ఎన్నో గాయాల నడుమ…!
ముట్టుకోవద్దు మైల..అన్న
పదాలు విని విని చిన్నబోయిన
శరీరపు అమ్మతనం
దూరం దూరం అంటూ పెరట్లో
కూచోబెట్టిన అమ్మాయిల అమయాకత్వం
పూజలకు పునస్కారాలకు
పనికి రావంటూ వేలెత్తి చూపించిన
వెలేసిన ప్రకృతి తత్వం
ముట్టుగుడిసేలంటూ ఊరి
చివరికి గెంటివేయబడిన
ఆరోగ్యపు ఆడతనం
ఈడోచ్చిన పిల్లవంటూ
స్వేచ్చకు ,శరీరానికి సంకెళ్లు
వేసి బందిచబడ్డ ఎదిగే బాల్యం
వేశ్య వాటికలలో సంబరాల పేరుతో
వయసు ని బజార్లో పెట్టి వేలం
వేసే స్త్రీ మాంసపు వ్యాపారం
చెత్తకుండీలపై పాత గుడ్డలు
ఏరుకునే పేదరికపు ఆడతనం
పాత చీరలను ప్రత్యేకంగా అందుకే
దాచిపెట్టే మధ్యతరగతి అమ్మల
పొదుపరితనం
ఎంత డబ్బున్నా, ఏ అధికారం ఉన్నా
ఆ ఎరుపు ని ఇంకా బలహీనతగానే
చూసే అంధకార సమాజం
ఎన్ని మానసిక శారీరక
సామాజిక ఆర్థిక భావాలు
పెనవేసుకున్నాయో ఈ
ఒక్క రుధిరపు చుక్కలో….
కనిపించని భావోద్వేగాలు
పీఎంఎస్ పేరు తో అతలాకుతలం
చేస్తుంటే
ఎక్కడ ఏ ఎరుపు మచ్చ కనబడి
పరువు పొతుందో అన్న అభద్రత
నిలువెల్లా వణికిస్తుంటే
రక్త ధార, తెచ్చిన రక్త హీనత, కళ్ళని
ఒల్లుని, కాళ్ళని గిరగిరా తిప్పేస్తుంటే
వేసే ప్రతి అడుగు ఒక పరుగు పందెంలా
చేసే ప్రతీ పని ఒక యుద్ధం లా
గడవని కాలం శాపం లా
గాయం లేని రక్తం ఎన్నో రకాల గాయం చేస్తుంటే
నవ్వుతూ జీవితాన్ని అందమైన గేయంలా మార్చుకోడానికి
ప్రయత్నఁ చేసే ఓ అమ్మా…నీకిదే వందనం
*విన్నపం: నాన్నలు, అన్నలు, తమ్ముళ్లు, భర్తలు, కొడుకులు, స్నేహితులు, సహా ఉద్యోగులు, మీరు, వారు, వీరు, అందరూ..దయచేసి స్త్రీ తత్వాన్ని అవగాహన తో అర్థం చేసుకుని ఆ సమయం లో ఆలంబన అవ్వండి, నిన్నటి, నేటి, రేపటి తల్లులను ఆరోగ్యంగా కాపాడుకోండి.
-శ్రావణ సంధ్య
హనుమకొండ
|
|