Take a fresh look at your lifestyle.

అఫ్సర్‌ ‌నిరంతర ఆశావాదా? ఉల్లాసకరమైన నిరాశావాదా?

“ఒక చారిత్రక సత్యం ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉన్నది. అధికారంలోకొచ్చిన వర్గం ఏదో మిషతో వేలకువేల గొంతుల్ని మాట్లాడకముందే నొక్కేసి, నిర్దాక్షిణ్యంగా మిలియన్లకొద్దీ పౌరులను హత్యలు చేసిన ఖ్యాతి, ఘనత ఒక్క స్టాలిన్‌కి, ఒక్క మావోకీ దక్కింది. ‘అణిచివేయబడ్డ వర్గాల’ ప్రతినిధులుగా కవితలు రాస్తున్నామనుకునే కవులు, రష్యన్‌ ‌కవయిత్రి ఆనా ఆఖ్మతోవా రాసిన ‘రెక్వీమ్‌’ అనే కవిత కాస్త జాగ్రత్తగా చదివితే, రాజకీయ కవితలు, ఉద్యమ కవితలూ ఇంత గందరగోళంగా రాయవలసిన అవసరం
ఉండదనిపించక మానదు.”

veluri venkateswara rao

కవులు వాళ్ళ తృప్తికోసం కవిత్వం రాసుకుంటారని ఎక్కడో చదివిన గుర్తు. అదేమో కాని, మంచి కవులు అనుకోకుండా చదువరికి కూడా తృప్తినిస్తారు. కారణం: జీవితంలో బోలెడు సందిగ్ధాలు. తేలిగ్గా విశదపరచలేని సందిగ్ధాలు. ఈ సందిగ్ధాలే కవిత్వానికి ప్రేరణ. కవి తన పరిభాషలో ఈ సందిగ్ధాలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే, కవి చెప్పే ఏ సమాధానమూ కవికి, చదివేవాడికీ పూర్తి తృప్తినివ్వదు. అందుకనే ఎప్పటికప్పుడు కవి కొత్తకొత్త మాటలు, కొత్తకొత్త ప్రతీకలూ తయారుచేసుకుంటాడు, కవిత్వం కోసం. ఎన్నెన్నో ఉపమానాలు, ఉత్ప్రేక్షలూ, పెల్లుబుకి పైకొచ్చినా, కవికి అసంతృప్తే మిగులుతుంది. ఎందుచేత? తన కల్పనకీ, తను కవితలో ఉద్దేశించినదానికీ మధ్య గండి పెరిగిపోతోందనే భావన వస్తుండటంచేత. నిజం చెప్పాలంటే, నిజమైన కవి సర్వదా చీకటిలో తడుముకుంటూనే ఉంటాడు. అఫ్సర్‌ ఈ ‌కోవకి చెందిన మంచి కవి.

image.png
అఫ్సర్‌ ‌కవిత్వం ఆవిష్కరణ 

డిసెంబర్‌ 2000 ‌లో ప్రచురించిన ‘వలస’ కవితాసంకలనం చివర ‘నా స్థలకాలాల్లోకి’ అన్న స్వగతంలో అఫ్సర్‌ ఇలా అన్నాడు..
‘కవిత్వం వొక గమ్యం కాదు. అదెప్పుడూ ఒక మజిలీ మాత్రమే. అనివార్యమైన భావాల వుప్పెన ముంచెత్తడమే కవిత్వం. ప్రవాహం కవిత్వ లక్షణం. గమ్యం చేరానన్న తృప్తిలో కవిత్వం లేదు. ప్రవాహ గమనమే కవిత్వం.’’

పాత సంకలనం ‘వలస’లో రాసిన ‘నాలుగు మాటలు’ అన్న పద్యం చూడండి•:

ఉండచుట్టి పారేసిన కాయితాల్లాంటి
చిత్తుపదాల మధ్యన
వొకానొక భావావేశం
మంచుపర్వతంలా..
ఎప్పటికీ పగలని మంచులో
కూరుకుపోయిన పదసమూహాన్ని నేను..
తలుపులు
మూతపడి వున్నాయి పెదవుల్లా..
సమాధిలోకి వెళ్ళిన పదం పునర్జన్మించదు..

‘ఊరి చివర’లో రాసిన ‘రెండంటే రెండు మాటలు’ అన్న కవిత చూడండి:

‘వుండచుట్టి పారేసిన కాయితాలు
కొన్ని ఆలోచనల భ్రూణ హత్యల మరకలు
చిత్తుపదాల శిధిలాలమధ్య
వొకానొక భావావేశం..
ఎంతలెక్కపెట్టినా
శూన్యమే శేషం.
తలుపులు మూతపడి వున్నాయి పెదవుల్లా
పదం సమాధిలోకి వెళ్ళింది
పునర్జన్మ వుందో లేదో..?’

ఈ రెండు కవితలలో ముఖ్యంగా మొదటి చరణాలలో వాడిన మాటలే మళ్ళీ వాడినట్లుగా కనిపించినా, రెండో కవితలో ‘భ్రూణ హత్యల మరకలు’  అన్న ప్రతీకతో భావతీవ్రత హెచ్చింది. అయినా, తను చెప్పదలచుకున్నది ఇంకా తృప్తికరంగా చెప్పలేకపోయినందుకు కవికి కసి పెరిగింది. సమాధిలోకి వెళ్ళిన పదానికి పునర్జన్మ లేదనే నైరాశ్యం రెండో కవితలో పదం ఆపలేని నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తుంది. రెండు కవితల్లోనూ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, కవి నిర్దిష్టమైన సమాధానం కోసం చీకటిలో తడుములాడుకుంటున్నాడు. మంచికవికి ఇది అనివార్య పరిస్థితి. కొత్తగా వచనకవిత్వం రాస్తున్న వాళ్ళు ఇలాంటి ప్రతీకల త్రాణ గుర్తించడం మంచిది.

image.png

‌ప్రసిద్ధ కవి శివారెడ్డితో ..

‘ఊరిచివర’లో ‘వొకానొక అసందర్భం’  కవిత చూడండి:

 ‘చిత్రిక పట్టని
ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా
శవానికి సైతం
కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య.
అలంకారాలన్నీ వొలుచుకున్న
మాటకోసం చూస్తున్నాను
నిఘంటువుల్ని కప్పుకొని
గాఢ నిద్రిస్తున్న భాషలో..’

కవి ఈ విధంగా మాటలను అతిజాగ్రత్తగా చిత్రికపడుతూ, ‘మాటకోసం’ వెతుకుతున్నాడు. ఈ చిత్రికతోటే సంగీతానికి వేదనతో కూర్చిన రంగురంగు మాటల బొమ్మలు వేస్తాడు అఫ్సర్‌. ఈ ‌పని చెయ్యి తిరిగిన కవులే చెయ్యగలరు. 1987లో సైగల్‌ ‌పాట మీద కవిత ఇప్పటికీ నాకు నచ్చే కవితే.

‘కిటికీతెరల కుచ్చుల్ని
పట్టుకు జీరాడుతుంది దిగులుగా నీ పాట
చిగురాకు కొనపై
మంచు బిందువు మరణ వేదన..’

సైగల్‌ ‌పాటలో వేదన అంతా అఫ్సర్‌ ఈ ‌మాటలల్లో చూపించాడు.. తెరమీద బొమ్మలాగా..!

‘వాయులీనమవుతూ’ అన్న కవితలో ఈ క్రింది భాగం చూడండి.. కవిత చివర ఇచ్చిన ఫుట్‌నోట్‌లో వివరాలు విపులంగా లేకపోవడం ఈ కవితకి జరిగిన అన్యాయం. ఈ పొరపాటు జరగటానికి సంపాదకుల అశ్రద్ధే కారణం! (ఫుట్‌నోట్‌లో ఉన్న వాక్యం: రెండు సింఫనీల అనుభవం తర్వాత, వొకటి మామూలుగానే బీతోవెన్‌ది. రెండోది స్టాలిన్‌ ‌కాలంలో వసంత మేఘాలమీదుగా తిరుగుబాటుని ఆలపించిన వయొలిన్‌). అయినప్పటికీ, స్టాలిన్‌ ‌కాలంలో రష్యాలో జరిగిన హత్యాకాండ, అణిచివేతలూ చదివినవాళ్ళకి కవితలో ప్రతీకలు స్పష్టంగానే ప్రతిధ్వనిస్తాయి. వయొలినిస్టు ఎవరో తెలిస్తే సహృదయుడైన పాఠకుడికి సానుభూతి పెరుగుతుంది.

