Take a fresh look at your lifestyle.

వ్యవసాయ తెలంగాణా ..!

  • రైతులకు లాభం కలిగించేందుకే పంటల నియంత్రిత విధానం
  • అధికారులు పంటల మార్పిడి విధానంపై అవగాహన కలిగించాలి
  • ఈ వానాకాలంలో మొక్కజొన్న సాగుచేస్తే రైతు బంధు వర్తించదు
  • పంటల నియంత్రిత విధానమంటే బ్రహ్మ పదార్థం కాదు 
  • వానాకాలంలో వ్యవసాయ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలోని రైతులకు లాభం కలిగించే ఉద్దేశంతోనే ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రవేశపెడుతున్నదని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఏ నేలకు ఏ పంట అనువైనదో, ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో రైతుకు తెలిసి ఉంటే నష్టం అనేది రాదని పేర్కొన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో వానాకాలం సీజన్‌లో వ్యవసాయ సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు వ్యవసాయ శాఖకు చెందిన క్షేత్రస్థాయి అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సంద్బర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వీటిలో పూర్తిగా రైతులు వరి పంటలను వేస్తే నాలుగున్నర కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనీ, అంత పెద్ద మొత్తంలో వరి వేస్తే అంత భారీ మొత్తంలో కొనుగోలు చేసే శక్తి మన రైస్‌మిల్లర్లకు లేదని వివరించారు. దీంతో పాటు అధిక దిగుబడి వల్ల రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక నష్టపోయే పరిస్తితి వస్తుందనీ, ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఇతర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. మన శాస్త్రజ్ఞలు మంచి దిగుబడి వచ్చే పంటలను సూచిస్తారనీ, వారి సూచనల మేరకు రైతులు పంటలను సాగు చేయాలన్నారు. పంటలు వేసే ముందు రైతులకు లాభసాటి అంశాలపై అవగాహన కలిగించాలని ఆదేశించారు. కొరోనా వైరస్‌ ‌కారణంగా రాష్ట్రంలో ఉన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేశామనీ, అయితే అది ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రైతులంతా విడిపోయి ఉన్నారనీ, కానీ సంఘటితంగా ఉంటే దేన్సయినా సాధించగలమనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. రానున్న 15 రోజుల్లో ప్రతీ జిల్లా అధికారులు వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే చేస్తారనీ, మన రాష్ట్రంలో ఎకరా పత్తి వేస్తే దాదాపు రూ. 50 వేల లాభం వస్తుందన్నారు. అదే విధంగా ఒక ఎకరాలో వరి పంట వేస్తే రూ. 25 వేలు గరిష్టంగా మిగులుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పత్తి పంటల సాగుకు అనువైన వాతావరణం ఉందనీ, ఈ పంటను సాగుచేస్తే అధిక లాభాలను గడించవచ్చని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలోని దాదాపు 12 లక్షల ఎకరాలలో కంది పంట సాగుకు అనుకూలమైన నేల ఉందనీ, కందులను పండిస్తే రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దనీ, ఆ పంటను సాగు చేస్తే రైతు బంధు వర్తించదని స్పష్టం చేశారు. కావాలంటే యాసంగిలో మొక్కజొన్న సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. 8 నుంచి 10 లక్షల ఎకరాలలో మిర్చి, కూరగాయలు, సోయా, పప్పు ధాన్యాలు ఇతర పంటలు వేయాలని సూచించారు. ప్రతీ మండలంలోనూ పంటలు సాగు చేసేందుకు ఉండే యాంత్రిక శక్తి ఎంత అనే లెక్క మండల వ్యవసాయ అధికారితో సలహాలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో యాంత్రిక సాయం పైనే వ్యవసాయం ఆధారపడుతుందనీ, ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుందని స్పష్టం చేశారు. గత ఏడాది 53 లక్షల ఎకరాలలో పత్తి పంటను సాగు చేశారనీ, ఈసారి 70 లక్షల ఎకరాల దాకా దానిని పెంచాలన్నారు. 40 లక్షల ఎకరాలలో వరిని సాగుచేయవచ్చనీ, ఇందులో దొడ్డు రకాలు, సన్న రకాల ధాన్యం గురించి అధికారులు నిర్ణయిస్తారని ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply