Take a fresh look at your lifestyle.

అభద్రత వలయంలో వయోవృద్ధ భారతం..!

‘‘‌భారతంలో 45 ఏండ్లు దాటిన జనాభాలో 6 శాతం ఆహార సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నారని తేలింది. పోషకాహార అభద్రత, వైద్య ఖర్చులు పెరగడం, ఆరోగ్య భీమా అవగాహన లోపించడం, రవాణా పరిమితులు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్య ధోరిణి, ఆర్ధిక బలహీనత లాంటి కారణాలతో వృద్ధుల బతుకులు గాల్లో దీపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వయోవృద్ధుల జనాభాను కాపాడుకోవడానికి పక్కా ప్రణాళికల అవసరం పెరుగుతున్నది.’’

నేటి బాలలే రేపటి యువకులు.
నేటి యువతీయువకులే రేపటి వయోజనులు.

యువ శక్తి మానవ వనరులు అధికంగా ఉన్న యువ భారతంలో నేడు సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. దేశ జనాభా స్థిరీకరణ దశకు చేరుతోంది. న్యూక్లియర్‌ ‌ఫ్యామిలీలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న వేళ జనన, మరణాల రేట్ల మధ్య అసమానతలు తగ్గుతున్నాయి. జననాల సంఖ్య తగ్గితే రేపటి యువ జనాభా పడిపోతూ, వయోవృద్ధుల జనాభా పెరుగుతుంది. సమాజంలో 60 ఏండ్ల వయసు దాటిన జనాభాను సీనియర్‌ ‌సిటిజన్లు లేదా వయోవృద్ధులుగా పిలుస్తాం. 2021 గణాంకాల ప్రకారం ఇండియాలో 138 మిలియన్ల వయోజనులు ఉన్నారని, ఇందులో 67 మిలియన్ల పురుషులు, 71 మిలియన్ల మహిళలు (1,000 పురుషులు : 1,065 మహిళలు) ఉన్నారు.
గత దశాబ్దకాలంలో వయోవృద్ధుల జనాభా 34 మిలియన్లు చేరగా, 2030 నాటికి 56 మిలియన్ల జనాభా పెరగవచ్చని  తెలుస్తున్నది. 2011 – 2021 మధ్య వయోవృద్ధుల జనాభా 32.7 శాతం పెరుగగా (26.5 శాతం పురుషులు, 39.1 శాతం మహిళల జనాభా), సాధారణ జనాభా 12.4 శాతం మాత్రమే పెరగడం విశేషంగా గుర్తించాలి. 1961లో 60 ఏండ్లు దాటిన జనాభా 5.6 శాతం ఉండగా, 2021లో 13.1 శాతానికి చేరడం గమనించారు. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 16.5 శాతం వయోజనులు ఉండగా, అతి తక్కువగా బీహారులో 7.7 శాతం ఉన్నట్లు 2021 గణాంకాలు తెలుపుతున్నాయి.
వయోవృద్ధుల జనాభా పెరగడానికి కారణాలు:
వయోవృద్ధుల జనాభా పెరగడానికి కారణాలుగా ఆర్థిక వెసులుబాటు, వైద్యఆరోగ్య వసతుల కల్పన, రవాణా వ్యవస్థలు సులభంగా అందుబాటులోకి రావడం లాంటి అంశాలు పేర్కొనబడినవి. ప్రస్తుతం దేశంలో 60 శాతం మరణాలు మధుమేహం, గుండెపోటు, హృద్రోగాలు, క్యాన్సర్‌ ‌లాంటి నాన్‌-‌కమ్యూనికబుల్‌ (అం‌టువ్యాధులు కానివి) వ్యాధుల వల్ల జరుగుతున్నాయి. భారతంలో 45 ఏండ్లు దాటిన జనాభాలో 6 శాతం ఆహార సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నారని తేలింది. పోషకాహార అభద్రత, వైద్య ఖర్చులు పెరగడం, ఆరోగ్య భీమా అవగాహన లోపించడం, రవాణా పరిమితులు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్య ధోరిణి, ఆర్ధిక బలహీనత లాంటి కారణాలతో వృద్ధుల బతుకులు గాల్లో దీపాలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వయోవృద్ధుల జనాభాను కాపాడుకోవడానికి పక్కా ప్రణాళికల అవసరం పెరుగుతున్నది. జీవన ప్రమాణాలు, సగటు జీవితకాలం పెరుగుతున్న వేళ రిటైర్‌మెంట్‌ ‌వయస్సు పెరగడంతో యువతతో పాటు వృద్ధులు కూడా పరిమితంగా అందుబాటులో ఉన్న ఉద్యోగ ఉపాధులకు పోటీ పడడం చూస్తున్నాం. పురుషులతో పోల్చితే మహిళల సగటు జీవితకాలం అధికంగా ఉంటున్నది. ఐరాస అంచనాల ప్రకారం 2050 నాటికి భారతదేశంలో మహిళా జనాభా 56 శాతం ఉండవచ్చని తెలుస్తున్నది. వృద్ధ మహిళలు భర్తల్ని కోల్పోయి తీవ్ర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, అసమానతలతో సతమతం అవుతుంటారని వివరిస్తున్నారు.
image.png
వయోవృద్ధులకు భద్రతకు పెద్దపీట:
కొత్త మిలినియమ్‌ ‌ప్రారంభ సంవత్సరాల్లో భారత్‌ ‌పలు రంగాల్లో ముందడుగు వేస్తూనే ఉన్నది. గత రెండు దశాబ్దాల్లో భారతంలో 15-34 ఏండ్ల యువత నిరుద్యోగ సమస్య 17.7 శాతం నుంచి 22.8 శాతానికి పెరగడంతో పాటు మరో వైపు స్థూలకాయం పెరగడం సమాంతరంగా జరుగుతున్నాయని విశ్లేషించారు. యువశక్తి సద్వినియోగానికి అవసర విద్య, నైపుణ్యాల పెంపుపై ప్రభుత్వాలు పథక రచన చేయాలి. నేటి యువత ఆర్థికంగా, ఆరోగ్యకరంగా వెనుకబడే ఉన్నారు. ఇలాంటి నిస్సహాయ యువతరాన్ని సన్మార్గంలో పెడుతూ రేపటి ఆశాకిరణాలుగా నిలబెడుతూనే, వయోవృద్ధుల ఆరోగ్య భద్రతలకు పెద్దపీట వేయాలి. వయోవృద్ధుల హితం కోరుకునే రవాణా వ్యవస్థలు, వైద్య వసతులు, పోషకాహార భద్రత, మానవీయ కోణం కలిగిన సమాజ నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, బాధ్యతగల పౌర సమాజం మీద ఉన్నది.
వయోవృద్ధుల అనుభవాలను సమాజాభివృద్ధికి వినియోగించుకోవాలి. రాబోయే భవిష్యత్తులో వయోజనుల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను దృష్టిలో ఉంచుకొని మార్గనిర్థేశనం చేయాల్సి ఉంటుంది.నేటితరం అనుభవిస్తున్న ఆధునికజీవనశైలికా పునాదులు వేసిన నిన్నటి యువత, నేటి వయోజనుల సంపూర్ణ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వాలు, పౌరసమాజం సమిష్టి కృషి చేయాలి. నేటి యువతే రేపటి వయోజనులని/వృద్ధులని మరువరాదు. పెద్దల దీవెనలతో యువత ముందడుగు వేస్తేనే నేటి యువతరం సుస్థిరాభివృద్ధి దిశలో నడుస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

image.png

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి కరీంనగర్‌ – 9949700037

 

Leave a Reply