Take a fresh look at your lifestyle.

రెండు నెలల్లోగా రూ.50 వేలలోపు వ్యవసాయ రుణాలు మాఫీ

  • త్వరలోనే సొంత జాగాలో డబుల్‌ ‌బెడ్‌ ఇం‌డ్ల నిర్మాణంకు ఆర్థిక సహాయం
  • అన్నీ సౌకర్యాలతో ఆదర్శవంతమైన జర్నలిస్ట్ ‌హౌసింగ్‌ ‌కాలనీని నిర్మిస్తాం
  • హుస్నాబాద్‌ ‌ప్రెస్‌క్లబ్‌ ‌మీటింగ్‌ ‌హాల్‌కు రూ.20 లక్షలు మంజూరు:మంత్రి హరీష్‌రావు
  • హుస్నాబాద్‌ ‌నేషనల్‌ ‌హైవే రోడ్డుకు నెల రోజుల్లో టెండర్లు: ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌

రెండు నెలల్లోగా రైతులు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి 50వేల రూపాయలలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు.  సొంత జాగాలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టే పేదలకు ఆర్థిక సహాయం అందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందనీ, ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయన్నానీ,  త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయం తీసుకుంటారన్నారు. బుధవారం హుస్నాబాద్‌ ‌మండలం గాంధీనగర్‌ ‌పరిధిలోని కిషన్‌నగర్‌లో జిల్లా ప్రజా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌తో కలిసి 40 డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…  50 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలను వడ్డితో సహా ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా మాఫీ చేస్తుందని మంత్రి తెలిపారు. అన్నీ సౌకర్యాలతో ఆదర్శవంతమైన జర్నలిస్ట్ ‌హౌసింగ్‌ ‌కాలనీని నిర్మిస్తామన్నారు. హుస్నాబాద్‌ ‌ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించేందుకు వీలుగా నిర్మించే మీటింగ్‌ ‌హాల్‌కు రూ.20 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.42 కోట్ల తో జర్నలిస్ట్ ‌సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిందన్నారు. కొరోనా క్లిష్ట పరిస్థితుల్లో వైద్య, పోలీస్‌, ‌శానిటేషన్‌ ‌సిబ్బంది మాదిరే తమ ప్రాణాలకు తెగించి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలు,ఇబ్బందులను పాత్రికేయుల ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.

కొరోనా సమయంలో విధులు నిర్వర్తించే క్రమంలో కోవిడ్‌ ‌బారినపడిన జర్నలిస్ట్‌లకు ప్రభుత్వం రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం చేసిందన్నారు. కోవిడ్‌తో మరణించిన జర్నలిస్ట్‌కు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. బాధిత జర్నలిస్ట్ ‌భాగస్వామికి పెన్షన్‌, ‌పిల్లలకు చదువుల నిమిత్తం స్కాలర్‌షిప్‌లు అందిస్తుందన్నారు. అలాగే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా విరివిగా అక్రిడేషన్లు  మంజూరు చేస్తుందన్నారు. కొరోనా వల్ల మీడియా రంగం తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. మీడియా సంస్థల ఆదాయం తగ్గిందన్నారు. ఆ ప్రభావం జర్నలిస్ట్‌పై కూడాపడిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్‌ ‌పట్టణం జలమయం అయ్యిందని మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే, మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కోరారని మంత్రి తెలిపారు.

త్వరలోనే హుస్నాబాద్‌ ‌ప్రధాన రోడ్డు జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనున్నందున రహదారులు, భవనాల విభాగం ఇంజనీర్లు, జాతీయ రహదారుల అధికారులను సమన్వయం చేసుకుంటూ హుస్నాబాద్‌ ‌పట్టణం భవిష్యత్తులో ముంపు బారిన పడకుండా రూ. 12 కోట్లతో పట్టణం రెండు వైపులా ‘స్టార్మ్ ‌వాటర్‌ ‌డ్రైన్‌’‌లు సమగ్ర ప్రాజెక్ట్ ‌నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. హుస్నాబాద్‌లో అసంపూర్తిగా ఉన్న సమీకృత కార్యాలయాల సముదాయంను 4 నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనీ పంచాయితీరాజ్‌ ఇం‌జనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణం లో ప్రగతిలో ఉన్న వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌, ‌రైతు బజార్‌, ‌గిరిజన భవనం, డంప్‌ ‌యార్డ్, ‌లైబ్రరీ లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. హుస్నాబాద్‌లోని 7 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు కావడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపవలసిందిగా కలెక్టర్‌ ఆదేశించామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యేలా చూస్తానని అన్నారు.

అలాగే హుస్నాబాద్‌లోని గౌరవెల్లి రిజర్వాయర్‌ ‌పెండింగ్‌ ‌భూ సేకరణ పూర్తి చేసేందుకు రూ.58 కోట్లు జిల్లా కలెక్టర్‌ ‌ఖాతాకు జమ చేశామని తెలిపారు. వారం రోజుల్లో భూ సేకరణ జరిపిన రైతులకు నష్టపరిహారం చెల్లించి భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ ‌నిర్మాణంలో ఇంకా మిగిలిన 5 నుంచి 10 శాతం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఎమ్మెల్యే  వొడితెల సతీష్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ….హుస్నాబాద్‌ ‌నేషనల్‌ ‌హై వే రోడ్డుకు నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మంత్రి  తన్నీరు హరీష్‌ ‌రావు ప్రత్యేక చొరవ తో హుస్నాబాద్‌ ‌నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాలు, గిరిజన తండాలకు పక్కా రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయశ్చంద్రారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, హుస్నాబాద్‌ ‌ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు అజయ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply