Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌ ఎన్నికల నగరాతో పార్టీల సమరోత్సాహం

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల నగారా మోగింది. నియమావళి అమలులోకి వొచ్చింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ఉరకలు వేస్తోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో నగర సమస్యలు ప్రధాన పాత్ర వహించే కార్పొరేషన్‌ ఎన్నికలను పోల్చడం వల్ల కమలనాథుల అంచనాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకుల భావన. ఈ ఎన్నికల్లో తెరాస, బీజేపీల మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుందా లేక కాంగ్రెస్‌, ‌జనసేన, తెలుగుదేశం వంటి పార్టీల ప్రభావం ఏమేరకు ఉంటుందనే దానిపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం అవుతుంది. డిసెంబర్‌ ఒకటవ తేదీన పోలింగ్‌ ‌జరుగుతుంది. భారీ వర్షాలు, వరదల వల్ల మునిగిన అనేక ప్రాంతాలు ఇంకా తేరుకోకముందే ఎన్నికలను అత్యవసరంగా జరిపించేందుకు తెరాస ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోందో, బీజేపీ అంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో ఉంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మరింత శక్తిని ఇచ్చాయి. బీహార్‌లో ఆ పార్టీ కిందటి ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లను సంపాదించినప్పటికీ చిన్న పార్టీలను కలుపుకోనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల పరిస్థితిలో లేదు. హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌లో 150 స్థానాలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ముందుంది. చాలా డివిజన్లకు అర్హులైన అభ్యర్థులను గుర్తించింది.

తెరాస ముందు నుంచి గ్రేటర్‌పై తన పట్టు నిలబెట్టుకునేందుకు పథకాలనూ, వరద సహాయక కార్యక్రమాలను ఆసరాగా చేసుకుని ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎన్నో విధాల ప్రయత్నిస్తోంది. అయితే, అదే సందర్భంలో వరద సహాయం ఇంకా చాలా మందికి సక్రమంగా అందలేదంటూ వొస్తున్న ఆక్రందనలూ, ఆరోపణలు  తెరాసకు మైనస్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఇవే అంశాలపై దృష్టిని కేంద్రీకరించింది. దుబ్బాకలో విజయం సాధించిన వెంటనే   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇదే విషయాన్ని ప్రకటించారు. గ్రేటర్‌లో పాగా వేయడమే తమ తదుపరి లక్ష్యమని ప్రకటించారు. తెరాస వైఫల్యాలే తమ ప్రచారాస్త్రాలని ఆయన ప్రకటించారు. అయితే, అధికార పార్టీకి ఉన్న వెసులుబాట్లు, సావకాశాలు తెరాసకు ఉన్నాయి. గ్రేటర్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, శాసనసభ్యులు ఇప్పటికే ఒక రౌండ్‌  ‌ప్రచారాన్ని పూర్తి చేశారు. ప్రభుత్వం అందించే సాయాన్ని పార్టీ ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారంటూ తెరాస నాయకులపై కమలనాథులు ఇప్పటికే దుమ్మెత్తి పోశారు. అందులో అసత్యం లేకపోయినా, తెరాసను ఓడించేందుకు అవే అంశాలు ఉపయోగపడవచ్చు. రాష్ట్ర మునిసిపల్‌, ఐటి శాఖల మంత్రి కెటి రామారావు హైదరాబాద్‌ ‌కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే 67 వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసిందంటూ చేసిన ప్రకటనపై అంత ఖర్చు చేస్తే గట్టిగా వర్షాలు పడితే రాజధాని వీధులు ఎందుకు కాసారాలయ్యాయంటూ  ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్ని రోడ్లు నిర్మించారో, ఎన్ని మ్యాన్‌ ‌హోల్స్‌కు మూతలు వేయించారో ఎన్ని పార్కులు నిర్మించారో కేటీ రామారావు గణాంకాలను వివరిస్తున్నారు. అయితే, ఒకటి మాత్రం నిజం.

ఇటీవల భారీవర్షాలూ, వరదలకు మునిగిన ప్రాంతాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘంతో తెరాస కుమ్మక్కయిందనీ, గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూలును హడావిడిగా ప్రకటించడం వెనుక అసలు ఉద్దేశ్యం అదేననీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. తెరాస ఎన్ని జిమ్మిక్కులు చేసినా గ్రేటర్‌లో దుబ్బాక ఫలితం రిపీట్‌  అవుతుందని ఆయన ధీమాగా చెప్పారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలూ, అమలు చేస్తున్న కార్యక్రమాలు మసిపూసి మారేడు కాయవంటివని కమలనాథులు ఆరోపిస్తున్నారు. వరద సాయాన్ని పార్టీ ప్రచారం కోసం  వినియోగించుకుంటున్నారంటూ తెరాస నాయకులపై  కాంగ్రెస్‌ ‌నాయకుడు, ఎంపీ  రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ నాయకులు జాతీయ పార్టీకి చెందిన వారమని చెప్పుకుంటున్నా, వార్డు డివిజన్‌ ఎన్నికల కోసం దిగజారి ప్రకటనలు చేస్తున్నారంటూ రేవంత రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ అధిష్ఠానం ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇన్‌ ‌చార్జిలుగా నియమించడం అసంతృప్తికి చోటు ఇచ్చింది.

ఐదుగురు ఇన్‌ ‌చార్జిలను నియమించడం, వారిలో భూపేంద్ర యాదవ్‌కు మొత్తం పర్యవేక్షక బాధ్యతలను అప్పగించడం బీజేపీ ప్రదర్శిస్తున్న సమరోత్సాహానికి నిదర్శనం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక నిధులు ఖర్చు చేయడానికి కమలనాథులు వెనకాడకపోవచ్చు. హైదరాబాద్‌ ‌గ్రేటర్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల కోసం బీజేపీ ఇంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక వొచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కూడా బీజేపీ డబ్బుకి లెక్కలేకుండా ఖర్చు చేసిందనీ, పట్టుబడిన కోట్లాది రూపాయిల్లో ఎక్కువ భాగం ఆ పార్టీకి చెందినవేనని తెరాస నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ ‌దుబ్బాకలో మూడో స్థానంలోకి నెట్టివేయబడిన అవమాన భారం నుంచి ఇంకా కోలుకోలేదు. ఆ పార్టీకి చెందిన మాజీ మేయర్‌, ‌సీనియర్‌ ‌నాయకులు బీజేపీలో చేరేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. పదవులే లక్ష్యంగా ఎన్నికల రంగంలోకి ప్రవేశించేందుకు ఇంకా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల ఉప సంహరణ సమయానికి ఎన్ని పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. గ్రేటర్‌ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేనాని, సినీనటుడు పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రకటించడంతో ఆ పార్టీతో బీజేపీ పొత్తు గురించి చర్చ మొదలైంది. అయితే, తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్‌ ‌రమణ ప్రకటించారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తర్వాత జరిగే పరిణామాలతో ఎన్నికల ముఖ చిత్రం ఓ రూపాన్ని దిద్దుకోవచ్చు.

Leave a Reply