- ఎన్నికల ప్రచారంలో బేఖాతర్ చేస్తున్న అభ్యర్థులు
- మాస్కులు, భౌతిక దూరం హుష్ కాకి
- ముంచుకొస్తున్న సెకండ్ వేవ్ ప్రమాదం
పని చేయని సీఎం హెచ్చరికలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా ముంచుకొస్తున్న కొరోనా సెకండ్ వేవ్ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించడం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ సైతం పదేపదే కొరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చేస్తున్న హెచ్చరికలు సైతం గాలికి కొట్టుకుని పోతున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలనీ సూచిస్తున్నారు. కొరోనా నియంత్రణపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం సర్వ శక్తులు వొడ్డుతున్న అభ్యర్థులు, నేతలు యధేచ్చగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాము ఎటువంటి నిబంధనలు పాటించకపోవడంతో పాటు ఇతరులకు కూడా ముప్పుడు కొనితెస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో ప్రతీ రోజూ వందల సంఖ్యలో వోటర్లను కలుస్తున్న అభ్యర్థులు భౌతిక దూరం మాట అటుంచితే కనీసం మాస్కులు కూడా ధరించకపోవడం ఆందోళన కలిగించే అంశం. జీహెచ్ఎంసి ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి అధికార టీఆర్ఎస్తో పాటు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం తదితర పార్టీలు నామినేషన్లు వేసింది మొదలు ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రచారం దాకా ప్రతీ రోజూ వందలు, వేల సంఖ్యలో ప్రజలను కలుస్తున్నారు. ఉదయాన్నే పాదయాత్రల పేరుతో ఇంటింటికీ వెళ్లి వోటర్లను వోట్లు అభ్యర్థిస్తున్నారు. తమ
పార్టీ విధానాలు, తాము ఎన్నికలలో గెలిస్తే డివిజన్ అభివృద్ధికి ఏం చేస్తారో తెలిపే కరపత్రాలను స్వయంగా పంచుతున్నారు. అయితే, ఏ పార్టీ అభ్యర్థి కూడా కొరోనా నివారణకు ముందు జాగ్రత్త చర్యగా కనీసం మాస్కులు కూడా ధరించకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. దీనికి తోడు ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ కార్యకర్తలు, ఆయా పార్టీలను అభిమానించే ప్రజలు, మద్దతుదారులు సైతం ముంచుకొస్తున్న కొరోనా సెకండ్ వేవ్ ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
పార్టీ విధానాలు, తాము ఎన్నికలలో గెలిస్తే డివిజన్ అభివృద్ధికి ఏం చేస్తారో తెలిపే కరపత్రాలను స్వయంగా పంచుతున్నారు. అయితే, ఏ పార్టీ అభ్యర్థి కూడా కొరోనా నివారణకు ముందు జాగ్రత్త చర్యగా కనీసం మాస్కులు కూడా ధరించకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. దీనికి తోడు ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ కార్యకర్తలు, ఆయా పార్టీలను అభిమానించే ప్రజలు, మద్దతుదారులు సైతం ముంచుకొస్తున్న కొరోనా సెకండ్ వేవ్ ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
డివిజన్లలో పాదయాత్రలు, ర్యాలీలు, బహిరంగ సభలలో అభ్యర్థులతో తిరుగుతూ కొరోనా విస్తరించే అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రజలు కూడా ప్రస్తుతం కొరోనా తగ్గుముఖం పట్టిందన్న అభిప్రాయంతో ఉండటం కూడా అభ్యర్థులు, నేతలు కొరోనా ముందు జాగ్రత్తలు తీసుకోక పోవడానికి కారణంగా కనిపిస్తున్నది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలోనూ కొరోనా కేసుల సంఖ్య గతంలో పోలిస్లే చాలా వరకు తగ్గింది. ప్రజలు కూడా గతంలో పాటించిన నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. హైదరాబాద్ నగరంలోని వ్యాపార, వాణిజ్య కూడళ్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో సైతం మాస్కులు దరించకుండానే బహిరంగంగానే రోజువారీ పనులు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు, ప్రజలు కొరోనా నిబంధనలను గాలికి వదిలేయడంపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొరోనా సెకండ్ వేవ్ మొదటి దశలో కంటే అత్యంత వేగంగా రెండో దశలో విస్తరించే ప్రమాదం ఉందనీ, దీని పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒకరి నుంచి ఎంతో మందికి వ్యాపించి తద్వారా మాస్ గా విస్తరించే లక్షణం ఉన్న కొరోనా మహమ్మారిని ఏ మాత్రం విస్మరించినా ఇప్పటి వరకు కొరోనా కట్టడికి తీసుకున్న చర్యలన్నీ వృధా అవుతాయనీ, పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందనీ, అందువల్ల ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.