Take a fresh look at your lifestyle.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అగ్నివేశ్

అగ్నివేష్ మేరా నామ్ హై…. ఆగ్ లాగాన మేరే కామ్ హై ….. అని నినదించిన మానవతావాది, సామాజిక పోరాట కర్త,, హక్కుల సూరీడు, ప్రజల పక్షపాతి స్వామి అగ్నివేష్ లివర్ సిర్సొసిస్ వ్యాధితో ఢిల్లీలోని ఇనిస్ట్యూట్ ఆఫ్ లివర్ బైలియరీ సైన్సెస్ హాస్పిటల్లో గత వారం రోజులుగా చికిత్స పొందుతూ సెప్టెంబర్ 11 శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు శరీరంలోని అవయవాలన్నీ అచేతన స్థితికి చేరుకోవడంతో కార్డియాక్ అరెస్ట్ గురై తుదిశ్వాస విడిచారు. స్వామి అగ్నివేష్ మరణం అణగారిన వర్గాల ప్రజలకు తీరని లోటు. పీడితుల ఆశాజ్యోతి, గొప్ప ప్రజాస్వామికవాదైన అగ్ని వేశ్ సామాజిక సమస్యలపై తన జీవితాన్ని అంకితం చేశారు. కాషాయం ధరించిన కరడుగట్టిన హిందూ మతోన్మాద వ్యతిరేకి. 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ సిధ్ధాంతాలకు ఆకర్షితుడై, ఆర్య సమాజం లో చేరి ఎన్నో సామాజిక పోరాటాలు చేశారు.బాల్యం నుండే సామాజిక అంశాల పట్ల మక్కువ పెంచుకున్న అగ్నివేష్, కుటుంబ జీవనం ఉంటే స్వార్థపూరితంగా వ్యవహరిస్తామని, సమాజ సేవ చేయడం సాధ్యం కాదని భావించి, సన్యాసం తీసుకుని అణ గారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారు.

స్వామి అగ్నివేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో 1939 సెప్టెంబర్ 21న సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని అసలు పేరు వేపా శ్యామ్ రావు . నాలుగు సంవత్సరాల వయసుఉన్నప్పుడే తండ్రి కన్నుమూయడంతో , ఛత్తీస్ ఘడ్ లో ఉన్న శక్తి అనే రాజ్యంలో దివాన్ అయినా తాత గారి ఇంట పెరిగారు.న్యాయ శాస్త్రము, వాణిజ్యశాస్త్రం లో యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా నుంచి పట్టాను పొందారు. తర్వాత కోల్ కత్త లోని సెయింట్ జేవియర్స్ కాలేజి లో లెక్చరర్గా పనిచేశారు. కొంతకాలం సవ్యసాచి ముఖర్జీ అనే ప్రఖ్యాత న్యాయవాది వద్ద జూనియర్ లాయర్ గా పనిచేశారు. సవ్యసాచిముఖర్జీ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. స్వామి అగ్నివేష్ అడ్వకేట్ గా మతపరమైన సమస్యలపై కోర్టులో వాదించేవారు.1970 లో ఆర్యసమాజ్ సిద్ధాంతాలతో నడిచేలా ఆర్య సభ అనే ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. 1977 సంవత్సరంలో అగ్నివేష్ హర్యానా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1979లో హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఫరీదా బాద్ పోలీస్ ఫైరింగ్ లో కార్మికులు చనిపోతే నిరసన తెలిపి న్యాయ విచారణకు డిమాండ్ చేయగా వెంటనే రాజీనామా చేసి తన జీవితాన్ని శ్రమదోపిడి పోరాటాలకు అంకితం చేశారు.

