Take a fresh look at your lifestyle.

మళ్ళీ హిందీ వివాదం…

Manduva-Ravinder-Rao
గెస్ట్ ఎడిట్
మండువ రవీందర్ రావు

ప్రతీ దేశానికి ఒక గుర్తింపు పొందిన భాష ఉన్నట్లే భారతదేశం అనగానే ఫలానా భాష మాట్లాడుతారన్న గుర్తింపు ఉండాలన్న విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. స్వాతంత్య్రానికి పూర్వం నుండే ఈ చర్చ జరుగుతున్నప్పటికీ స్వాతంత్య్రం లభించిన ఈ డెబ్బై అయిదు ఏళ్ళ కాలంలో దేశ మంతటికీ ఒకే భాష విధానాన్ని ప్రవేశపెట్టుకోలేకపోయారు. భారతదేశం విభిన్న సంస్కృతులు, భాషలతో కలగలిసిన కూటమి. స్వాతంత్య్రానికి పూర్వం అనేక స్వతంత్ర రాజ్యాలు తరతరాలుగా వాడుకలో వస్తున్న భాషలోనే పాలన సాగించడంవల్ల ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో అవే భాషలు అధికార భాషలుగా చెలామణి అవుతున్నాయి. అయితే మనమీద బ్రిటీషు ప్రభావంతోపాటు, వివిధ దేశాలు, ప్రాంతాలవారితో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఇంగ్లీషు తప్పనిసరి అయింది. అందుకే ప్రభుత్వ రెండు అధికార భాషల్లో ఒకటి ఆంగ్లంను  మరోదాన్ని హిందీగా గుర్తించింది. అయితే దేశమంతటికీ అధికార భాష అన్నది ఒకటి ఉండాలన్న ప్రయత్నాలు చాలా కాలం నుండే జరుగుతూ వచ్చాయి. దేశంలో ఎక్కువ మంది వాడుకలో ఉన్న హిందీనే అధికార భాషగా చేపట్టాలని వచ్చిన అనేక ప్రతిపాధనలు నాటి నుండి నేటివరకు వీగి పోతూనే వచ్చాయి. దీన్ని మొదటినుండీ ఇప్పటివరకు వ్యతిరేకిస్తున్నవారిలో ముందు వరుసలో నిలబడింది తమిళులే.

స్వాతంత్య్రానికి ముందే 1937లోనే తమిళనాడు హిందీని వ్యతిరేకించింది. ఆనాడు మద్రాస్‌ ‌రెసిడెన్షీయల్‌ ‌పాఠశాలలో హిందీలో బోధన చేయాలని సి. రాజగోపాలాచారి( రాజాజీ ) చేసిన ప్రయత్నాలను తమిళులు తిప్పికొట్టారు. అప్పటినుండి ఎప్పుడు హిందీ ప్రస్తావన వచ్చినా ముందుగా తమిళులే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ మాట వినబడితే చాలు నిరాహాదీక్షలు, నిరసనయాత్రలు అక్కడ మామూలైపోయాయి. బ్రిటీషు కాలంలో అంటే 1940లో అక్కడ వచ్చిన వ్యతిరేకతకు హిందీని తప్పనిసరిగా చదువాలన్న ఆదేశాన్ని వారు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. 1965 తర్వాతకూడా హిందీని జాతీయ భాషగా చేయాలని వచ్చిన ప్రతిపాదనపైన కూడా తీవ్రంగా వ్యతిరేకించింది తమిళనాడులోని డిఎంకె పార్టీ. చాలాకాలం ఇక్కడ జరిగిన ఈ ఆందోళనలో దాదాపుగా డెబ్భైమంది  వరకు మరణించి ఉంటారన్నది ప్రభుత్వ అంచనా. దీంతో హిందీయేతర రాష్ట్రాలవారు కోరుకున్నంతకాలం ఆంగ్లం దేశ అధికార భాషగా కొనసాగుతుందని ఆనాటి ప్రధాని లాల్‌ ‌బహద్దూర్‌ ‌శాస్త్రి హామీ ఇచ్చిన మేకు ఉద్యమం సద్దుమణిగింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషలను పరిశీలిస్తే హిందీకి నాల్గవ స్థానం ఉందని చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా అనుసంధాన భాషగా అంగ్లానికి ప్రథమ స్థానం ఉంది. ఆ తర్వాత అత్యధికంగా చెలామణిలో ఉన్నది స్పానిష్‌, ‌మూడవది మాండరిన్‌ ‌భాష. ఇక మనదేశం విషయానికి వస్తే 2011 జనభా లెక్కల ప్రకారం దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య 43.63 శాతం. అంటే దాదాపు 52 కోట్లకు పైగానే జనం హిందీని మాట్లాడేవారున్నారు. అందుకే రాజ్యాంగంలో ముందుగా అంగ్లంను తొలగించి హిందీని మాత్రమే దేశ మంతటా
ఉప •యోగించాలని రాసినప్పటికీ వచ్చిన  వ్యతిరేకత దృష్ట్యా రెండు భాషలను వినియోగించే విధానం అమలులోకి వచ్చింది. నేటికీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అయితే ఇంగ్లీషులో లేదా హిందీతో కొనసాగుతున్నాయి. కాగా, భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు భాష
ఉండాలంటూ ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేసిన ప్రసంగం మరోసారి హిందీ వివాదగ్రస్తంగా మారడానికి కారణమైంది. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ అధికారభాష కమిటి 37వ వార్షికోత్సవ సమావేశం (హిందీ దివస్‌)‌లో ఆయన మరోసారి ఈ ప్రస్థావన తీసుకువవచ్చారు. భిన్న  భాషలు, విభిన్న  ఖండాలుండడమే మనదేశ బలం. అయితే విదేశీ భాషలకు చొటుదొరక్కుండా ఉండడానికి మన దేశానికంటూ ఒక భాష ఉండడం అవసరం. ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులుకూడా అదే ఆశయంతో హిందీని రాజభాష(జాతీయ భాష •)గా అమలు చేయాలని చాలా ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో అనేక ప్రాంతీయ భాషలున్నాయి. ప్రతీ దానికి దాని స్వంత ప్రాధాన్యం ఉంది.

