Take a fresh look at your lifestyle.

పది తర్వాత పయనమెటు..

డాక్టర్ కావాల‌నుంది…..కానీ బొద్దింక‌లుక‌ప్పల‌ను కోయాలంటే భయం…

నెక్ట్స్ ఏంటీ.. సరైన నిర్ణయం తీసుకోవాలి 

 

          పదవ త‌ర‌గ‌తి త‌రువాత విద్యార్థులు త‌మ కెరీర్‌ను ఎంచుకునే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ఎంత చెప్పినా సరే.. విద్యార్థులు త‌మ‌కు ఇష్టం ఉన్న కోర్సునే చ‌ద‌వాలి.దాంతో ఆ కోర్సులో రాణించి మంచి కెరీర్‌ను, మంచి భ‌విష్య‌త్తును పొందేందుకు అవ‌కాశం ఉంటుంది.

విద్యార్థుల జీవితాల్లో కీల‌క ఘ‌ట్టాల్లో మెద‌టిది, ముఖ్యమైన‌ది ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత ఎంచుకునే మార్గమే. పదవతరగతి వ‌ర‌కు విద్యార్థులంతా ఉమ్మడిగానే స‌బ్జెక్టుల‌న్నీ చ‌దువుకుంటారు. ప‌ది పూర్తయిందంటే చాలు అందుబాటులో ఎన్నో రకాల కోర్సులు ఉంటాయి. అయితే వాటిలో ఏదో ఒక్క కోర్సు మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. కెరీర్ ఎంపిక‌లో ఆచితూచి అడుగులేయ‌డం ప్రధానమైనది. తాము ఏం కోర్సు తీసుకుంటే మంచిదో, ఏ కోర్సుల‌కైతే భ‌విష్య‌త్తులో ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయో.. ఆ కోర్సుల‌ను ఒక‌టికి రెండు సార్లు స్వాట్ SWOT అనాలసిస్ తో (బలాలు, బలహీనతలు, అవకాశాలు, అవరోధాలు) బేరీజు వేసుకొని, సరి చూసుకుని మంచి కాలేజీల్లో చేరాలి.

మానసిక పరిణతి అవసరం: విద్యార్థి తన నైపుణ్యాలను, సామర్ధ్యాలను అంచనా వేసుకుని, అన్ని కోణాల్లోనూ విశ్లేషించి, అభిరుచి దిశ‌గా అడుగులేస్తే కెరీర్ ప‌రంగా రాణించ‌డానికి, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి  వీల‌వుతుంది.ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ బాగా ఆలోచించిన త‌ర్వాతే అడుగులేయాలి. విద్యార్థి 15 లేదా 16 ఏళ్ల వ‌య‌సులో పూర్తి మానసిక ప‌రిణ‌తితో ఆలోచించ‌డం అంద‌రికీ సాధ్యం కాకపోవ‌చ్చు. కాబట్టి పదవ తరగతి తర్వాతా ఏఏ కోర్సులు ఉంటాయి. ఏ కోర్సుతో ఎలాంటి అవకాశాలు లభిస్తాయి. బలాలు బలహీనతలను స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. సీనియర్ల సలహాలు, గురువుల సూచనలు, కెరియర్ కౌన్సెలింగ్ ద్వారా మనసిక పరిణతి పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

త‌ల్లిదండ్రుల ఇష్టాలను విద్యార్థులపై  రుద్దకూడదు: విద్యార్థుల  గ్రూపు ఎంపిక‌లో త‌ల్లిదండ్రులు స‌హాయ‌కులుగా ఉంటూ మార్గద‌ర్శనం చేయాలే త‌ప్ప తమ వ్యక్తిగ‌త ఇష్టాల‌ను విద్యార్థుల పై రుద్దకూడ‌దు. సాధార‌ణంగా పిల్లల చ‌దువుల విష‌యంలో త‌ల్లిదండ్రుల‌పై ఒత్తిడి ఎక్కువ‌గానే ఉంటుంది. వాళ్ల పిల్లల‌ను బాగా రాణిస్తున్న, తెలిసిన‌వాళ్ల పిల్లల‌తో పోల్చుకోవ‌డం, ఆ గ్రూప్ చ‌దివితేనే ఎక్కువ డబ్బులు సంపాదించడం సాధ్యమ‌వుతుంద‌నే చాలా మంది త‌ల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. త‌ల్లిదండ్రులు త‌మ కోర్కెల‌ను పిల్లల‌పై బ‌ల‌వంతంగా రుద్దుతున్నారు. డాక్టర్ కావాల‌ని విఫ‌ల‌మైన ఓ త‌ల్లి త‌న కుమార్తె డాక్టర్ కావాల్సిందేనని, ఇంజినీర్ కావాల‌నుకుని ప‌రిస్థితుల ప్రభావంతో అకౌంటెంట్‌గా స్థిర‌ప‌డిన తండ్రి త‌న కుమారుడు ఇంజినీర్ కావాల్సిందే అంటూ ప‌ట్టుబ‌ట్టడం స‌మంజ‌సం కాదు. ఇలాంటి సంద‌ర్భాల్లో పిల్లల‌కు ఆయా గ్రూపుల‌పై ఆస‌క్తి ఉంటే ఏ స‌మ‌స్యా ఉండ‌దు.త‌ల్లిదండ్రుల ఇష్ట ప్రకార‌మే చ‌ద‌వాల్సి వ‌స్తే పిల్లల ఆశ‌యాలు మరుగున పడతాయని  గుర్తుంచుకోవాలి. కాబ‌ట్టి త‌ల్లిదండ్రులు వ్యక్తిగ‌త ఇష్టాల‌ను ప‌క్కన‌పెట్టి, పిల్లల క్రమ‌శిక్షణ‌, సామర్ధ్యాల పైనే దృష్టి సారించాలి. అవ‌కాశం ఉంటే వాళ్లు ఎంచుకున్న గ్రూపున‌కు సంబంధించి మ‌రింత‌గా రాణించేలా ప్రోత్సహించాలి.

పది తర్వాతా పయనానికి గుర్తుంచుకోండి: విద్యార్థులు పది తర్వాత పయనానికి పూర్తిగా వ్యక్తిగ‌త ఇష్టానికే ప్రాధాన్యం ఇవ్వండి.అభిరుచులు, సామ‌ర్థ్యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోండి.ఎవ‌రితోనూ పోలిక వ‌ద్దు.స్నేహితులు, బంధువులు, కుటుంబ స‌భ్యుల సూచ‌న‌ల‌ను గుడ్డిగా అనుస‌రించ‌వ‌ద్దు. వారి అనుభ‌వాల‌ను, ఆలోచ‌న‌ల‌ను మీ విశ్లేష‌ణ‌లో ఉప‌యోగించుకోండి.ఆ గ్రూప్ ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టమైన కార‌ణం, ల‌క్ష్యం రెండూ ఉండాలి.బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు బేరీజు వేసుకోవాలి. స్వీయ విశ్లేషణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

సరైన నిర్ణయం తీసుకోండి: ఎంపీసీ అంటే ఇష్టం కానీ లెక్కలంటే భయం? విద్యార్థులు సాధ‌న ద్వారా గ‌ణితంలో ప్రావీణ్యాన్ని పొందే అవ‌కాశం ఉందేమో ఒక‌సారి స్వీయ విశ్లేషణ చేసుకుని ఆలోచించుకోవాలి. గ‌ణితంపై ఆసక్తి ఉండి అందులో ప‌ట్టు సాధించ‌డం క‌ష్టంగా ఉన్నవారు సాధ‌న ద్వారా మెరుగుప‌ర‌చుకునే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఎంపీసీ గ్రూప్ ను ఎంపిక చేసుకోవ‌చ్చు. గణితం పట్ల పూర్తిగా ఇష్టం లేక‌పోతే ఎంపీసీ తీసుకోకపోవడం మంచిది.

డాక్టర్ కావాల‌నుంది కానీ ప్రయోగాలంటే భ‌యం?బైపీసీ అంటే బొద్దింక‌లు, క‌ప్పల‌ను కోయాలి. వాటిని చూస్తే చ‌చ్చేంత భ‌యం అలాంటిది వాటితో ప్రయోగాలు చేయడం కష్టమే అని  ఈ కోర్సుకి దూర‌మ‌య్యేవాళ్లూ ఉన్నారు. బోట‌నీ, జువాల‌జీ స‌బ్జెక్టుల‌పై ప‌ట్టుంటే నిస్సందేహంగా బైపీసీ దిశ‌గా అడుగులేయ‌డ‌మే మంచిది. జంతువు‌లంటే భ‌యం మెల్లిమెల్లిగా అదే పోతుంది.

సీఏ చేయ‌డానికి ఎంపీసీ, ఎంఈసీల్లో ఏది మంచిది?ప‌దోత‌ర‌గ‌తి పూర్తికాగానే ఎలాగైనా సరే  సీఏ కోర్సు చేయాలనే ధృఢ సంకల్పం ఉంటే ఎంఈసీ గ్రూప్‌లో చేర‌డమే ఉత్తమం. మ్యాథ్స్, ఎక‌నామిక్స్‌, కామ‌ర్స్  లు సీఏ కోర్సులో ఉపయోగపడుతాయి. ఎంఈసీలో చేరిన త‌ర్వాత ఇంజినీరింగ్ చేయ‌డం సాధ్యం కాదు. కాబ‌ట్టి కోర్సులో చేర‌క‌ముందే క‌చ్చితమైన నిర్ణయం తీసుకోవ‌డం ముఖ్యం.

