Take a fresh look at your lifestyle.

వ్యవసాయంపై వ్యతిరేక ధృక్పథంలో.. మార్పు రావాలి

  • ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్లు రైతులకు లాభదాయకం
  • పంటల మార్పిడి విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి
  •  సీఎం కేసీఆర్‌తో నాబార్డు బృందం భేటీలో సుదీర్ఘ చర్చ

దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం లాభదాయకమైంది కాదనే వ్యతిరేక ధోరణితో చూసే ధృక్పదంలో మార్పు రావాలని సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. నాబార్డ్ ‌చైర్మన్‌ ‌జీఆర్‌ ‌చింతల గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో వ్యవసాయ రంగం అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దేశంలో దాదాపు 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయనీ, పరోక్షంగా మరికొన్ని కోట్ల మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయన్నారు. దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయదారులేననీ, దేశం ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు వివిధ దేశాల్లో ఆహార అవసరాలను గుర్తించి మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలనీ, ఈ దిశగా నాబార్డు అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.

దేశంలో కొండ ప్రాంతాలు, శీతల, సముద్ర ప్రాంతాలున్నాయనీ, ఏ ప్రాంతానికి ఏ పంటలు అనువైనవో గుర్తించి వాటినే సాగు చేయించాలని అభిప్రాయపడ్డారు. దేశాన్ని క్రాప్‌ ‌కాలనీలుగా విభజించి పంటల మార్పిడి విధానాన్ని అవలంభించాలనీ, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడమే కాకుండా దానికి అనుగుణమైన మార్కెట్‌ ‌లేకుంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున దానికి అనువైన మార్కెటింగ్‌ ‌విధానం కూడా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌సెజ్‌లను పెట్టాలని నిర్ణయించుకున్నదనీ, ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం కూలీల కొరత అనే మరో ముఖ్యమైన సమస్యను ఎదుర్కొంటున్నదనీ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలని సీఎం అభిప్రాయపడ్డారు. నాటు వేసే, కలుపు తీసే, వరికోత యంత్రాలు ఎక్కువ సంఖ్యలో రావాలనీ, దీనికి కూడా అవసరమైన ఆర్థికసాయం, సబ్సిడీలు అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. డీసీసీబీ బ్యాంకులు మరింత సమర్థంగా నడిచేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

Leave a Reply