కాని, యావత్‌ ‌దేశాన్ని ఐక్యంచేయగలిగే ఒక భాష అవసరం. అలాంటి భాష హిందీ ఒక్కటే అన్న విషయాన్ని మహత్మాగాంధీ, సర్థార్‌ ‌పటేల్‌ ‌కూడా కాంక్షించిన విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కాని, ఆయన ప్రసంగపాఠం బయటికిరాగానే దేశంలోని విభిన్న ప్రాంతాలనుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయింది. తమకు రాని భాషను తమపై రుద్దటమేంటని, ఇది ఒక విధంగా హిందీ రాని ప్రజలకు అన్యాయం చేసినట్లే అవుతుందంటున్నారు. తమిళనాడు సిఎం స్టాలిన్‌, ‌డిఎంకె ఎంపి కనిమొళి, ఎన్‌డిఏ మిత్రపక్షం పట్టాలిమక్కల్‌ ‌కట్చి (పిఎంకె) వ్యవస్థాపకుడు ఎస్‌. ‌రామదాసు తప్పుపట్టారు. ఏక భాష వల్ల దేశం ఏకంకాదు కదా, విభజన జరుగుతుందంటున్నారు. దేశ భాషలన్నిటిలో  అతిపురాతన మైంది తమిళం కాబట్టి తమిళాన్ని అధికార భాషగా వినియోగించాలని వారు అంటున్నారు. తెలంగాణ మంత్రి కెటిఆర్‌కూడా అ ప్రతిపాదనను  వ్యతిరేకిస్తూ ట్వీట్‌ ‌చేశారు. దేశ ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాష మాట్లాడాలో ప్రజలకే వదిలేయాలని సున్నితంగా తన వ్యతిరేకతను చెప్పారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన  తీసుకువచ్చిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ ‌సింఘ్వీ లాంటివారు విమర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ కూడా దీనిపై స్పందించారు.  గతంలోనే కేరళ, పుదుచ్చేరి సిఎంలు తమ అయిష్టతను వెలుబుచ్చారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా హిందీకి ప్రాముఖ్యతనిస్తుందని, హిందీ నిఘంటువులను సవరించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులకు తొమ్మిదవ తరగతి వరకు  హిందీలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలని, ఇతర భాషలనుండి పదాలను స్వీకరించి హిందీ మార్పు చెందితేగాని వ్యాప్తికాదని మరోపక్క అమిత్‌షా అంటున్నారు. మళ్ళీ రగులుతున్న ఈ వివాదం ఎటు మరలుతుందో మరి.

Leave a Reply