పది తర్వాత తొలి అడుగు ఇంటర్‌ విద్య: పదవతరగతి పూర్తయిన తర్వాత ఎక్కువమంది విద్యార్థులుఎన్నుకునే విద్య, అత్యంత ప్రాచుర్యం పొందిన విద్య ఇంటర్మీడియట్‌. ఇందులో సైన్స్‌, ఆర్ట్స్‌ అని రెండు విభాగాలుంటాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ.

ప్రభుత్వ కళాశాలలు ధీటుగా ఉన్నాయి: ఇంట‌ర్‌తోపాటు ఇంజినీరింగ్ ఆరేళ్లు ఉచితంగా చ‌దువుకోవ‌డానికి ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ఇంట‌ర్మీడియట్ విద్యను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, మోడల్ పాఠశాలలు, కస్తూరిభా విద్యాలయాలు, గురుకులాలు, జూనియర్ కాలేజీలలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.  సాంకేతిక విద్యను అభ్యసించాలంటే ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. కాబ‌ట్టి కార్పొరేట్ చ‌దువులుచ‌ద‌వ‌లేనివాళ్లు దిగులు చెందాల్సిన ప‌ని లేదు. ప్రభుత్వ క‌ళాశాల‌ల్లో విద్యన‌భ్యసించి రాణిస్తోన్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది

ఎంపీసీ: ఎంపీసీ పూర్తిగా మాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఇంజనీరింగ్‌, బీఎస్సీకి అవకాశాలుంటాయి అంతేకాక ఈ గ్రూప్‌కు ఆల్‌ రౌండర్‌ గ్రూప్‌గా కూడా పేరుంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ , సైన్స్‌ విభాగాల్లో లెక్చరర్లుగా, సైంటిస్ట్ లుగా, ఇంజనీర్ లుగా, సాఫ్ట్ వేర్ రంగంలో, స్థిరపడాల నుకునేవారు ఎంపీసీలో జాయిన్ కావచ్చు.

బైపీసీ: బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లకు సంబంధించిన పాఠ్యాంశాలను బోధిస్తారు. అంతే కాకుండా వైద్య, వ్యవసాయంలో స్థిరపడాలనుకునేవారు, వృక్ష, జంతు శాస్త్ర సంబంధిత పరిశోధనారంగాల్లో ఆసక్తి కలిగి ఉన్నవారు ఈ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. హోమియోపతి, ఆయుర్వేద, అగ్రి కల్చర్‌, యోగా, డెంటల్‌, ప్రసూతి తదితర అవకాశాలుంటాయి. ఈ సబ్జెక్ట్‌లపై అవగాహన ఉన్న వారు బైపీసీ లో చేరడం మంచిది.

సీఈసీ: సీఈసీ లో ప్రధానంగా అకౌంట్స్‌ కు సంబంధించిన వివరాలునేర్చుకోవడం జరుగుతుంది.ఈ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉంది. బ్యాంక్‌ క్లరికల్‌ పోస్టులకు, కంపెనీ మేనేజ ర్లు, ఆడిటర్లు, సెక్రటరీలుగా చేరాలని ప్రణాళిక వేసుకున్న విద్యార్థులు సీఈసి ఎంచుకోవడం కీలకం. ఇందులో కంపెనీ ఆర్థిక వ్యవహారాలు లెక్కించడం, కంపెనీ ప్రారంభ ప్రక్రియ, భాగస్వామ్య వ్యాపారం, స్టాక్‌ ఎక్సేంజ్‌, మార్కెట్‌ వ్యవహారాలపై పట్టు సాధించవచ్చు. ఇది ఖర్చుతో కూడిన కోర్సు కాకపోవడంతో మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు, ఆర్మీ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులు ఈ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు.

ఎంఈసీ: గణితశాస్త్రంతో  పాటు కామర్స్ పై అవగాహన ఉన్న వారికి మంచి ఉపయోగకరం. అంతే కాకుండా ఈ కోర్సు అనంతరం బీఏ, ఎంఏ, పీహెచ్‌డీతో పాటు సివిల్స్‌, గ్రూప్స్ లలో రాణించడానికి దోహదపడుతుంది.

