“ఎంత పెద్ద సైనిక శక్తి అయినా పరాయి గడ్డపై ఎక్కువకాలం మనుగడ సాగించలేదన్న చారిత్రక సత్యం మరోసారి రుజువయింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఆఫ్ఘన్ ప్రజలు చేసిన నేరం ఏమీ లేదు. అత్యంత భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నది మాత్రం వారే. ఇంత జరిగిన తర్వాత కూడా వారి ఎదురుగా కటిక చీకటి తప్ప మరోటి లేదు. ఈ అంధకారం ఎప్పుడు మాయమవుతుందో ఎప్పుడు మంచి రోజులు వస్తాయో తెలియదు.”
ఆఫ్ఘనిస్తాన్ లో ఘని ప్రభుత్వ పతనం..కాబుల్ లో తాలిబాన్ పాగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న వార్త. దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. ఆఫ్ఘన్ సేనలు పేరుకు కూడా ప్రతిఘటన ఇవ్వలేకపోయాయి. అమెరికన్లు ఇంకా పూర్తిగా ఖాళీ చేయకముందే తాలిబన్లు మెరుపు వేగంతో దేశాన్ని ఆక్రమించుకోవడం అందరినీ నివ్వెరపరచింది. అమెరికన్లకు కూడా మతి పోయింది. ఆఫ్ఘనిస్థాన్ సైన్యంపై వారు 8,300 కోట్ల డాలర్లు ఖర్చు చేసారు మరి..! తాలిబన్లతో అమెరికన్ల రహస్యఒప్పందం ప్రకారమే ఇది సాధ్యపడిందని అనే దౌత్యవేత్తలు కూడా ఉన్నారనుకోండి. ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ ను ఖాళీ చేయాల్సిందే అన్న ప్రెసిడెంట్ బైడెన్ పట్టుదల పర్యవసానంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాలిబన్లు రాజధాని కాబుల్ లో అడుగుపెడుతుండగా అమెరికన్లు తమ దౌత్య సిబ్బందిని హడావుడిగా హెలీకాప్టర్లలో తరలిస్తున్న దృశ్యాల ఫొటోలు ప్రపంచం అంతా తిరుగుతున్నాయి. కాబుల్ లో ఒక బ్యూటీ సెలూన్ బోర్డుపై ఉన్న అందమైన అమ్మాయి చిత్రంపై ఆ సెలూన్ యజమాని హడావుడిగా రంగు పూస్తున్న ఫొటో కూడా వైరల్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ ను ఈ స్థితికి తెచ్చిన అగ్ర రాజ్యాల రాజకీయాలనూ, ఆఫ్ఘనిస్తాన్ ముందున్న భవిష్యత్తునూ ఈ రెండు దృశ్యాలూ ప్రతిబింబిస్తున్నాయి.
వియత్నాంతో మొదలుపెట్టి అమెరికా వరసగా నికరాగువా, పనామా, గ్రెనడా, ఇరాక్ వంటి దేశాలలో ఏం చేసిందో ఆఫ్ఘనిస్తాన్ లోనూ అదే చేయాల్సి వచ్చింది. అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ప్రస్తుత సందర్భంలో అయితే ఆ నిష్క్రమణ ఆఫ్ఘన్లను నట్టేట ముంచి వెళ్లడం తప్ప మరోటి కాదు. తాలిబన్ల భయంకర మతమౌఢ్యం పాలనను ఒకసారి అనుభవించిన ఆఫ్ఘన్లు చిగురుటాకుల్లాగా వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు.. గత 20 ఏళ్లుగా ఆఫ్ఘన్లు భవిష్యత్తు మీద ఆశతో జీవితాలను నిర్మించుకున్నారు. ఆడపిల్లలు చదువుకున్నారు. మహిళలు తమ అభిరుచుల ప్రకారం పని చేయడం మొదలుపెట్టారు. హక్కులకు గౌరవం దొరకడం మొదలయింది దేశంలో. వార్తా సాధనాలు చురుకుగా మారాయి. ఇదంతా ఒక్క దెబ్బకి నేలమట్టం అవుతుందని అందరి భయం. చేయగలిగిందేమీ లేదు. డబ్బున్న వారు దేశం వదిలివెళుతున్నారు. సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టబోమని తాలిబన్లు ప్రకటించినప్పటికీ ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. దానికి తోడు కాబుల్ వచ్చే దారిలో తాలిబన్లు తమ కర్కశత్వాన్ని కాస్త రుచి చూపించారు.
