Take a fresh look at your lifestyle.

ఆగం చేస్తున్న ఆకాల వర్షాలు

అకాల వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. మొత్తం జనజీవనమే అతలాకుతలమై పోతున్నది. పైగా పంటలపైన కూడా ఈ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒకవైపు ఊర్లకు ఊర్లే జలమయమై పోతుంటే తెల్లవార్లు నిద్రాహారాలు మాని, ఇండ్లలోకి చేరుతున్న నీటిని ఎత్తిపారబోస్తూ వందలాది మంది శివరాత్రి జాగరణ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నదులు, ఉపనదులు, చెరువులు, కుంటలు, చివరకు కాలువలు పొంగి పొర్లుతుండడంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఆంతరాయం ఏర్పడింది. చివరకు పశువులకు దానా కూడా కరువైపోయింది. అన్నీ నీటిమయం కావడంతో కన్నీరు పెట్టకతప్పని పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం పడిన వర్షాల నష్టాల నుంచే ఇంకా కోలుకోలేక పోతున్న రైతులకు ఈ అకాల వర్షాలు మరింత కుంగదీస్తున్నాయి. చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరడంతో గత నష్టాన్ని మరిచిపోయి మరింత ఎక్కువ సాగు చేసారు ఈసారి రైతులు. అయితే వారి ఆశ అడియాశలాగే తయారైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ అకాల వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకల కారణంగా ఎంతలేదన్నా సుమారుగా నాలుగు లక్షల ఎకరాకు పైగానే పంటలకు నష్టం వాటిల్లి ఉండవచ్చన్నది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. ముఖ్యంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది వరి సాగు రైతాంగానికి. ఆ తర్వాత పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర విఘాతమేర్పడింది. అందుతున్న సమాచారం మేరకు నిజామాబాద్‌, ‌కామారెడ్డి, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో పంటలకు భారీ నష్టం సంభవించిందని తెలుస్తున్నది. నిజామాబాద్‌లో దాదాపుగా పన్నెండు వేల ఎకరా పంటలు నీట మునిగి పోయినట్లు తెలుస్తున్నది. అలాగే కామారెడ్డిలో ఆరువేల ఎకరాలు, ఖమ్మంలో మూడు వేల ఎకరాలు, ఇలా మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ‌మెదక్‌, ‌సంగారెడ్డి, యాదాద్రి, జయశంకర్‌ ‌భూపాలపల్లి ఇలా ప్రతీ జిల్లాలో వందలు, వేల ఎకారా పంట నీటిలో తేలాడటంతో రైతాంగానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఫలసాయం విషయమెలా ఉన్నా లక్షల రూపాయల పెట్టుబడులు కూడా నీటి పాలవడం వారిని దుంఖంలో ముంచుతుంది.

ఇక నగరాల పరిస్థితి చూస్తే ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. దశాబ్దాల కాలంగా ఇలాంటి విపత్తులను చూస్తున్నా ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే ఉంటున్నాయనడానికి, నగరాల్లో కనపడుతున్న విధ్వంసకర పరిస్థితులు. నాటి ఉమ్మడి రాష్ట్రం నుండి, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఏమాత్రం మార్పులేదనడానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం మరోటి ఉండదు. ఇన్ని సంవత్సరాల అనుభవాల నుండి పాలకులు ఏమాత్రం గుణపాఠాన్ని నేర్చుకోలేదనడానికి నగర ప్రజలే సాక్ష్యం. వర్షాకాలానికన్నా ముందు నుండే ఈ ముంపు ప్రాంతాలకు చేరే నీటిని మళ్ళించే బృహత్తర కార్యక్రమాలను చేపట్టకపోవడంవల్లే ప్రతీ ఏటా ఈ విధ్వంసం తప్పటంలేదు. చేతులు కాలినప్పుడే ఆకులు పట్టుకున్నట్లు. ఆపద కనిపించినప్పుడే ప్రణాళికలు రూపొందించడం, ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడమన్నది ఆనవాయితీగా మారింది.

ఇదిలా ఉంటే దేశానికి వెన్నెముక రైతన్నే అనేది కేవలం నినాదానికే పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో అంటే సెప్టెంబర్‌, అక్టోబర్‌ ‌నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయినవారికి కనీసం నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. దీనిపై కొందరు రైతుల పక్షాన న్యాయస్థానానికి వెళ్ళాల్సి వొచ్చింది. ఆ విషయమై తాజాగా కోర్టు తీర్పు చెబుతూ వారికి వెంటనే నష్టపరిహారాన్ని అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని నాలుగు నెలలలోపున అందించాలని కూడా పేర్కొంది. నష్టపోయిన రైతుల గణన పూర్తి చేసేందుకు మూడు నెలలు, గుర్తించిన వారికి పరిహారం అందజేసేందుకు మరో నెల సరిపోతుందని హైకోర్టు ద్విసభ్య బెంచ్‌ ‌పేర్కొంది. గత ఏడాది భారీ వర్షాల కారణంగా సుమారు పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు పాడై, సుమారు ఏడు వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించిన విషయం తెలిసిందే. ఇపుడు ప్రాథమికంగా నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లుగా అంచనా వేస్తున్నా, మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో మరెంత భారీ నష్టం వాటిల్లనుందోనన్న భయం వెంటాడుతుంది. ఈసారి కూడా ఇంచుమించు గత సంవత్సర నష్టానికి చేరువలోనే ఉండే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం సత్వరమే ఈ అంచనాలను పూర్తిచేస్తే తప్ప ఈ గులాబ్‌ ‌తుపాన్‌ ‌కారణంగా నష్టపోయిన వారికి సత్వర పరిహారం లభించే అవకాశం లేదు.

Leave a Reply