Take a fresh look at your lifestyle.

ఉద్యమాలన్నీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగినవే

  • అవి ప్రజలను చైతన్యపరుస్తాయి
  • ఐసిహెచ్‌ఆర్‌ ‌పూర్వ అధ్యక్షులు యల్లాప్రగడ సుదర్శన్‌రావు
  • వరంగల్‌లో భండారు చంద్రమౌళీశ్వర్‌రావు శతజయంతి మహోత్సవ సమావేశం
  • అంపశయ్య నవీన్‌కు సన్మానం

వరంగల్‌, ‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబర్‌ 25 : ‌ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతీ ఉద్యమం ప్రజలను చైతన్యపర్చేందుకు ఉద్భవించినవే. పాలకులను సరైన మార్గంలో పెట్టేందుకే ఉద్యమాలు పుట్టుకువస్తాయి. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న ఉద్యమాలు కూడా అలాంటివే. ఉద్యమకారులు కూడా పరిస్థితులను అధ్యయనం చేసి సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు కృష్టి చేస్తారు. గత చరిత్ర అనుభవాలే వారికి పాఠాలు నేర్పుతాయి. గత చరిత్ర అధ్యయనం లేకపోతే వర్తమానం ఉండదు. అందుకే ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైన చరిత్రాంశం ఉండాల్సిందే అంటారు కాకతీయ విశ్వవిద్యాలయ రైటైర్డ్ ఆచార్యులు, భారతీయ చరిత్ర పరిశోధన పరిషత్‌(ఐసిహెచ్‌ఆర్‌ ‌న్యూ డిల్లీ) పూర్వ అధ్యక్షులు యల్లాప్రగడ సుదర్శన్‌రావు.

దేశ స్వాతంత్య్రం, తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాట యోధుడు, ప్రగతి పత్రిక సంపాదకుడు, ప్రసిద్ధ న్యాయవాది, విద్యాపోషకుడు భండారు చంద్రమౌళీశ్వర్‌రావు శతజయంతి మహోత్సవ సమావేశం చంద్రమౌళీశ్వర్‌రావు చారిటబుల్‌ ‌ట్రస్ట్ అధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ ‌కళాశాలలో జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ ‌చామర్తి ఉమామహేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుదర్శన్‌రావు మాట్లాడుతూ..1920 నుంచి 1948 వరకు ఇక్కడ జరిగిన ఉద్యమాలన్నీ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగినవే. ముఖ్యంగా తెలుగును పరిరక్షించుకునే దిశగాకూడా సాగాయి. నాటి పాలకులు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతోపాటు తెలుగును తీవ్రంగా అణచివేశారు. అయితే నాటి పోరాటయోధులు అనేక రీతుల్లో జరిపిన పోరాటాలతో స్వాతంత్య్రమైతే సాధించుకున్నాం కాని, తెలుగుపట్ల ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నామని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆజాదీగా అమృత్‌ ‌మహోత్సవాల సందర్భంలోనే వొచ్చిన భండారు చంద్రమౌళీశ్వర్‌రావు శతజయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషాన్ని కలిగించే అంశమని, ఈ సందర్భంగానైనా మనం పెద్దలను స్మరించుకోగలుగుతున్నామన్నారు.

సమావేశంలో విశిష్ట అతిధిగా పాల్గొన్న నన్నపునేని నరేందర్‌ ‌మాట్లాడుతూ వరంగల్‌ ‌జిల్లా ఏర్పడిన తర్వాత దేశం కోసం పోరాడిన యోధుల సమాచారాన్ని సేకరించి సంక్షిప్తం చేయాలనుకుంటున్నా మన్నారు. సన్మాన గ్రహీత, ఉస్మానియా విశ్వవిద్యాలయ రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ‌శివశ్రీ ముదిగొండ శివప్రసాద్‌ ‌మాట్లాడుతూ.. భండారు చంద్రమౌళీశ్వర్‌రావు లాంటి మహాపురుషుడి పేరున శాలువ కప్పుకోవడంవల్ల తన జన్మ సార్థకమైందన్నారు. చరిత్ర అంటే ఒక ప్రాంతం చరిత్రకాదు. ఆ ప్రాంతంలోని కొందరు వ్యక్తుల చరిత్ర అన్నది తెలుసుకోవాలన్నారు. వరంగల్‌ ‌చరిత్ర గురించి ఇప్పటికే మూడు పుస్తకాలు ప్రచురించామని, మరుగున పడిన వారి వివరాలు అందజేస్తే ఉచితంగా వారి చరిత్రను ముద్రిస్తామన్నారు. మరో సన్మాన గ్రహీత అంపశయ్య నవీన్‌ ‌మాట్లాడుతూ..ఇప్పటికీ అనేక సన్మానాలను గ్రహించిన తనకు పుట్టిపెరిగిన చోట భండారు చంద్రమౌళీశ్వర్‌రావు లాంటి బహుముఖ ప్రజ్ఞావంతుడి పేర సన్మానం జరుగడం విశేషంగా భావిస్తున్నానన్నారు. సంఘంలో ఎందరో వ్యక్తులు జీవిస్తుంటారు.

కాని ప్రజలందరి ప్రశంసను అందుకునేవ్యక్తులు కొందరు మాత్రమే. అలాంటి కోవకు చెందిన వారు చంద్రమౌళీశ్వర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్‌ ‌ట్రస్టీ డాక్టర్‌ ‌భండారు ఉమామహేశ్వర్‌రావు రచించిన ‘మనో మేఘం’ కవితా సంపుటిని ముదిగొండ శివప్రసాద్‌ ఆవిష్కరించగా, ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి పుస్తక పరిచయం చేశారు. ప్రముఖ సాహిత్యకారుడు గిరిజామనోహర్‌బాబు సన్మానితులను సభకు పరిచయంచేయగా ట్రస్టీ భండారు ధవళేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చామర్తి కమల పాడిన దేశభక్తి గీతాలు పలువురిని అలరింపజేశాయి.

Leave a Reply