Take a fresh look at your lifestyle.

ఐక్యవేదిక నిరాహార దీక్ష భగ్నం

  • పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌
  • ఐక్యవేదిక నేతల అరెస్టు, ప్రభుత్వ వైఖరికి ఖండన

‌పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఒక రోజు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కేవలం 100 మంది రాష్ట్ర నాయకులు మాత్రమే దీక్షలో కూర్చుని ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలియజేస్తామని చెప్పినప్పటికీ పోలీసులు అప్రజాస్వామికంగా ఐక్యవేదిక నేతలను అరెస్టు చేశారు.

పీఆర్సీ సాధన కోసం ఐక్యవేదిక భాగస్వామ్య సంఘాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శనివారం ఇందిరాపార్కులోని ధర్నా చౌక్‌ ‌వద్ద ఒక రోజు నిరాహార దీక్షను తలపెట్టారు. పరిమిత సంఖ్యలో దీక్షలో కూర్చుంటామని స్టీరింగ్‌ ‌కమిటీ సభ్యులు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు వారిని ధర్నా చౌక్‌ ‌లోనికి అనుమతించలేదు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వారంతా ఇందిరాపార్కు చౌరస్తాలోనే బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్యయుతంగా చేసే నిరసనలకు సైతం అనుమతించకుండా పోలీసులు చూపుతున్న అత్యుత్సాహం ప్రభుత్వాన్ని మరింత అప్రతిష్టపాలు చేస్తుందని స్పష్టం చేశారు. ఒకరోజు దీక్షకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా అర్ధగంట సేపు బైఠాయించిన ఐక్యవేదిక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని గాంధీనగర్‌, ‌ముషీరాబాద్‌, ‌చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్లకు తరలించగా, వారంతా అక్కడ కూడా దీక్షను కొనసాగిస్తున్నారు.

Leave a Reply