Take a fresh look at your lifestyle.

భయం గుప్పిట్లో ఏజెన్సీ..

  • 21 నుండి 27 వరకు మావోయిస్టు వారోత్సవాలు
  • అప్రమత్తమైన పోలీస్‌ ‌శాఖ – ప్రత్యేక నిఘా ఏర్పాటు

మావోయిస్టు పార్టీ వారోత్సవాలు 21 నుండి 27 వరకు నిర్వహించనున్నట్లు మావోయిస్టు పార్టీ ఇప్పటికే పలుచోట్ల కరపత్రాలు, గోడపత్రికలు విడుదల చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో సమావేశాలకు రావాల్సిందిగా మావోయిస్టు పార్టీ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీస్‌ ‌వర్గాలు చెప్తున్నారు. దీనితో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీ ముందుగా పీపుల్స్ ‌వార్‌ ‌పార్టీగా ఉన్న ఆ సంఘం సెప్టెంబర్‌ 21, 2004 ‌సంవత్సరంలో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించింది.

అప్పటి నుండి ప్రతీ ఏటా వారోత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ వారోత్సవాలను నిర్వహించాలని ఏజన్సీ ప్రాంతంలో గ్రామాల్లో కరపత్రాలు వేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే గత వారం రోజులుగా వివిధ గ్రామాల్లో కరపత్రాలను వేసారు. మావోయిస్టు వారోత్సవాల్లో ఏజన్సీ మారుమూల ప్రాంతాల గిరిజనులకు భయాందోళన వాతావరణం నెలకొంది. మావోయిస్టు వారోత్సవాల్లో పాల్గొనాలని మావోయిస్టులు ఇప్పటికే గట్టిగా ఆదేశాలు జారీ చేసారని, ఇటువంటి సమావేశాలకు వెళ్ళవద్దని పోలీస్‌ ‌శాఖ కూడ గట్టి ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా భదాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ఒక ప్రకటన కూడ విడుదల చేసారు. మావోయిస్టులు సమావేశాలకు ఆహ్వానిస్తే దాన్ని తిప్పికొట్టాలని ఏజన్సీ ప్రాంత ప్రజలకు పిలుపునిచ్చారు.

మావోయిస్టు వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీస్‌ ‌శాఖ కూడ అందుకు దీటుగా నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఏజన్సీ ప్రాంతంలోని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండే విధంగా పోలీస్‌ ‌శాఖ అటవీ ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి. ఇటు పోలీస్‌, అటూ మావోయిస్టుల హెచ్చరికలతో ఏజన్సీలోని మారుమూల ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భయాంధోళణ చెందుతున్నారు.

Leave a Reply