Take a fresh look at your lifestyle.

వామ్మో…. ఇవేమీ బియ్యం రేషన్‌ ‌దుకాణాల్లో బియ్యం కల్తీ

పట్టించుకోని అధికారులు…. అయోమయంలో లబ్దిదారులు
ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందజేస్తున్న రూపాయి కిలో బియ్యం పరిగి మండలంలో కొన్ని చోట్ల నాణ్యతా లోపంతో పంపిణీ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా పేద ప్రజలకు నాణ్యతా లోపంతో అందుతున్నాయి. తమకు ఇచ్చే బియ్యంలో రాళ్ళు, నూకలు మరికొన్ని చోట్ల దారాలు, కొబ్బరి ముక్కలు, వక్కలు లాంటి వస్తువులు వొస్తుండంతో లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ బియ్యం నాణ్యత లేకపోవడంతో తినడానికి ఇబ్బందిగా ఉందని పలువురు వాపోతున్నారు. పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో లబ్దిదారులకు అందజేస్తున్న రేషన్‌ ‌బియ్యం కల్తీమయంగా, తినడానికి పనికిరాని స్థితిలో వొస్తున్నాయంటూ లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేషన్‌ ‌దుకాణంలో అందజేసిన బియ్యంలో ఏకంగా కొబ్బరి ముక్కతో పాటు వక్కలు రావడం చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారన్నారు. బియ్యంలో ఇలా కొబ్బరి ముక్క, వక్కలు రావడంతో ఇదేంటని అడిగితే మేమేం చేయాలి, అవి అలాగే ఉన్నాయని తమను ఏం చేయమంటారంటూ, కనీసం ఆ బియ్యాన్ని మార్చి ఇవ్వాలని కోరినా ఇవ్వం అందరూ అలాగే చేస్తే తమ పరిస్థితి ఏంటంటూ డీలర్‌ ‌నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Adulteration of rice in ration shops

ఇదిలా ఉంటే..ఇలా బియ్యం కల్తీ జరుగుతూ నాణ్యతా లోపంతో తమకు పంపిణీ చేస్తుంటే వాటిని అరికట్టాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply