Take a fresh look at your lifestyle.

అకాలీదళ్‌ ‌వొత్తిడి రాజకీయాలు

ఉమ్మడి జాబితాలోని అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గిపోవడమే కాకుండా, అధికారాలకు కత్తెర పడుతోంది.  విద్యుత్‌ ‌చట్టం సవరణపై బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులు ఇప్పటికే నిరసన తెలిపాయి. ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి  పార్లమెంటు రెండు రోజుల క్రితం ఆమోదించిన బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని బీజేపీ మిత్ర పక్షమైన శిరోమణి అకాలీదళ్‌ ‌వాదిస్తోంది.   గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ ‌స్థానే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. శిరోమణి అకాలీదళ్‌ ‌బీజేపీకి సహజ మిత్ర పక్షం. అందువల్ల  గతంలో ఇలాంటి బిల్లులు, ఆర్డినెన్స్‌లు తీసుకుని వచ్చినప్పుడు సర్దుకుని పోయేది. ఇప్పుడు నిరసన తెలియజేయడమే కాకుండా ఆ  పార్టీకి చెందిన హర్‌  ‌సిమ్రత్‌ ‌కౌర్‌  ‌కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌ ‌బీర్‌ ‌సింగ్‌ ‌సతీమణి అయిన హర్‌ ‌సిమ్రత్‌ ‌కౌర్‌ ‌రాజీనామా ఎన్‌డిఏలో లుకలుకలకు  కారణంగా   అభివర్ణితమైనప్పటికీ, అకాలీదళ్‌ ‌ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌హయాం నుంచి బిజేపీ కూటమిలోనే కొనసాగుతోంది. ఇరు పార్టీల మధ్య రాజకీయంగా పటిష్ఠమైన బంధం ఉంది. ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత సంఘటనలను ఎన్నికల ముందు ప్రస్తావించి ఈ రెండు పార్టీలు రాజకీయ లబ్ధి పొందుతూ ఉంటాయి. అందువల్ల ఈ రెండు పార్టీల బంధం అంత తేలిగ్గా తెగిపోతుందని అనుకోవడానికి వీలు లేదు. పంజాబ్‌ ‌వ్యవసాయానికీ, పరిశ్రమలకూ పేరొందిన రాష్ట్రం. ముఖ్యంగా, వ్యవసాయ రంగానికి చెందిన లాబీ తలుచుకుంటే అక్కడి ప్రభుత్వం పడిపోతుంది. గతంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అందువల్ల రైతుల నుంచి వచ్చిన వొత్తిడి కారణంగానే బాదల్‌ ‌కోడలు అయిన హర్‌ ‌సిమ్రత్‌  ‌రాజీనామా చేసి ఉంటారు. రాజకీయంగా ఇరు పార్టీల మధ్య  కొంత ఉద్రిక్తతలు ఏర్పడ్డాయన్న వార్తలు కూడా వచ్చాయి. మహారాష్ట్రలో శివసేన మాదిరిగానే, పంజాబ్‌లో  అకాలీ దళ్‌ ‌కూటమి నేతృత్వం కోసం పట్టుపడుతోంది. ఇంతవరకూ అకాలీదళ్‌దే పై చేయిగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు బీజేపీ చెరిసగం సీట్లు పంచుకుందామన్న ప్రతిపాదన చేసింది. దాని కోసం వొత్తిడి చేస్తోంది. అయితే, అకాలీదళ్‌ ఇం‌దుకు అంగీకరించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 18 మాసాల వ్యవధి ఉన్నప్పటికీ, ఇప్పుడే  సీట్ల సంగతి తేల్చాలని అకాలీదళ్‌ ‌వొత్తిడి చేస్తోంది. ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌హయోంలో కూటమి నేతృత్వం కోసం బీజేపీ పట్టుపట్టలేదు. మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్‌ ‌థాకరే ఉన్నప్పుడు సర్దుకుని పోయినట్టే, ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌హయాంలో సర్దుకుని పోయింది. సుఖబీర్‌ ‌సింగ్‌ ‌బాదల్‌కు ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌కి ఉన్నంత జనాదరణ లేదని బీజేపీకి తెలుసు. అందుకే, అకాలీ డిమాండ్‌ను అంగీకరించడం లేదు.

