కొరోనా నియంత్రణలో భారత్ కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్, బిల్ గేట్స్లు ప్రశంసించారు. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, ఆక్స్ ఫర్డ్కి చెందిన ఆస్ట్రానికా జెనికా సంయుక్తంగా సీరం సంస్థ రూపొందించిన కోవీ షీల్డ్ వ్యాక్సిన్లకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు లభించడం శుభ పరిణామం. కొరోనా నియంత్రణ కోసం భారత్ సాగిస్తున్న కృషి ఫలించే దిశలో సాగుతుందనీ, ఇది ఆశాజనకమైన మలుపు అని అథనామ్ వర్ణించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పలు స్వదేశీ, విదేశీ సంస్థల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. మన దేశంలో కొరోనా వ్యాక్సిన్ కోసం జనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తోంది.
కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను తయారు చేసిన సంస్థల వ్యాక్సిన్ తయారీ, పంపిణీల విషయంలో సంయుక్తంగా వ్యవహరించాలనీ, ప్రజలకు అందుబాటులోకి వ్యాక్సిన్ వొచ్చేట్టు చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఇది కూడా శుభ పరిణామం. ప్రజల్లో భయాందోళనలను తొలగించే క్రమంలో ఇది తొలి మెట్టు. వ్యాక్సిన్ సరఫరా అనేది కట్టుదిట్టంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. డబ్బున్న వారికే ముందుగా లభించడం లేని వారికి ఆలస్యంగా అందడం వంటివి ఏమీ లేకుండా అందరికీ సమానంగా టీకా పంపిణీ కావాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మన దేశంలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించి శాస్త్రజ్ఞులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకే రోజున పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్ లలో వ్యాక్సిన్ తయారు చేసే కేంద్రాలను ఆయన సందర్శించారు. ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించిన రెండు టీకాలు కూడా నూరు శాతం విజయవంతమైనవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఇలాంటి బృహత్ కార్యక్రమాలను చేపట్టేటప్పుడు విమర్శలు రావడం సహజమే. తమ టీకాపై వొచ్చిన విమర్శలకు భారత్ బయోటెక్ ఎండి కృష్ణ ఎల్లా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. దేశంలోని 26 వేల మందికి క్లినికల్ ట్రయిల్ నిర్వహించామనీ, 123 దేశాల్లో తమ టీకాకు ట్రయిల్స్ జరిగాయని చెప్పారు. అంతేకాక, ప్రపంచంలో ఈ మాదిరి టీకాలను తయారు చేసే సంస్థల సామర్ద్యంతో తమ సంస్థ సామర్ద్యం ఏమాత్రం తీసిపోనిదని ఆయన స్పష్టం చేశారు. భారత్ బయోటెక్పై ఆరోపణలు, విమర్శలు వొచ్చినట్టే మూడున్నర దశాబ్దాల క్రితం ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాక్సిన్ యాక్షన్ పోగ్రామ్(విఏపీ)పై అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కూడా విమర్శలు వొచ్చాయి. మేథో సంపత్తి పరిరక్షణ చట్టానికి ఇది వ్యతిరేకమనీ, మన దేశంలో అంటురోగాల సమాచారాన్ని ఇతర దేశాలకు తెలియజేస్తుందనీ, ఈ వ్యాక్సిన్ల ద్వారా బయో కెమికల్ అస్త్రాల రవాణా జరిగే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దాంతో ఈ కార్యక్రమం మూల పడింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సిన్ తయారీ కార్యక్రమానికి ఆనాడు రాజీవ్ కుదుర్చుకున్న విఎపి ప్రాతిపదిక అని విజ్ఞాన శాస్త్ర రంగంలో ప్రధాన సలహాదారు పేర్కొన్నారు.
మన దేశం ఇతర దేశాలకు ఏమాత్రం తీసిపోదన్న మాటను రుజువు చేస్తున్న ప్రస్తుత ఘట్టంలో యావత్ దేశం గర్విస్తోంది. మన శాస్త్రజ్ఞుల కృషిని అభినందిస్తున్నది. మన దేశం ఇప్పటికే ఉపగ్రహ ప్రయోగాలు, సమాచార ఉపగ్రహాలను రోదశిలోకి పంపడం వంటి పరిశోధనల్లో అమెరికా, రష్యాలకు ధీటుగా తయారైంది. ఇప్పుడు వైద్యఆరోగ్య రంగాల్లో కూడా ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచే కృషి మన దేశంలో జరుగుతోంది. కోవాక్సిన్, కోవి షీల్డ్ టీకాల వల్ల ప్రజల్లో కొరోనా పట్ల భయ వాతావరణం క్రమంగా తొలగిపోతుంది. ప్రజల్లో అనుమానాలూ, అపోహలూ తొలగిపోతాయి. కొరోనా మరణాల్లో అత్యధికం అనుమానాలు, భయాల వల్లనేనని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. టీకాలు తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో ఎవరి మటుకు వారు స్పృహ కలిగి ఉండాలి. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అనే స్పృహ అందరిలో వొచ్చినప్పుడు మందులు, టీకాల అవసరం అంతగా ఉండదు. ఇవి తీసుకున్నా, నియంత్రణ జాగ్రత్తలు లేకపోతే వ్యర్థం అవుతుంది.
ఈ టీకాలను జనవరి 13 నుంచి పంపిణీ చేసేందుకు ఔషధ తయారీ సంస్థలు కృషి చేస్తున్నాయి. టీకాల తయారీలో పోటీ ఉన్నప్పటికీ, పంపిణీ విషయంలో కలిసి పని చేస్తామని ఔషధ దిగ్గజాలు ప్రకటించడం శుభ పరిణామం. దేశంలో పేదలు, మురికి వాడల్లో నివసించేవారికి ఈ టీకాలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. అలాగే, మధ్యతరగతి వర్గాలకు టీకాలను అందుబాటులోకి తేవాలి. కొరోనా మరణాలను నియంత్రించడంలో మన దేశం ఇతర దేశాలతో పోలిస్తే విజయం సాధించిందనే చెప్పవొచ్చు. అన్నీ ఉన్నా, అగ్రదేశమైన అమెరికాలోనే కొరోనా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదు అయ్యాయి. ఇందుకు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్య వైఖరి కారణం. ఏమైనా ఇప్పుడు ఎవరి మటుకు వారు స్వీయ నియంత్రణ, స్వశక్తి ద్వారా కొరోనా నియంత్రమకు కృషి చేస్తున్నారు. మన దేశంలో తయారయ్యే టీకాల సామర్ద్యంపై అంతర్జాతీయంగా అన్ని సంస్థలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. కొత్త వైరస్లకు కూడా ఈ టీకాలు పనిచేస్తాయని ఔషధ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. టీకాలు ప్రజల్లో మానసిక ధైర్యాన్ని నింపుతాయి. మిగిలిన జాగ్రత్తలు ప్రజల చేతులలో ఉన్నాయి. కొరోనాపై భారత్ సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుందాం.