Take a fresh look at your lifestyle.

వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు

“ఒప్పంద వ్యవసాయ బిల్లు రైతుల్లో తీవ్రస్థాయి నిరాశా నిస్పృహల్ని పెంచుతున్నది. దేశంలో ఉన్న 86% చిన్న, సన్నకారు రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఉండడం వలన సంస్థ చెప్పిన పంటనే వేయాల్సి వస్తుంది. తమ భూమి సారం విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడడం వలన క్షీణిస్తుందని ఆందోళన చెందుతున్నారు. రైతుకు, సంస్థకూ ఏదైనా అంశంలో తేడా వస్తే కంపెనీదే పైచేయి అవుతుందని రైతుల ఆవేదన. అధునాతన సాంకేతిక సౌకర్యాలు అని ఊరిస్తునప్పటికీ వాటిని అందుకునే పరపతి రైతులకు ఎలా కల్పిస్తారో కేంద్ర చెప్పకపోవడంతో ఆందోళన పెరిగింది.”

రైతులకు మేలు చేస్తున్నట్టు కేందప్రభుత్వం తీసుకుని వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య ప్రోత్సాహక బిల్లు, ఒప్పంద వ్యవసాయ బిల్లు, నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు..మూడు వ్యవసాయ బిల్లులు జాతీయస్థాయిలో అన్నదాతల నిరసన సెగ ఎదుర్కొంటున్నాయి. రాజ్యసభలో తీవ్రమైన నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం బిల్లుల్ని నెగ్గించుకుని చట్టాలు చేయగలిగింది కానీ ప్రజాక్షేత్రంలో..పంజాబ్‌, ‌హర్యానా రైతులు ఆయా చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చలో ఢిల్లీ ధర్మాగ్రహం చూస్తూనే ఉన్నాం.

వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య ప్రోత్సహక బిల్లు సంస్థాగతంగా ఉన్న వ్యవసాయ మండీల బయట కూడా వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు అని నిర్దేశించడంతో కథ మొదలైంది. మండీల్లో ప్రభుత్వ నియంత్రణ, కేంద్రం నిర్ణయిస్తున్న మద్దతు ధర ఉండడం వలన కొత్త బిల్లు వాటి ప్రయోజనాల్ని దెబ్బ తీస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండీ ఆదాయం కోల్పోయి నష్టపోవాల్సి వస్తుందని కొన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎలాంటి ప్రతిబంధకాలు లేని అంతరాష్ట్ర మార్కెట్‌ ‌సృష్టించడంతో రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర చెబుతున్నా ఆ రవాణా సౌకర్యాలు రైతుకు లేకపోవడం వలన మధ్యవర్తులు, కమీషన్‌ ఏజెంట్లకే లాభం చేకూరుతుందని అంటున్నారు.

ఒప్పంద వ్యవసాయ బిల్లు రైతుల్లో తీవ్రస్థాయి నిరాశా నిస్పృహల్ని పెంచుతున్నది. దేశంలో ఉన్న 86% చిన్న, సన్నకారు రైతులు అపుల్లో కూరుకుపోయి ఉండడం వలన సంస్థ చెప్పిన పంటనే వేయాల్సి వస్తుంది. తమ భూమి సారం విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడడం వలన క్షీణిస్తుందని ఆందోళన చెందుతున్నారు. రైతుకు, సంస్థకూ ఏదైనా అంశంలో తేడా వస్తే కంపెనీదే పైచేయి అవుతుందని రైతుల ఆవేదన. అధునాతన సాంకేతిక సౌకర్యాలు అని ఊరిస్తునప్పటికీ వాటిని అందుకునే పరపతి రైతులకు ఎలా కల్పిస్తారో కేంద్ర చెప్పకపోవడంతో ఆందోళన పెరిగింది.

మూడవదైన నిత్యావసర వస్తువుల సవరణ చట్టంలో పప్పు, నూనె గింజలు, బంగాళా దుంపలు వంటి వాటిని నిత్యావసర వస్తువుల జాబితా నుండి తొలగించి కొత్త వివాదానికి తెరలేపింది. నిత్యావసర వస్తువుల నిల్వపై ఆంక్షలుండడం ప్రజలందరికీ మేలు చేకూరుతుందన్నది. విషయమే.ఇప్పుడు ఆయా వస్తువుల్ని జాబితా నుంచి తీసేయడం వలన బడా కంపెనీలు కావాలనే కృత్రిమ కొరత సృష్టించి నిల్వ సంబంధిత మౌలిక వసతులు లేని సన్నకారు రైతులకు తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడుల పేరుతో కార్పొరేట్‌ ‌కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచి అన్నదాతను దారిద్య్రంలోకి నెట్టే ప్రమాదం ఉంది.
2018 సంవత్సరంలో పార్లమెంటు సభ్యుడు రాజు శెట్టి లోకసభలో ప్రవేశ పెట్టిన రెండు కీలకమైన ప్రవేటు బిల్లులపై జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్వాభిమాన పక్ష పార్టీకి చెందిన రాజుశెట్టి పెట్టిన బిల్లుల్ని ఆలిండియా కిసాన్‌ ‌సంఘర్ష సహకార కమిటీ రూపొందించింది. రైతులకు రుణగ్రస్త పరిస్థితి నుంచి విముక్తి మొదటి అంశం కాగా, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ రెండవ అంశం. కాంగ్రెస్‌, ‌సీపీఎం, తృణమాల్‌ ‌కాంగ్రెస్‌, ‌బీఎస్పీ, శివసేన, ఎన్సీపీ వంటి మొత్తం 21 రాజకీయ పార్టీలు ఆ బిల్లుకు మద్ధతు ఇచ్చాయి.

రైతులకు రుణమాఫీ, అవస్థాపనా సౌకర్యాలు, రుణాలు వంటివి కల్పించడం మరియు అరవయ్యో దశకంలో వచ్చిన కనీస మద్దతు ధర విధానానికి రాజ్యాంగ బద్ధత ఇవ్వడం ఈ బిల్లులో కీలకమైన అంశాలు. దాదాపు ముప్పై పైగా కిసాన్‌ ‌సంఘాలతో చలో ఢిల్లీ ఆందోళన చేస్తున్న రైతులు ఈ మూడు చట్టాల బేషరతు ఉపసంహరణతో పాటు 2018లో ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై మళ్ళీ చర్చించాలని డిమాండ్‌ ‌కోరుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు రాజ్యాంగ బద్ధమైన రక్షణ ఇవ్వడంతో పాటు స్వాభిమానంతో రైతన్న బ్రతికే పరిస్థితి రావాలి. అప్పుడే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది.

pitla naga phani
పిల్లుట్ల నాగఫణి,
జర్నలిజం, కాకతీయ విశ్వవిద్యాలయం,

Leave a Reply