Take a fresh look at your lifestyle.

‘‘అక్షరం’’

రాస్తున్న ప్రతి అక్షరం నగ్న సత్యమే
నిజం చెప్పాలంటేనే భయం
నా నీడంటేనే నాకు భయం..
నా ఆలోచనల్లో చెదలు చొచ్చి
చుట్టున్నా పరిస్థితుల్ని..
రాజకీయ రంగుల్ని అద్దుతున్నాయి

ఏం మాట్లాడిన పాపమే
ఏం నిలదీసిన నేరమే !
కలం సిరా చుట్టూ బిగుసుకుంటున్న
ఇనుప సంకెళ్ళ చట్టాల చట్రాలు

వున్నోడికి పందేరాలు..
లేనోడికి బూచోడి భయం..
అంగడిలో సరకులు ఈ బతుకులు
అమ్ముకుందామన్న అణా పైసా ఆశ లేదు
వాళ్లు చెప్పిందే వేదం.. ఆడిందే నాటకం
లేదంటే బతుకులు జైలు పాలే. !

బాంచన బతుకులు మళ్ళీ మొదలయ్యే..
దొరతనపు కుర్చీ మీసం మీసం మేలేస్తుంటే..
ఏకచక్రాధిపత్యం బుసలు కొడుతోందీ. !
అహంకారపు అధికారపు అనవాలు..
అబ్రక దబ్రాలా.. కనికట్టు విద్యలతో
జనాల్ని గారడీ(మాయ ) చేస్తున్నారు !!

ఐదేళ్లకొకసారి వేషం మారుతోంది
అయినా.. సామాన్యుని గోస తీరటం లేదు
డెబ్బది మూడేళ్ళ స్వాతంత్య్రంలో..
ఎక్కడా వేసిన గొంగడి.. అక్కడే ఆన్నట్టూ
కొరోనా కాటుకు విల విల లాడిన
వలస బతుకుల జీవిత గాధలే..
కళ్ళకు కట్టిన సజీవ సాక్ష్యాలు !

కొరోనా గాయాలతో దగా పడ్డా..
వలస బతుకు చిత్రం..
బండ బారిన జనం గుండెల్లో
మానవత్వ పరిమళాలను తట్టి లేపింది
ఈ దేశ మట్టి మొదళ్లు.. నిరంతరం
వలస పక్షుల కన్నీటి రుధిర ధారలతో
అభిషేకం జరుపుకుంటుంటే..
కరుణార్ద్ర హృదయాలలో
వీళ్ళు మనవాళ్లే ననే భావన..
వాళ్ళ గుండెలకు హత్తుకొని..
ఓదార్పు నిస్తోంది
అందరి నోట వాళ్ళ జపమే !

మాటలతో కాదు చేతలతో
చేయూత నిద్దాం
కొరోనా నేర్పుతున్నా గుణపాఠాలతో
రేపటి వలస బతుకులల్లో..
మళ్ళీ చీకట్లు అలుముకోకుండా
కవి కన్నీళ్లతో తడిసి ముద్దయిన
అక్షరం..
అమ్మ జోలపాటై పురుడు పోసుకుంటుందీ. !
నవ భారత నిర్మాణానికి
చిరు దివ్వెలను వెలిగిస్తోందీ. !!
జై హింద్‌
– ‌రవీందర్‌ ‌కొండ, 9848408612

Leave a Reply