‘ఊపిరి పీల్చడం నేరం
తన చప్పుళ్ళే మార్మోగాలి
చెట్లకి చిగుళ్ళు పుడితే నేరం
ఆకుపచ్చగా విచ్చుకుంటే శిక్ష
చివరికన్నీ ఇనపగజ్జెలే కావాలి
ఇనప మాటలే వినిపించాలి..’ అంటాడు.

ఎంత చిత్రం! ‘వయొలిన్‌ ‌నినాదమవుతుంది, వసంతం గర్జిస్తుంది’ అంటారు అఫ్సర్‌. ‘ఒక రొట్టె ముక్కా, వొక దేశమూ, వొక షెహనాయీ’ అన్న కవితలో, మహ్మద్‌ ‌ప్రవక్త, ఫాతిమా కల, కర్బలా కథని బిస్మిల్లాఖాన్‌ ‌షెహనాయిలోకి అనువదించడం ఫుట్‌ ‌నోట్లుగా సూచించారు. అయితే, వీటి పూర్వకథలు, కవితలో వాడిన ప్రతీకల ప్రత్యేకత తెలిస్తే ఈ కవితని అనుభవించడం సులువు. సంకలన సంపాదకుడు ఈ పని చెయ్యకపోవడం మరొక పెద్ద లోపం..!

ఇక, తెలంగాణా 2002 అన్న కవిత గురించి. ఇది ఒక విచిత్రమైన కథనం. తెలంగాణా/ఆత్మకథనం. సంకలనంలో ఏకైక బృహత్కవిత. పదహారు ఖండికలలో అసంతృప్తుల రాజకీయం, మైనారిటీ పేదల ఆవేదన, ‘అణచబడ్డ’ వర్గాల ఆర్తనాదం, పోరాటం, తిరుగుబాటు వగైరా.. అంతాకలిపి మొత్తం పదకొండు పేజీలు. ఇంతకుముందు ఈ సంకలనాన్ని సమీక్షించిన వాళ్ళు, విమర్శలు రాసిన వాళ్ళూ అంతగా ఈ కవిత ప్రస్తావన తెచ్చినట్టు లేదు. ‘ఇది రాజకీయ కవిత, మనకెందుకులే’ అన్న ధోరణిలో దాటవేశారేమో!

‘నా పంద్రాగస్టు
ఓ పెద్ద వెక్కిరింత కాదూ!
అందరూ మూడురంగుల జెండాలు ఎగరేస్తున్నప్పుడు
నా శరీరం ఒకేఒక్క నెత్తుటిరంగులో తలకిందులుగా
ఏ చెట్టుకొమ్మకో వేలాడుతోంది..’ అంటారు అఫ్సర్‌.

ఆగస్టు15ని, స్వాతంత్య్రదినోత్సవాలని, జాతీయ జెండానీ వామపక్షీయులు ముఖ్యంగా అతివాదవర్గం వాళ్ళు, ఒకానొకప్పుడు దిగంబర కవులూ ఇంతకన్నా ఎక్కువగా హేళన చేస్తూ రాసారు. ఇది అతివాద రాజకీయ కవులని ప్రేతంలా వెంటాడుతున్న ఒక పాత ఫేషన్‌. అఫ్సర్‌ ‌లాంటి తాత్విక కవుల కలం నుంచి ఇలా రావటం చిరాకేస్తుంది. సరిగ్గా ఇదే ధోరణిలో వలస సంకలనం లో ‘అగర్‌ ‌జిందో మె హై’ అన్న కవిత. నిస్సహాయధోరణిలో మొదలై విషాద పరిహాసంతో ముగుస్తుంది. చూడండి:

‘ఏ చరిత్రాలేని నాకు
చరిత్ర పాఠం ఒక్కటే భలే ఇష్టం..’

‘వందేమాతరంలో నాతరం లేదు
జనగణమనలో నా జనం లేరు

నా గొంతు జెండాలా పూరా విచ్చుకోదు
నా ఆగస్టు పదిహేనులన్నీ
శ్మశాన వాటికలోనే..’ ఇదీ కవి ఆవేదన..

‘ఆఖరిచరణంలో మొదటి రెండు లైనులతో పద్యం అంతం అయితే ఎంత అందంగా ఉండేదో ఆలోచించండి. ‘వందేమాతరం’లో తన తరం లేకపోవడం, ‘జనగణమన’లో తన జనం లేకపోవడం వంటి వాక్యాలు చదవడానికి ‘క్యూట్‌’ ‌గా ఉంటాయి, అంతే..! ఇటువంటివి పుస్తకాలమ్ముకునేవాడు పుస్తకం వెనుక అట్టమీద బ్లర్బ్‌లో వేసుకోడానికి పనికి రావచ్చు.

అమెరికన్‌ ‌జెండాని నిరసిస్తూ..అంటే వియత్నాం యుద్ధానికి వ్యతిరేకత స్ఫురింపజేస్తూ ఒకసారి ‘ఏ జాతీయ జెండా కూడా ఆ జాతి ప్రజల ఆశయాలన్నింటికీ, అభిలాషలన్నింటికీ అద్దంపట్టదు’’, అని అన్న మాటలు ఏ నిరసన వాదుల రాతల్లోనూ నాకు కనిపించలేదు.

కొన్ని అఫ్సర్‌ ‌కవితల్లో ‘అసంబద్ధపు’ ప్రశ్నలు వెయ్యటం అమాయకత్వం కింద జమ కట్టవచ్చు.

‘నువ్వు చూపిస్తున్న దృశ్యంలో
బొమ్మని కాను
నువ్వు ఆడిస్తున్న మాటల్లో
మాటని కాను
నేను మాట్లాడిస్తానింక
నేను ఆడిస్తానింక’ అంటూ  కవి ఒకసారి ఎదురుతిరుగుతాడు..

ఒకసారి కవి శపథం చేస్తాడు. ‘ఎప్పుడో పుట్టిన ప్రశ్నకి సానబడుతున్నా, కొడవలికిలా’ అంటాడు.
ఇది పెద్ద గందరగోళం కవిత. వచన కవిత్వాన్ని చదివించేవి, చదువరిని కదిలించేవి, కవితకి ప్రాణం పోసి బతికించేవీ మెటఫర్లు. మోటుబడ్డ కవితావస్తువు మంచి మంచి మెటఫర్లనన్నింటినీ అణగదొక్కేస్తుంది. ఇది నిజం. సరిగ్గా అదే జరిగింది, ఈ కవితలో..!

ఒక చారిత్రక సత్యం ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉన్నది. అధికారంలో కొచ్చిన వర్గం ఏదో మిషతో వేలకువేల గొంతుల్ని మాట్లాడకముందే నొక్కేసి, నిర్దాక్షిణ్యంగా మిలియన్లకొద్దీ పౌరులని హత్యలు చేసిన ఖ్యాతి, ఘనత ఒక్క స్టాలిన్‌కి, ఒక్క మావోకీ దక్కింది. ‘అణిచివేయబడ్డ వర్గాల’ ప్రతినిధులుగా కవితలు రాస్తున్నామనుకునే కవులు, రష్యన్‌ ‌కవయిత్రి ఆనా ఆఖ్మతోవా రాసిన ‘రెక్వీమ్‌’ అనే కవిత కాస్త జాగ్రత్తగా చదివితే, రాజకీయ కవితలు, ఉద్యమ కవితలూ ఇంత గందరగోళంగా రాయవలసిన అవసరం ఉండదనిపించక మానదు.

‘వీరుడి శిరస్సు’ అనేది యుద్ధవ్యతిరేక కవిత. ఫుట్‌ ‌నోట్‌లో అంకిత వాక్యం ఆధారంగా ఈ కవిత బహుశా ఇరాక్‌ ‌తో అమెరికా చేస్తున్న అన్యాయపు/అధర్మపు యుద్ధానికి నిరసనగా రాసిందై ఉండాలి. ఇది కేవలం నినాద కవిత.
‘సగమే గుర్తు’ అన్న కవిత రొమాంటిక్‌గా మొదలై, అనుభూతి కవితగా నడిచి ఆఖరికొచ్చేసరికి ఆవేదనతో చురుక్కుమనిపిస్తుంది.