ఆఫ్ఘనిస్తాన్ కు లెక్కలేనన్ని తెగలు ఉన్నాయి. పేద దేశమైనా ప్రశాంతంగా ఉన్న దేశం. అగ్ర రాజ్యాల ఆటలో పావుగా మారి సర్వ నాశనమైపోయింది. వ్యతిరేకతను మూటగట్టుకున్న కమ్యునిస్టు పాలనను ఆదుకోవడం కోసం 1979లో సోవియట్ యూనియన్ సేనలు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించాయి. సోవియట్ యూనియన్ తో కోల్డ్ వార్ లో నిండా మునిగిఉన్న అమెరికా.. ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ పై దాడికి పాకిస్థాన్ కేంద్రంగా ముజాహిద్దీన్ లు అనే తిరుగుబాటు దారులను అంతులేని ఆయుధాలతో డబ్బుతో ప్రోత్సహించింది. వివిధ ముస్లిం దేశాల నుంచి చాలా మంది మతవాద తిరుగుబాటుదారులు వచ్చి ముజాహిద్దీన్ లు సాగిస్తున్న జిహద్ లో చేతులు కలిపారు. సౌదీ అరేబియాకు చెందిన ఒసామా బిన్ లాడెన్ వారిలో ఒకడు. లెక్కలేకుండా వచ్చి పడుతున్న అమెరికా డాలర్లతో పాకిస్థాన్ సైనిక పాలకులు కూడా పబ్బం గడుపుకున్నారు. పదేళ్ల పోరాటం తర్వాత సోవియట్ యూనియన్ ఇవాళ అమెరికా ఏం చేసిందో అదే చేసింది. పెట్టే బేడా సర్దుకుని ఇంటి దారి పట్టింది. వర్ణించలేని విధ్వంసాన్ని మిగిల్చివెళ్లింది. పది లక్షల మంది నుంచి 20 లక్షల మంది వరకూ ఆఫ్ఘన్లు మరణించారని అంచనా. 60 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సోవియట్ల నిష్క్రమణ తర్వాత దేశాధ్యక్షుడు నజిబుల్లాను కాబూల్ నగరంలో బహిరంగంగా ఉరి తీశారు. అతని శవాన్ని నాలుగు రోజుల పాటు అలాగే వేళ్లాడదీశారు. ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్యుద్ధం మాత్రం ఆగలేదు. ముజాహిద్దీన్ గ్రూప్ లు తమలో తాము కొట్టుకుంటూ పనిలో పనిగా విచక్షణా రహితంగా హత్యలు, మానభంగాలు, బెదిరించి సొమ్ములు వసూలు చేయడాలూ మొదలు పెట్టారు. మరోపక్క పాకిస్థాన్ లో ఉన్న ఆఫ్ఘన్లలో ముల్లా మొహమ్మద్ ఒమర్ అనే వంటికన్ను ముస్లిం మత బోధకుడి నాయకత్వంలో తాలిబన్లు అనే వారు తలెత్తారు. పాక్ పాలకులు వారికి ఆయుధాలు అందించారు.
1994 లో మొదలుపెట్టి రెండేళ్లలో తాలిబన్లు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించారు. తర్వాత రాక్షస పాలనను ప్రపంచానికి రుచి చూపించారు. తాలిబన్లు దేశాన్ని మధ్యయుగపు అంధకారంలోకి నెట్టారు. రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం, చేతులు నరకడం వంటి ఆటవిక శిక్షాస్మృతిని అమల్లోకి తెచ్చారు. ఇస్లాం తప్ప మరో చదువు లేకుండా చేశారు. మహిళల పట్ల మరీ రాక్షసంగా ప్రవర్తించారు. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఐక్యరాజ్యసమితి ఆహార సహాయం కూడా అందడానికి వీల్లేదన్నారు. పంట చేలను తగలబెట్టారు. ఈ రాక్షస పాలనకు వ్యతిరేకంగా అహ్మద్ షా మసూద్ అనే సేనా నాయకుడి నేతృత్వంలో నార్తరన్ ఎలియెన్స్ అనే సంఘటన పోరాటం మొదలుపెట్టింది. కానీ పాకిస్థాన్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషర్రాఫ్ నార్తరన్ ఎలియెన్స్ ను ఓడించడానికి తాలిబన్లకు మద్దతుగా పాక్ సేనలను పంపించాడు. ఈలోపు 2001 సెప్టెంబర్ 11 వ తేదీ వచ్చింది. ఆ రోజున ఏం జరిగిందో గుర్తుందిగా..! అమెరికన్లు పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అమెరికాపైనే పంజా విసిరాడు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ నేలమట్టమయ్యాయి. నెల తిరగకుండా అమెరికన్ సేనలు ఆఫ్ఘనిస్థాన్ పై దాడి చేశాయి. 20 ఏళ్ల తర్వాత అవమానభారంతో నిష్క్రమించాయి. ఎంత పెద్ద సైనిక శక్తి అయినా పరాయి గడ్డపై ఎక్కువకాలం మనుగడ సాగించలేదన్న చారిత్రక సత్యం మరోసారి రుజువయింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఆఫ్ఘన్ ప్రజలు చేసిన నేరం ఏమీ లేదు. అత్యంత భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నది మాత్రం వారే. ఇంత జరిగిన తర్వాత కూడా వారి ఎదురుగా కటిక చీకటి తప్ప మరోటి లేదు. ఈ అంధకారం ఎప్పుడు మాయమవుతుందో ఎప్పుడు మంచి రోజులు వస్తాయో తెలియదు.