జిహెచ్ఎంసిలో బలహీన వర్గాల రిజర్వేషన్లను కుదించారు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
మున్సిపల్ చట్టం పట్ల ప్రభుత్వ ఆర్భాటాలు మాత్రమే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ తన అహంకారపు ఆలోచనలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ… దేశం అంతా ఒకవైపు నడుస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మరోవైపు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా సీఎం రిజర్వేషన్లు కల్పించడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తున్న మున్సిపల్ రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేయాలని టిపిసిసిని కోరుతనని అన్నారు.
ముఖ్యమంత్రి అవసరం అయితే దేవునితో పోరాటం చేస్తా అంటారు కానీ బలహీన వర్గాల రిజర్వేషన్లు లాక్కునే హక్కు ఆ దేవునికి కూడా లేదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న మొత్తం జనాభా- బీసీలకు కేటాయించిన 33 శాతం రిజర్వేషన్లలో పోటీ చేసే హక్కు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని 50శాతం మించకూడదని సుప్రీమ్‌కోర్టు తీర్పులో ఉందని, జనభా ప్రాతిపధికన ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉందని గుర్తు చేశారు.