‘వాన

ఇప్పుడింకా ఆగకపోతే బావుణ్ణు
జొన్న రొట్టె కాలుతోంది
వొంటి సెగలమీద’ అనే  కవితని ‘కురిసీ కురవని’ అనే పాత కవితతో పోల్చి చూడండి:
ఎప్పటిదో తెలీదు
ఎక్కడిదో తెలీదు
తడపటం వొక్కటే తెలుసు వానకి.
లోపలంతా రాత్రంతా
అలా
కురుస్తూనే వున్నా ఏకధారగా.
ఆ మధ్యాన్నపు వానా ఇలాగే
కురిసీ కురవని నీ లాగే
గాయకుడు మిగిల్చి వెళ్ళిన
నిశ్శబ్దంలా వాన
సుదీర్ఘ మౌనానికి నిరసనలా వాన
ఇవాళింక తెరిపి లేదు.!
ఈ ఆఖరి నాలుగు పాదాలూ అచ్చంగా కవిత్వం. చిన్నచిన్న మాటలు అతి జాగ్రత్తగా వాడటం, పద్యం ఆఖర్న పాఠకుడి మనస్సుకి ఒక కుదుపు ఇవ్వడం..  అఫ్సర్‌ ‌ప్రత్యేకత. ‘మూడో యామం’ కవిత ఒక మంచి ఉదాహరణ.

image.png
కథా రచయిత్రి ఝాన్సీ పాపుదేశీతో 

‘చరిత్రకారుడి చేతివేళ్ళని తెగనరికి
కొత్త గతాన్ని తిరగరాస్తాయి ఫత్వాలు
ఫత్వాలకు రంగుతేడాల్లేవు
కూల్చే చేతులకు సరిహద్దులూ లేవు
అనంత కాలాల పగలకు
వొక్క క్షణికోద్రేకమే సమాధానం.
అన్ని మరణాలూ
మట్టిలో కరిగే దేహాలు కావు
నిప్పులో లీనమయ్యే క్షణికాలు కావు
రాలిన రక్తమాంసాల్ని కలిపి కుట్టుకొని
మళ్ళీ సిద్ధమవుతాడు సూర్యుడు
కొత్తదినచర్యకి..’

image.png
 ‌కథా రచయిత్రి అపర్ణా తోట

‘పద్యాల మధ్య
రాజకీయనినాదాల హోరెందుకులే,
అన్నీ మర్చిపోయిన జాతికి
నీతివాక్యాల ముక్తాయింపులెందులే..’

అని అంటూనే అఫ్సర్‌ ‌నినాద కవితలు రాసాడు. బహుశా అతని నిరంతర ప్రయాణంలో ఒక మజిలీ కావచ్చు. కవితా ప్రవాహంలో ఒక మలుపు కావచ్చు.

‘పిచ్చి గీతల మధ్య అ ఆలు వెతుక్కో
అప్పటికీ నీకునువ్వు దొరక్కపోతే
ఓ పిల్లాడి చేతిలో
బొమ్మవై పో!
వాడి ఆట్లో కాసింత ఆనందపు తునకవై పో!
అప్పుడింక కొత్త మాట రాయ్‌!’

అఫ్సర్‌ ‌నిరంతర ఆశావాదా? ఉల్లాసకరమైన నిరాశావాదా? అదేమో కాని, అఫ్సర్‌ ‌కవి. లేబుళ్ళు అనవసరం. ఈ సంకలనంలో అందమైన కవితలు చాలా ఉన్నాయి. వాటన్నింటి గురించీ ప్రస్తావించడానికి వీలు పడదు. వాటిలో కొన్ని: యిక్కడేదో వొక జాంచెట్టు.., అవునా మైక్‌?, ‌సరిగంగ స్నానం, డెజావూ, ఒక సూఫి సాయంత్రం, వగైరా..

‘నేనొక విచ్ఛిన్నమైన వాస్తవికతని. నేను స్త్రీని. నేను దళితుణ్ణి. నేను మైనారిటీని. నేనొకమూడో ప్రపంచాన్ని. చివరికి నేనొక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డ సంక్లిష్ట అంతరంగాన్ని. నేను ఏకవచనం కాదు. అనేక వచనం.’ అంటూ వలస సంకలనం చివర్న రాసుకున్న స్వగతంలో అఫ్సర్‌ ‌తనగురించి  చెప్పుకున్నాడు.

 -వేలూరి వేంకటేశ్వరరావు 

Leave A Reply

Your email address will not be published.