Take a fresh look at your lifestyle.

అధునాతనం అంటిరి.. అధ్వాన్నం జెయ్యవట్టిరి..!

  • చెంగిచర్ల కబేలా ఎదుట గలీజుతో పరేషాన్‌..
  • ‌జంతు విడిభాగాల శుద్ధి ప్రక్రియలో అపరిశుభ్రత..
  • కాలుష్యంతో స్థానికుల అవస్థలు..

హైదరాబాద్‌ ‌మహా నగర శివారులోని చెంగిచర్ల ఆధునిక జంతు వధశాల పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొని జుగుప్స కలిగిస్తున్నది. వధశాలతో పాటు దాని పరిసరాల్లోనూ అపరిశుభ్రత నెలకొంటున్నా సంబంధిత అధికారులు ఏ మాత్రం పారిశుధ్య చర్యలు తీసుకొనకపోవడం విస్మయం కలిగిస్తోంది. మాంసం కోసం వధిస్తున్న మేకలు, గొఱ్రెల విడిభాగాలైన కాళ్లు, తల తదితరాలను కాల్చి శుద్ధి చేసేందుకు కబేలా గేటు సమీపంలో చిరు వ్యాపారులు బట్టీలు ఏర్పాటు చేసుకోవడంతో ఇక్కడి పరిసరాల్లో నీరు నిలిచిపోయి మురుగుతో అపరిశుభ్రంగా మారి దుర్గందం వ్యాపిస్తూ అనేక రోగాలకు ఆలవాలమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ కబేలా పరిసరాలు జనసంచారం లేని నిర్జన ప్రదేశాలుగా ఉండేవి. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనూ నివాస సముదాలు నెలకొంటున్నాయి.

- Advertisement -

ఈ ప్రదేశంలో ఏ మాత్రం శాస్త్రీయత లేకుండా, నిబంధనలు, శుభ్రత పాటించకుండా మాంస విడిభాగాల వ్యర్ధాలు ఇక్కడే పారేయడం వంటి చర్యలతో పొగ చూరుతూ మురుగు నీరు నిల్వ ఉండి పందులు, కుక్కలు అక్కడే తిష్ట వేయడంతో దుర్గందం వెలువడుతూ చీకాకు కలిగిస్తోందని పలువురు మండిపడుతున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు సైతం కలుషితమై శ్వాసకోశ, చర్మ వ్యాధులకు కారణమవుతున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబేళాతో పాటు పరిసరాల్లో తీవ్ర కాలుష్యం నెలకొని దుర్వాసనలు వెలువడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గానీ హైదరాబాద్‌, ‌బోడుప్పల్‌ ‌బల్దియాల అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదని విమర్శలు మిన్నంటుతున్నాయి. వ్యర్థాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మచ్చుకైనా కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కలుగజేసుకుని ఇక్కడి నుంచి విడిభాగాల శుద్ధిపరిచే ప్రక్రియను తొలగించి సువిశాలమైన స్థలం కలిగిన కబేలా ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అదే విధంగా జంతు విడిభాగాలు శుద్ధికి అవసరమైన పైప్‌లైన్‌ ‌ద్వారా నీటి వసతి, ఫ్లాట్‌ఫాంలు, మురుగు నీరు వెళ్ళేందుకు అవసరమైన భూగర్భ పైప్‌లైన్‌ ‌నిర్మాణం వంటివి అత్యవసరంగా ఏర్పాటు చేయించాలని పలువురు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

చెంగిచర్ల మోడర్న్ ‌స్లాటర్‌ ‌హౌజ్‌ ఏర్పాటు క్రమం..
హైదరాబాద్‌ ‌నగరంలోని జంతు వధశాలలను అన్నింటినీ మూయించి ఒకే చోటు నుంచి మాంసం అందించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే పరిసరాల్లోని చెంగిచర్లలో గత 17 సంవత్సరాల క్రితం 83 ఎకరాల సువిశాలమైన స్థలంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఆధునిక జంతు వధశాల(మోడర్న్ ‌స్లాటర్‌ ‌హౌజ్‌)‌ను నెలకొల్పింది. అయితే ఈ స్థలంలో నుంచే జాతీయ మాంస పరిశోధన కేంద్రం (ఎన్‌ఆర్‌సీఎం)కు పదెకరాలు ప్రభుత్వం కేటాయించి అప్పగించింది. ఈ సంస్థ ద్వారా మాంస ఉత్పత్తులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల హైదరాబాద్‌ ‌మహా నగరంలోని పలు పాత కబేలాలు మళ్ళీ తెరుచుకున్నాయి.

Leave a Reply