నాలుగురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠతకు శనివారం సాయంత్రం తెరపడింది. తెలంగాణలో తాజాగా జరిగిన రెండు ఎంఎల్సీ ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. ప్రచారం మొదలు వోట్ల లెక్కింపు వరకు రాష్ట్రంలో ఒక విధమైన టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ సిట్టింగ్ స్థానాలను పదిలపర్చుకోవడంతోపాటు ఎన్నిక జరుగుతున్న రెండవ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని ఆద్యంతం బిజెపి, టిఆర్ఎస్లు హోరాహోరీగా పోరాడాయి. చివరినిమిషం వరకుకూడా ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డాయి. అయినప్పటికీ బిజెపి తన సిట్టింగ్ స్థానంతోపాటు, మరో స్థానాన్నికూడా కోల్పోక తప్పలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంఎల్సీ స్థానాన్ని గత ఎన్నికల్లో గెలుచుకున్న బిజెపి ఈ సారి ఎట్టి పరిస్థితిలోనైనా తమ స్థానాన్ని తిరిగి దక్కించుకుంటామన్న ధీమాతో ఉండింది.
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయాలతో ఇక ముందు రాష్ట్రంలో జరిగే ఎన్నికలన్నీ తమ స్వంతమవుతాయన్న ధీమాను ఆపార్టీ వ్యక్తంచేస్తూ వచ్చింది. దానికి తగినట్లు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంఎల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడంలో టిఆర్ఎస్ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవిని చివరినిమిషంలో ప్రకటించి ఒకవిధంగా రాజకీయ పార్టీలన్నిటిని టిఆర్ఎస్ ఆశ్చర్యంలో ముంచింది. అలాగే రాజకీయాలకు కొత్త అయిన వాణిదేవిని గెలిపించుకోవడంకోసం అధికార టిఆర్ఎస్ తన పార్టీ యంత్రాంగాన్నంతా దింపింది. మంత్రులు, ఎంఎల్ఏలు, కార్పోరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులందరూ గెలుపే ధ్యేయంగా పనిచేయడమే ఆమె విజయానికి కారణమైంది. అయితే ఈ రెండు ఎంఎల్సీ స్థానాల్లోకూడా టిఆర్ఎస్ అభ్యర్దులు మొదటి ప్రాధాన్యత వోట్లతో నెగ్గలేకపోయారంటేనే అభ్యర్ధులమధ్య పోటీ ఎంత తీవ్రతరంగా సాగిందన్నది అర్థమవుతున్నది.
వాణీదేవి పోటి పడిన ఎంఎల్సీ స్థానంలో 93 మంది బరిలో ఉండడంతో మొదటి ప్రాధాన్యతలో లక్షా 12వేల 689 వోట్లను మాత్రమే ఆమె పొందారు. సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి రామచందర్‌రావుకు లక్షా 4వేల 668 వోట్లు వొచ్చాయి. గెలుపును ప్రకటించేందుకు ఈ వోట్లు సరిపోకపోవడంతో పోటీలో తక్కువ వోట్లను పొందినవారిని ఒక్కొక్కరినే ఎలిమినేట్ చేసుకుంటూ, వారికి వచ్చిన రెండవ ప్రాధాన్యత వోట్లను టిఆర్ఎస్, బిజెపి అభ్యర్దులకు కలుపుకుంటూ వచ్చిన పక్రియకు నాలుగు రోజుల సమయం పట్టింది. ఈ నాలుగు రోజులుగా అభ్యర్దులు, పార్టీలతోపాటు రాష్ట్ర ప్రజలుకూడా ఎంతో ఉత్కంఠతగా ఫలితాలను పర్యవేక్షిస్తూ వొచ్చారు. ఏదైతేనేమి రెండవ ప్రాధాన్యత వోటుతో వాణీదేవి గెలిచినట్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో టిఆర్ఎస్ వర్గాల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
అదే విధంగా వరంగల్, కరీంనగర్, నల్లగొండ ఎంఎల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలుకూడా అంతే ఉత్కంఠతను కలిగించాయి. ఇక్కడ బిజెపి నాల్గవ స్థానానికే పరిమితమైంది. టిడిపి సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈసారికూడా ద్వితీయ ప్రాధాన్యత వోట్లతో గెలుపొందాడు. గత ఎన్నికల్లో కూడా ఆయన రెండవ ప్రాధాన్యతతోనే ఈ స్థానాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందె.
ఈ స్థానంలో 71 మంది పోటీ పడినప్పటికీ చివరి వరకు ముగ్గురి మధ్యనే తీవ్ర పోటీ కొనసాగింది. రెండ స్థానంలో ఇండిపెండెంట్‌గా రంగంలో ఉన్న తీన్మార్ మల్లన్న, మూడవ స్థానంలో టిజెఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్‌లు కొనసాగారు. ఇక్కడ కూడా రెండవ ప్రాధాన్య వొట్ల లెక్కింపు అనివార్యం కావడంతో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసుకుంటూ రావడంతో కోదండరామ్‌ను ఎలిమినేట్ జాబితాలో చేరుకోకతప్పలేదు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి, తీన్మార్ మల్లన్న మధ్యనే తీవ్ర పోటీ జరిగింది.
ఏపార్టీ మద్దతు లేకుండా ఒంటరి పోరాటం చేసిన మల్లన్న మొదటి ప్రాధాన్యతలోనే 83వేల పైచిలుకు సాధించగలగడం అందరినీ ఆశ్చర్య పర్చింది. కేవలం అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా తిరిగిన మల్లన్న ఇన్ని వోట్లు సంపాదించడమట్ల రాష్ట్ర ప్రభుత్వంపైన ప్రజలకు ఎలాంటి అసంతృప్తి ఉన్నదన్నది స్పష్టమవుతున్నది. అయితే కోదండరామ్ ఎలిమినేట్ అయిన తర్వాత ఆయనకు పడిన రెండవ ప్రాధాన్యత వోట్లు తనకు ఎక్కువగా కలిసి వస్తాయని మల్లన్న ఆశించినా లాభంలేకుండా పోయింది.
ఏమైతేనేమి చివరకు టిఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోకుండా కాపాడుకోగలిగింది. అలాగే బిజెపి సిట్టింగ్ స్థానాన్ని అదనంగా పొందగలిగింది. దీంతో గత కొంతకాలంగా దూకుడుగా వ్యవహరిస్తున్న బిజెపికి బ్రేక్‌పడినట్లైంది. ఇదిలా ఉంటే ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది. ఈ రెండు స్థానాల్లో ఇరవై నుంచి ముప్పై వేలకు మించి వోట్లను సాధించలేకపోయిందా పార్టీ. టిడిపి ఒక్క స్థానంలోనే నిలబడినా పోటీ ఇవ్వలేకపోయింది. కాగా రెండవ వోటుతో నెగ్గుకొస్తారనుకున్న ఇద్దరు ప్రొఫెసర్లు నాగేశ్వర్, కోదండరామ్‌లు ఎలిమినేట్ జాబితాలో చేరుతారని ఎవరూ ఊహించలేకపోయారు.