Take a fresh look at your lifestyle.

ఆ ఏకే 47 పోలీసులదే!

  • అక్కన్నపేట-హుస్నాబాద్‌ ‌ఘటనలకు లింకు
  • చోరీ పోలీస్‌గన్‌తోనే నిందితుని కాల్పులు
  • యూట్యూబ్‌లో చూసి ప్రాక్టీస్‌..
  • రిమాండు రిపోర్టులో విస్తుపోయే విషయాలు 

gunఅక్కన్నపేట కాల్పుల ఘటనకు సంబంధించి సరికొత్త విషయాలు బయటపడుతున్నాయి..ఈ కేసులో నిందితుడు సదానందం ఉపయోగించిన ఏకే 47 గన్‌, ‌దాని కార్బన్‌ ‌కూడా పోలీసులదేనట.. మూడేండ్ల కిందట హుస్నాబాద్‌ ‌పోలీస్‌స్టేషన్‌లో అతను వాటిని చోరీ చేసి మూడేండ్లుగా తన దగ్గర దాచి పెట్టుకున్నాడట..మొత్తంమీద అక్కన్నపేట ఘటనకు, హుస్నాబాద్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో గన్‌ ‌చోరీ ఘటనకు సంబంధం ఉన్నట్లు తెలుస్తున్నది. పోలీసులు ఈ సంగతి బాహాటంగా వెల్లడించడం లేదు కానీ, ఈ వివరాలన్నీ నిందితుడు సదానందం అరెస్ట్‌కు సంబంధించిన రిమాండు రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లాలో కలకలం సృష్టించిన అక్కన్నపేట కాల్పుల కేసు నిందితుడు సదానందం ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం విదితమే. ఈ నెల 7న అక్కన్నపేటలో అక్కన్నపేటకు చెందిన గంగరాజుపై అదే గ్రామానికి చెందిన సదానందం ఏకే 47తో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. తరువాత సదానందంను కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకుని, రిమాండుకు తరలించారు. ఈ ఘటనతో గ్రామస్థులే కాదు, పోలీస్‌ ‌యంత్రాంగం సైతం ఉలిక్కిపడింది. పోలీసుల విచారణలో పలు విస్తుపోయే, సంచలనాత్మక విషయాలు ఉన్నట్లు, వివరాలు రిమాండు రిపోర్టులో పేర్కొనట్లు తాజా సమాచారం. పోలీస్‌స్టేషన్‌లో ఏకే 47చోరీ, అక్కన్నపేట కాల్పుల ఘటనలు సినిమా కథలను తలపించే విధంగా ఉన్నాయి. తాను చోరీచేసిన ఏకే 47 ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో నిందితుడు సదానందం యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడట. సదానందం దగ్గర లభించిన కార్బన్‌కూడా మూడేండ్ల కిందట హుస్నాబాద్‌ ‌పోలీస్‌స్టేషన్‌లో చోరీ అయినదేనని రిపోర్టులో ఉందంటున్నారు.. పోలీసుల విచారణలో సదానందం ఇదంతా చెప్పాడంటున్నారు. చోరీ చేసిన ఏకే 47 పాడవకుండా సదానందం దానిని ఎప్పటికప్పుడు కొబ్బరి నూనెతో శుభ్రం చేసేవాడనీ, బుల్లెట్లు తీసేసి గన్‌ ‌ట్రిగ్గర్‌ ‌నొక్కుతూ ప్రాక్టీస్‌ ‌చేస్తూ ఆనందించేవాడనీ సమాచారం.

అయితే, పోలీస్‌స్టేషన్‌ ‌నుంచి ఆయుధాలను సదానందం ఎలా అపహరించాడన్న వివరాలు మాత్రం ఇప్పటికీ బయటికి రాలేదు. అసలు ఈ విషయాలన్నీ గోప్యంగానే ఉంచాలని పోలీసులు భావిస్తున్నారని వినికిడి. ఇదే విషయమై రిటైర్డ్ ‌సిఐ భూమయ్య అప్పట్లో పోలీస్‌శాఖపై కొన్ని ఆరోపణలు చేశారు. అప్పటి ఎస్‌ఐ ‌నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే స్టేషన్‌ ‌నుంచి ఆయుధాలు అపహరణకు గురైనట్టుగా ఆయన ఆరోపించిన విషయం గమనార్హం. మొత్తంమీద ఆయుధాల అపహరణకు సంబంధించి అప్పటి పోలీసుల తీరుపై అనుమానాలు వస్తున్నాయి. ఏదిఏమైనా పటిష్ఠమైన భద్రత ఉండే పోలీస్‌స్టేషన్‌లో, అందులోనూ స్టేషన్‌ ఆయుధాగారం నుంచి తుపాకులు అపహరణకు గురై మూడేండ్లయినా ఇప్పటివరకు ఆ కేసును పరిష్కరించపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply