుడూ శిఖరమే అంటూనే ‘ప్రపంచీకరణతో పలుచనైనా/చావలేక బతికి చస్తువున్నా’అంటూ వాపోతాడు.

’కవులం మేము’పాటలో ‘కవులం మేము కళాకారులం/కళల అలల పైన కన్నీటి నావలం’అంటూ సాగె పాటలో ప్రతి కవి ఆవేదనను చెప్తాడు.నిర్భయ,ఉన్మాదం, గృహహింస, ఆడశిశువు, భద్రత, భ్రణహత్యలు, సారా పోరు,హక్కుల పిడికిలెత్తు వంటి పాటల్లో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూనే,’స్వేచ్ఛ లేని ఈ సమాజ మార్పుకై/ఓర్పు వీడి నువ్వు పోరాడాలి తల్లీ’ అంటూ వారికి ధైర్యాన్ని నురిపోస్తాడు.’ కులగోడలు’పాటలో ‘కులగోడలు కూలగొట్టాలిరా/మనువాదులను బొంద పెట్టాలిరా/ఆచారాలకు అగ్గి బెట్టాలిరా/కోతి నుండి జాతి బుట్టిందిరా/మధ్యలో మతమెట్ల పుట్టిందిరా’ వంటి సూటి ప్రశ్నలను సంధిస్తాడు.’ రెచ్చగొట్ట చిచ్చు పెడుతుంది రాజ్యం/మనిషి మనిషిని చంపుకునే తత్వము’అని మతవిద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడిపే పార్టీల కుట్రలను ప్రజల ముందు ఎండగడుతాడు. ‘కూసోని మేసేటోడు కులమును కనిపెట్టిండన్నా/బావవాద మహిమలు జూపి భౌతిక విలువల్ని తొక్కి/బలహీనుల రక్తందాగ అవతరించే అగ్రవర్ణము’ అంటూ ‘కులమెట్ల బుట్టె’పాట సాగుతుంది. కులవృత్తులపై రాసిన గేయాలైన కంసాలి, గౌడన్న, నాయబ్రాహ్మణులం, సాకలోళ్లం, తెనుగోళ్ళు, కుమ్మరోళ్ళం, గోళ్లకుర్మలు,ఒడ్డెరోళ్ళు వంటి పాటల్లో ‘నీ రెక్కలు పిండి జేసినా కొండలు/నినుజూసి కరుగవు గుండెలు’ అంటూ వాళ్ళ బతుకుగోస, శ్రమైకజీవన సౌందర్యాన్ని చూపెడుతాడు.

’జిందాబాద్‌ ‌హైదరాబాద్‌’ ‌పాటలో ‘బతుకుదెరువు బందుత్వమిది/వలస పక్షులకు గర్భగుడి’అని నగర జీవన వైరుధ్యాలను వినిపిస్తాడు. ‘మంత్రాలు పాటలో ‘మంత్రాలతో మరణిస్తారంటే/మరణాయుడలేందుకు/మాటలకు శక్తి ఉంటే/నాటో నాసాలెందుకురా’ అని మూఢనమ్మకాలపై పాడి జనాలను జాగురుతపరుస్తాడు.చాకలి ఐలమ్మ, అంబెడ్కర్‌, ‌పూలే, కాళోజీ, శ్రీశ్రీ, జయశంకర్‌, ‌కొమరం బీమ్‌ ‌లపై రాసిన పాటల్లో ‘అమరుడా కొమరం భీమ్‌ ‌నిన్ను ఎట్లా మరుతుమురా’ అనే పాట వింటూఉంటే రోమాలు నిక్కపొడుస్తాయి.విద్యార్థులు పార్టీల కోణంలో, కుల దృక్పథంతో కాకుండా వర్గ దృక్పథంతో పోరాడాలని పిలుపునిస్తాడు.

అణగారిన వర్గాలపై, ప్రకృతి రమణీయతపై ,పర్యావరణ కాలుష్యంపై ఏ పాట రాసినా తనది ప్రజల పక్షమే. ‘కవికి కాదేదీ అనర్హం’ అన్నట్టుగా ఏ వస్తువును, సందర్భాన్ని వదిలిపెట్టలేదు. ఆళ్లకోస పుస్తకంలో 101 పాటలతో కూర్చిన కూర్పు సుమతి శతకం, వేమన శతకాల్లో ఉన్న తాత్వికతను చెప్పే నవయువ వాగ్గేయకారుడు అనిపిస్తుంది. అరుణోదయ రామారావుపై నాగన్న  పాడిన పాట’ నువ్వు గొంతెత్తితే గోదావరీ లోయ లోయంత ఊగింది ఉయ్యాలా/నీ పాట వింటే నక్సల్బరీ నవ యౌవనమైంది ఆవేళా’ అనే విప్లవ గీతిక వింటే తను పదాలకే ఉద్యమాన్ని నేర్పగల సమర్థుడని అర్ధమవుతుంది. ఒక నిరుపేద కళాకారుడు వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూనే ప్రజలను చైతన్యం చేయడానికి వేల పాటలు రాసిన అసమాన్యుడు.
ఒట్టి మనిషినై…గట్టి మనసునై…

ముఖేష్‌ ‌సామల
      సామాజిక విశ్లేషకులు
                  9703973946

Leave a Reply