ప్రపంచంలో అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. అన్నింటా నేనే నెంబర్ వన్ గా విర్రవీగిన చైనాను అధిగమించింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ తాజా డేటా స్పష్టం చేసింది.అభివృద్ధిలో వెనుకబడిన జనాభా విషయంలో మాత్రం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. చైనా జనాభా కొన్ని సంవత్సరాలుగా 140 కోట్లు పైనే ఉంది కానీ, ఇటీవల క్షీణించడం ప్రారంభించింది. చైనాను భారత్ ఎప్పుడు దాటిందో స్పష్టంగా వెల్లడించకపోయినా…చైనా కంటే ఇండియాలో 29 లక్షల మంది జనాభా ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఇండియాలో 142.86 కోట్లు, చైనా జనాభా 142.57 కోట్లుగా ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా జనాభా 800 కోట్లు సమీపించిందని పేర్కొంది. చైనా కంటే భారత జనాభా 2.9 మిలియన్లు ఎక్కువగా ఉందని పేర్కొంది. 2008లో ఆ దేశ జనాభా 132 కోట్లు. జనాభాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1980లో ‘ఒక్కరు చాలు’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలుచేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది. చైనా జానాభాను భారత్ దాటడం 1950 తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం సరికొత్త మైలురాయిని చేరుతుంది. భారత్‌లో 1950, 1980 మధ్య జనాభా వేగంగా పెరిగింది.
1951లో 36.1 కోట్ల నుంచి 1981కి 68.3 కోట్లకు చేరుకుంది. కేవలం మూడు దశాబ్దాలలో రెండు రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. 70 ఏళ్ల కాలంలో 100 కోట్లు దాటిపోయింది. అయితే, గత మూడు దశాబ్దాలలో జనాభా వృద్ధి రేటు తగ్గుముఖం పట్టడంతో పెరుగుదల నెమ్మదించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ ‘‘భారత జనాభా గ్రాఫ్ చూస్తే, మరో నాలుగు దశాబ్దాల పాటు సంఖ్య పెరుగుతూనే ఉంటుందని, ఆ తరువాత వృద్ధిలో స్థిరత్వం రావచ్చని తెల్పుతుంది. కానీ, పట్టణాలు అధిక జనాభాతో నిండిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల 17.9 శాతం ఉండగా, పట్టణాల్లో 31.2 శాతంగా ఉంది.13 నుంచి 19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం, 18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభా పెరుగుదలకు కారణమవుతున్నాయి. కానీ, ‘’ఇద్దరుకంటే ఎక్కువమంది సంతానం ఉంటే దాని ప్రభావం దంపతులిద్దరి పైనా ఉండాలి. పురుషాధిక్యత సమాజంలో ఇది ఎక్కువగా మహిళను ప్రభావితం చేసింది’’.
ప్రపంచ జనాభాలో భారతదేశం మాల్థస్-జనాభా సిద్ధాంతం అనుకరించి అగ్రస్థానంలో నిలిచింది.1805లోనే మాల్థస్ తన వ్యాసంలో మొత్తం సమస్యను విశ్లేషించి, ఒక అభిప్రాయానికి వచ్చారు. పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగిత, అనారోగ్యం దాని మూలంగా వ్యాధిగ్రస్తులు కావటం వంటి సమసల్యకు జనాభా పెరుగుదల కారణమని అభిప్రాయపడి ‘జనసంఖ్య’ సిద్ధాంతాన్ని తీసుకువచ్చాడు. ఈ సిద్ధాంతం ద్వారా జనన, మరణాల రేటుకు, ఆర్థికాభివృద్ధిలోని మార్పులకు మధ్యగల సంబంధాన్ని తెలుసుకోవడానికి జనాభా పరిణామ సిద్ధాంతాన్ని నాలుగు దశలుగా విభజించారు. మొదటి దశలో జననాల రేటుతోపాటు మరణాల రేటు అధికంగా ఉంటుంది. ఈ దశ భారత్‌లో 1921కి పూర్వం ఉంది.
నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, కుటుంబ నియంత్రణపై ఇంకా అవగాహన రాకపోవడంతో అధిక జననాల రేట్లవల్ల జనాభా పెరుగుదల రేటు రెండో దశలో మరణాల రేటు తక్కువగాను, జననాల రేటు అధికంగాను ఈ దశలో ఉంటుంది. అందుకే ఊహకందని రీతిలో పెరిగింది. మూడో దశలో జననాలు, మరణాల రేటు తక్కువగా ఉంటుంది. ఆధునికీకరణ, నగరీకరణ, విద్యావ్యాప్తి, పారిశ్రామికీకరణ వల్ల జననాల రేటు తగ్గిపోతుంది.నాలుగో దశలో జనన, మరణాల రేట్ల మధ్య సమన్వయం సాధించి రెండింటిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి.జనాభా పెరుగుదల రేటు ఈ దశలో స్థిరత్వాన్ని పొందుతుంది.శాస్త్ర విజ్ఞానాభివృద్ధి వలన మరణాల రేటు తగ్గించినంత సులభంగా జననాల రేటుకు కారణమైన సాంఘిక ఆచారాలను, మూఢనమ్మకాలను తొలగించడం సులభం కాదు. కాబట్టి ఈ దశల్లో జనాభా విస్ఫోటనం అన్ని విధాలా ప్రమాదకరం. ఈ అసమానతలను తొలగించేందుకు పరిణామ దశ అవసరం. దీన్నే ‘జనాభా పరిణామ సిద్ధాంతం’ అంటారు. ఈ దశలో ఉన్న దేశాలు అధిక జనాభా వల్ల ఏర్పడే సమస్యలను ఎదుర్కొంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో రెండో దశ లక్షణాలు కనబడతాయి. ప్రస్తుతం భారతదేశంలో రెండో దశ కనబడుతుంది.అందుకే ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలిచింది.
1970లలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాలంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు(స్టెరిలైజేషన్) రూపంలో ఇది మొదటిసారి జరిగింది. 1981 జనాభా లెక్కల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గకపోగా, పెరుగుదల నమోదైంది.1990లలో పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి అనేక రాష్ట్రాల్లో ‘ఇద్దరు పిల్లలు’ విధానాన్ని అమలు చేశారు. పొరుగు దేశం చైనా నుంచి ‘వన్ చైల్డ్ పాలసీ’, ‘టూ చైల్డ్ పాలసీ’లాంటి వాటితోపాటు జపాన్, దక్షిణ కొరియాల నుంచి కూడా కుటుంబ నియంత్రణ విధానాలను భారత్ స్ఫూర్తిగా తీసుకుని అనుసరించి కుటుంబ నియంత్రణ పాటించిన వారిపై వరాలు కురిపించడం, పాటించని వారిపై కఠిన నిబంధనలు అమలు చేయడం భారతదేశంలో ఇదే మొదటిసారి కాదు. ఎక్కువ మందిని కన్న వారిని ప్రభుత్వ పథకాలకు దూరంగా పెట్టాలనడం కొత్త విషయం కాదు. ‘‘జనాభా నియంత్రణకు అధిక వయసు పెళ్లిళ్లే సమర్థనీయం. 30-31 ఏళ్లకు వివాహాం చేసుకునే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అధిక జనాభాతో వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయి. అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభా పెరుగుదల, వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది.భారతదేశంలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
మొత్తం జనాభాలో 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు 40 శాతానికి పైనే ఉన్నారు. సగం జనాభా 25-64 వయసుల మధ్యలో ఉన్నప్పటికీ మధ్యస్థ వయసు 28 సంవత్సరాలు.భారత్‌లో వృద్ధుల మొత్తం జనాభాలో కేవలం 7 శాతం వృద్ధులు ఉన్నారు. అయితే, వృద్ధి రేటులో తరుగుదల కొనసాగితే, వృద్ధుల శాతం పెరుగుతుంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ మరికొన్నేళ్లు యువ దేశంగానే కొనసాగుతుంది.కొరోనా సమయంలో అనేక కుటుంబాలు విడదీసిన చైనా లాంటి దేశం పాపం మూటగట్టుకోవడం వల్ల నెంబర్ వన్ గా ఓడిపోయి లక్ష్యాన్ని సాధించింది. భారతదేశంలో ఏటా 2.5 కోట్లమంది శిశువులు జన్మిస్తున్నారు. కరోనా కాలంలో చైనాలో 13. మిలియన్లు జననాలు జరిగితే భారత్ లో 24.1 మిలియన్ల జననాలు జరిగినట్లు యునిసెఫ్ తెల్పింది.భారత్ లో సగటు ఐఎంఆర్ రేటు తగ్గినా కొన్ని రాష్ట్రాల్లో పెరిగింది.ఆయా రాష్ట్రాలు తల్లీబిడ్డల పోషణలో చూపెట్టిన శ్రద్ద వల్ల నవజాత శిశు, బాలల మరణాల రేట్లు బాగా తగ్గినాయి.బిడ్డ ఆరోగ్యం బాగుండాలంటే తల్లి ఆరోగ్యం బాగుండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లాంటి పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయి.
డా।। సంగాని మల్లేశ్వర్
జర్నలిజం విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, 9866255355