Take a fresh look at your lifestyle.

ఆశల పల్లకిలో అభ్యర్థులు..!

గెలుపోటముల లెక్కలతో బిజీ..బిజీ ఫలితాలకై ఉత్కంఠతో ఎదురుచూపు

మున్సిపల్‌ ఎన్నికలు ముగిసి ఫలితాల ప్రకటనకు సమయం దగ్గర పడుతుండంతో అభ్యర్థులు గెలుపోటముల లెక్కలలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి నేతలు టికెట్ల కోసం ప్రయత్నం, ఆ తరువాత ఎన్నికల ప్రచారం వరకు బిజీ..బిజీగా గడిపిన నేతలు ఇప్పుడు తమ రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతున్నదో అనే ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో కొత్త పాలక మండళ్ల కోసం బుధవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల బరిలో నిలచిన అభ్యర్థులు గెలుపు కోసం పడరాని పాట్లు పడ్డారు. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌విడుదల చేసినప్పటి నుంచి పోలింగ్‌ ‌తేదీ వరకు సమయం తక్కువ ఉండటంతో ఉన్న కొద్ది సమయంలోనే గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేశారు.

వార్డుల వారీగా ఓటరు లిస్టు సంపాదించడం, ఓటర్లకు తెలిసిన వారిని పరిచయం చేసుకోవడం, పోలింగ్‌ ఏజెంట్లను నియమించుకోవడం వంటి గెలుపుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, తమ వద్ద ఉన్న ఆర్థిక వనరులతో పాటు ఎన్నికల సమరాంగణంలో తమ ప్రత్యర్థిని ఎదుర్కునేందుకు ధీటుగా అంతకంటే ఎక్కువ డబ్బును సమకూర్చుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రచారం ఎంత బాగా చేసినప్పటికీ చివరికి ఎన్నికలలో గెలుపోటములను నిర్ణయించేది డబ్బే అనే ఉద్దేశ్యంతో పోలింగ్‌ ‌ముందు రెండు రోజలు పాటు ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఎన్నికలలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థి వ్యూహాలను తెలుసుకుంటూ వారిని చిత్తు చేసే విధంగా ఎలా ముందుకు సాగాలి అనే సమీకరణలపై తలమునకలయ్యారు. చివరికి తాము విజయం కోసం చేసిన ప్రయత్నాలు ఏ మేరకు ఫలించాయో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తమ వార్డులో ఉన్న ఓటర్లలో సామాజిక వర్గాల వారీగా ఏ కులం ఓట్లు ఎటు పడ్డాయి. అందుకు ఏయే కారణాలు దారి తీశాయి ? ఓటర్లు తమకు అనుకూలంగా ఓటు వేశారా ? లేక వ్యతిరేకంగా వేశారా ? ఓటర్లు ఏ అంశానికి ప్రభావితం అయ్యారు ? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే, తాము డబ్బులు పంపిణీ చేసిన చోట ఓటర్లకు సరిగా డబ్బు పంపిణీ జరిగిందా ? ఇతర వస్తువులు సరిగా అందాయా ? అని ఆరా తీస్తున్నారు. ఫీర్జాదిగూడ, బోడుప్పల్‌ ‌జంట కార్పొరేషన్లలో పలు పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు బుధవారం సాయంత్రం పోలింగ్‌ ‌ముగిసినప్పటి నుంచి తమ గెలుపోటములపై ఆరా తీయాలని తమ అనుచరులను పురమాయించారు. అలాగే, తాము పోటీ చేసిన పార్టీపై ఓటర్లలో ఏ విధమైన అభిప్రాయం ఉంది ? అది తమ గెలుపుకు ఎంతమేర ఉపయోగపడుతుంది ? అని వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, తాము గెలిచిన పక్షంలో అనుభవించే అధికార దర్పంపై మరికొందరు అభ్యర్థులు కలలు కంటున్నారు. మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌లేదా కార్పొరేషన్‌ ‌మేయర్‌గా ఎన్నికైతే రాజకీయ హోదా పెరగడంతో బాటు అది వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమకు టికెట్‌ ‌లభించడానికి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. మరికొందరు ఒకవేళ ఎన్నికలలో తమ ఆశలు ఫలించక ఓటమి పాలయిన పక్షంలో భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై సైతం అప్పుడే తర్జనభర్జనలు పడుతున్నారు. అలాగే, తాము గెలుపు కోసం ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బు సంగతి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమకు ఎన్నికలలో పోటీ చేయడానికి అంత ఆర్థిక స్థోమత లేనప్పటికీ రాజకీయ అధికారంపై మక్కువతో తెలిసిన వారి నుంచి ఆర్థిక వనరులు సమకూర్చుకున్నారు. గెలిస్తే అంతకు ఎక్కువగా సంపాదించవచ్చని వారికి అప్పుల రూపంలో అదే స్థాయిలో ఆర్థిక వనరులు సమకూరాయి. ఎన్నికలలో నామినేషన్‌ ‌వేసినప్పటి నుంచి పోలింగ్‌ ‌పూర్తయిన రోజు వరకు ప్రచారం నుంచి మొదలుకుని ఫలితాల ప్రకటన వరకు జరిగిన పరిణామాలను బేరీజు వేసుకుంటూ ఉత్కంఠతో గడుపుతున్నారు.

Leave a Reply