వారు చేసిన సామాజిక పోరాటాల గురించి పరిశీలిద్దాం…..
ఆడపిల్ల అని తెలిసి భ్రూణహత్యలకు పాల్ప పడుతున్న రోజుల్లో అందుకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం చేశారు. 1981లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడే శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ అనే సంస్థను స్థాపించి ఢిల్లీ చుట్టుప్రక్కల ఉండే క్వారీలో కార్మికుల దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.1988-89 ల లో రాజస్తాన్ లోని నాథ్ ద్యారఆలయంలోకి దళితుల ప్రవేశంకోసం, ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాన్ని హిందూ యేతరుల కోసం తెరువాలంటూ ఉద్యమం చేశారు.రాజస్తాన్ లో 1987లో రూప్ కన్వర్ అనే అనే మహిళ సతీసహగమనం చేయడంతో నిరసనగా ఢిల్లీ నుండి దేవరాల వరకు 18 రోజులు పాదయాత్ర చేయడంతో రాజస్థాన్ ప్రభుత్వం సతి ప్రివెన్షన్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చింది. 2002లో గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు అక్కడికి వెళ్లి మత పెద్దల తో మాట్లాడి మత సామరస్యం కోసం ప్రయత్నం చేశారు. 2008లో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన జమాతే ఉలేమా ఈ హిందూ సభలో పాల్గొని ఎవరోకొందరూ ఉగ్రవాదులు చేసే క్రమాలకు మొత్తం మతాన్ని తిట్టడం సరియైనది కాదని అన్నారు. దీంతో హిందూ సంఘా ల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. అసలు అమెరికా నెంబర్ వన్ టెర్రరిస్టు అని కూడా అన్నారు. హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే అమర్నాథ్ శివలింగం కేవలం ఒక. మంచి ముక్క అంటూ కామెంట్ చేయడంతో హిందుత్వ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 2011లో దేశవ్యాప్తంగా అన్నాహజారే నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. నిరసనకారులు వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆ అవినీతి ఉద్యమం నుండి వైదొలిగారు. చతిస్గడ్ పోలీసులను మావోయిస్టులు 2011లో కిడ్నాప్ చేసినప్పుడు వారిని విడిపించడానికి మధ్యవర్తిత్వం చర్చలు జరిపిన బృందంలో ఒక సభ్యుడు. 2011 సంవత్సరంలో నవంబర్8 నుంచి11 వరకు హిందీబిగ్ బాస్ హౌస్ లో దిగా పాల్గొన్నారు. యునైటెడ్ నేషన్స్ లో ప్రపంచవ్యాప్తంగా హింస పై జరిగిన చర్చలో పాల్గొని శాంతియుత పరిష్కారానికి పలు సూచనలుచేశారు. స్వామి అగ్నివేష్ తెలంగాణరాష్ట్ర ఏర్పాటుతో అవినబావ సంబంధం ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ఇచ్చి పలు బహిరంగ సభలలో పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేశారు. సామాన్య ప్రజలకు నష్టం కలిగించే ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఉద్యమాలుచేయడం జరిగింది. ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగిన ను దేశవ్యాప్తంగా తిరిగి ఆదివాసీ గిరిజన బలహీన వర్గాల తరుపున హక్కుల అడిగిన ఉద్యమకారుడు.

హిందూ మతోన్మాద వ్యతిరేకిగా,ప్రజాస్వామ్య వాదిగా ,మానవతా వాదిగా, పీడితుల పక్షపాతి గా తన జీవితాంతం నిస్వార్థంగా అంకితం చేసిన కాషాయ ధారణ విప్లవకారుడు నేలకొరగడం బడుగు బలహీన వర్గాలకు తీరని నష్టం… పేదల సంక్షేమంకోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయులు, హక్కుల అడిగి పెట్టిన ఉద్యమ రథసారథులు బాలగోపాల్ ,బుర్ర రాములు, కన్నాభిరాన్ లాంటి వారితో పాటు నిన్నస్వామి అగ్నివేష్ కూడా కన్నుమూయడంతో అణగారిన వర్గాల కు ప్రజాస్వామ్య ఫలాలు అందడం కష్టమే… ఏ ఆశయ సాధన కోసం తమ జీవితాలను పణంగా పెట్టారో, ఆ ఆశ యాలను కొనసాగించడమే వారికి నిజమైన నివాళి.

Tanda Sadanandam, District
తండా సదానందం, జిల్లా
ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్‌. ‌మహబఃబాద్‌ ‌జిల్లా. 9989584665

Leave a Reply