ఇంటర్ వొకేషనల్ కోర్సు: రెండేళ్ల ఇంట‌ర్ ఒకేష‌న‌ల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు వాటిని పూర్తిచేసుకుని నేరుగా డిప్లొమా రెండో సంవ‌త్సరంలో చేరొచ్చు. అలాగే ఐటీఐలోనూ కొన్ని ట్రేడ్‌ల్లో చేరిన‌వారికి ఈ అవ‌కాశం ఉంటుంది. స్వయం ఉపాధి దొరుకుతుంది.

ఐటీఐ: పదవతరగతి విద్యార్థుల్లో ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ప్లంబర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాల్లో  స్థిరపడాలనుకుంటున్న విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం. ఈ కోర్సుతో జీవితంలో త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువ.

పాలిటెక్నిక్‌: పదవ తరగతి తర్వాత పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాసి పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ కావచ్చు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేసిన‌వారు ఇంజినీరింగ్‌లో నేరుగా ద్వితీయ సంవ‌త్సరం కోర్సులో చేరే అవ‌కాశం ఉంది.

వెటర్నరీ డిప్లమా: పదవతరగతి పూర్తిచేసిన తర్వాత వెటర్నరీ డిప్లమా కోర్సును ఎంచుకోవచ్చును. ఈ కోర్సు చేసిన వారికి పశుసంవర్థకశాఖలో అవకాశాలు ఉంటాయి.

వ్యవసాయపాలిటెక్నిక్‌: వ్యవసాయంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కోర్సు విత్తనోత్పతి, వెటర్నరీ, హార్టికల్చర్‌ తదితర కోర్సులున్నాయి. ఈ కోర్సు అనంతరం బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తిచేస్తే వ్యవసాయవిస్తరణాధికారి, వ్యవసాయాధికారి మంచి ప్రైవేట్‌, ప్రభుత్వ రంగాల్లోని ఉద్యోగంలో తొందరగా స్థిరపడొచ్చు.

ఆసక్తి ఉన్న కోర్సుల ఎంపికే కీలకం: పదవ తరగతి ప్రతీ విద్యార్థి జీవితంలో కీలక మలుపు.. అమ్మానాన్నల చెంత ఉంటూ ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా.. ఆచితూచి అడుగులు వేస్తూ జీవితానికి ప్రణాళిక వేసే టర్నింగ్‌ పాయింట్‌ ఎస్సెస్సీ… పది తర్వాత పలు కీలక కోర్సుల్లో ప్రవేశానికి అవకాశాలు ఉంటాయి… త్వరగా ఉపా ధి సాధించాలనుకునే వారు సాంకేతిక విద్య వైపు మొగ్గు చూపి పాలిటెక్నిక్‌, ఐటీఐ వంటి కోర్సుల్లో చేరుతున్నారు… కొంత మంది నిర్ధిష్ట ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని సివిల్స్‌, గ్రూప్స్‌ వంటి అత్యున్నత అవకాశాల వైపు మొగ్గు చూపుతూ మొదటి నుండి జీవితాన్ని ఉజ్వల భవిష్యత్‌ను రూపొం దించుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకుం టున్నారు… కొంతమంది అవగాహనా రాహిత్యం తో జీవితాన్ని పటుత్వం లేని వ్యవహారంలా ఉన్న అవకాశాలను వినియోగించుకోలేక కేరీర్‌ను మలుచుకోవడంలోతప్పటడుగులు వేస్తూ… చేజేతులారా జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు  ప్రతి విద్యార్థి జీవితంలో ఏదో సాధించాలన్న ఉద్దేశంతోనే, జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలన్న ఆలోచనతోనే అడుగులు వేస్తూ ఉండటం పరిపాటే. విద్యార్థులకు ఇష్టమైన  గ్రూపు తీసుకుని స్పష్టమైన భ‌విష్యత్తు ల‌క్ష్యాలు ఏర్పర‌చుకుని, మొద‌టి నుంచి క‌ష్టప‌డితే ఉన్నత సంస్థలో ప్రవేశాలు పొందవచ్చు.అన్ని కోణాల్లోనూ ఆలోచించిన‌ త‌ర్వాతే భ‌విష్యత్తు నిర్ణయం తీసుకోవాలి. కోర్సు లేదా కెరీర్ ఎంపిక స‌రిగా ఉంటే దాదాపు స‌గం విజ‌యం ఖాయ‌మైన‌ట్టే.

 డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి 

రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్,

 ARPP – INDIA (అసోసియేషన్ ఆఫ్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్ఇండియా)జాతీయఅధ్యక్షుడు

  9703935321 atla610@gmail.com

Leave a Reply