Take a fresh look at your lifestyle.

కొత్త వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా.. ఆందోళనలో పాల్గొన్న టిఆర్‌ఎస్‌

రైతును కాపాడడం తమ కర్తవ్యమని రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ‌నేత కే కేశవరావు అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాల నిరసన చేపట్టగా టిఆర్‌ఎస్‌ ఎం‌పిలు కూడా కలసి పాల్గొన్నారు. విపక్షాలు గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్‌ ‌విగ్రహం వరకు మార్చ్ ‌నిర్వహించాయి. విపక్ష సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ‌నేత కే కేశవరావు మాట్లాడుతూ మొదటిసారిగా ప్రతిపక్షాలు అన్ని ర్యాలీ తీసినట్లు చెప్పారు.

గాంధీ స్ఫూర్తితో ర్యాలీ తీశామని, మహాత్ముడు సైతం భూమి కర్షకుడిదే అన్నాడని గుర్తు చేశారు. అలాంటి భూమిని కార్పొరేట్‌ ‌సెక్టార్‌కి అప్పగించి రైతును అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును కాపాడడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం సభలో తప్పుడు పద్ధతిలో పాస్‌ ‌చేశారని ఆరోపించారు. సభ్యులను రూల్స్‌కు విరుద్ధంగా సస్పెండ్‌ ‌చేశారన్నారు. బిల్లును వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు జీ సంతోష్‌కుమార్‌, ‌బడుగుల లింగయ్యయాదవ్‌, ‌సురేష్‌రెడ్డితో పాటు విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

Leave a Reply