వ్యవసాయోత్పత్తుల ధరల పెంపునకూ, నిల్వల పరిమితులకూ లింక్‌ ఉం‌డేట్టు తీసుకుని వచ్చిన బిల్లు వల్ల పెద్ద రైతులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని పంజాబ్‌ ‌రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించిన బిల్లు వల్ల పెద్ద భూస్వాములకే ప్రయోజనం కలుగుతుందని రైతులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్‌ ‌వ్యవసాయానికి ప్రయోజనం కలిగించడం కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వ్యవసాయరంగ నిపుణుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. పెద్ద రైతులు చిన్న రైతుల వద్ద పంట దిగుబడిని ఏకమొత్తంగా కొనుగోలు చేసి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఇది తోడ్పడుతుందన్న అనుమానాలను  వారు వ్యక్తం చేస్తున్నారు.  పంటకు తగిన ధర వచ్చేవరకూ నిల్వచేసుకునే సౌకర్యాన్ని రైతులకు ప్రభుత్వం కల్పించాలనీ, ప్రభుత్వమే ముందుగా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని వారు డిమాం డ్‌ ‌చేస్తున్నారు. కాంట్రాక్టు  వ్యవసాయాన్ని తెలుగు రాష్ట్రాల రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు. సన్నకారు, మధ్యతరగతి రైతులకు ప్రయోజనం కల్పించడమే తమ లక్ష్యమని పదే పదే ప్రకటనలు చేసే ప్రభుత్వాలు చివరికి కాంట్రాక్టు వ్యవసాయం చేసే పెద్ద రైతులకే లొంగిపోతున్నాయన్నది సామాన్య రైతుల అభిప్రాయం. బీజేపీ మొదటి నుంచి పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలను కాపాడే పార్టీగా ముద్ర పడింది. జనతా పార్టీ చీలిపోవడానికి అప్పటి ఉప ప్రధాని చరణ్‌ ‌సింగ్‌ ‌బీజేపీ వ్యవసాయ విధానంపై ధ్వజమెత్తడమే కారణం. చరణ్‌ ‌సింగ్‌ ‌లోక్‌ ‌దళ్‌ ‌పార్టీని ఏర్పాటు చేసింది కూడా అందుకే. బీజేపీ పట్టణాలు, నగరాల్లో ఉండే సంపన్న వర్గాలకు  అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంటుందని అప్పట్లో  చరణ్‌ ‌సింగ్‌ ‌బహిరంగంగానే ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య సైద్ధాంతిక సమరం కారణంగానే మొరార్జీ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం కుప్పకూలింది. వాజ్‌పేయి హయాంలో ఇలాంటి పేచీలు రాలేదు. ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ అలిగనప్పుడల్లా ఉపప్రధాని అద్వానీని చండీగఢ్‌కు పంపి సర్దుబాటు చేయించేవారు. అలాగే, శివసేనతో ఘర్షణ తలెత్తినప్పుడు కూడా ఇదే రీతిలో సమస్య జటిలం కాకుండా చేసేవారు. మోడీ కూడా తన ఇమేజ్‌ ఆధారంగా ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపై నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, స్థానిక నాయకత్వాన్ని బలపడేట్టు చేసుకోవడానికి శివసేన మాదిరిగానే పంజాబ్‌లో అకాలీదళ్‌ ‌వొత్తిడి రాజకీయాలకు పాల్పడుతుండవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. మోడీ జోక్యంతో ఈ సమస్య పరిష్కారం కావచ్చు. వ్యవసాయ విధానం అత్యుత్తమమైనదని ఆయన ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. కేంద్రం అండలేనిదే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు నిలదొక్కుకోలేవు. తెలుగు దేశం అనుభవమే ఇందుకు నిదర్శనం.

Leave a Reply