‘ స్త్రీ బుద్ధి ప్రళయాంతకం’ అన్న ఆ
శాస్త్ర కారులూ మీరే
ఆడపిల్లకు అక్షర మెందుకన్నదీ మీరే
గడప దాటితే పిదప బుద్ధులొస్తాయని
మొట్టిందీ మీరే
వంట గదిలోనే తిరుగాడమని వదిలి
పెట్టిందీ మీరే
ఇల్లు వదిలితే వంచిన తల ఎత్తకుండా
వెనక్కి రమ్మందీ మీరే
మా మానాన మేం బతుకుతోంటే కామం
చూపులు గుచ్చేదీ మీరే
ఏ తప్పూ చేయక పోయినా మమ్ము
తుప్పల్లో శవం చేసేదీ మీరే
తాళి కట్టించుకొంటే తరతరాల దాస్యం
అంటకట్టేదీ మీరే
మీ పిల్లలకు ఆయాగా ఏ హక్కులు లేని
బాధ్యత లంటకట్టిందీ మీరే
మీ బూట్ల కిందే నిర్ధాక్షిణ్యంగా నలిగి
పొమ్మని శాసించేదీ మీరే
ఎంతిచ్చినా కట్నాలు చాల్లేదని కక్ష కట్టి
కాటికంపేదీ మీరే
మరి ఇప్పుడు…!!
ఏకంగా ఈ భూమండలం కక్ష్య దాటుకొని
నిగర్వంతో నింగిలోకి మేం దూసుకు
పోతుంటే…నిబిడాత్సర్యం లోంచి తేరుకొని
జబ్బలు చరుచుకొని, మీసాలు మెలేసి
సగర్వంతో ‘మా ఇంటి ఇంతి’ అంటూ….
మళ్ళీ మీరే…!!!???
(అంతరిక్షయానం చేసిన తెలుగుమ్మాయి
బండ్ల శిరీషకు ప్రత్యేక అభినందనలతో…)
– భీమవరపు పురుషోత్తమ్
9949800253