- దేశానికి నమూనాగా తెలంగాణ అభివృది
- రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షల 28 వేలకు పెరిగింది
- కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డా..నిలదొక్కుకున్నాం
- కోరోనాను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టాం
- ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అన్ని రంగాల్లో దూసుకుని వెళుతోందనీ, విద్యుత్ రంగంలో అద్వితీయ విజయాలు సాధించడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. గత యేడాది యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని త్వరితగతిన గాడిలో పెట్టగలిగామన్నారు. ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలచిందనీ, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
అసెంబ్లీ బ్జడెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ డా. తమిళసై సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం అని తెలుగులో చెప్పి.. గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజల పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న గవర్నర్ ..పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచామన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించామని తెలిపారు. ఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. ఆరు దశాబ్దాల తరువాత ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడిన తెలంగాణ అనేక మైలురాళ్లను అధిగమించింది.
రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎన్నో అపోహాలు సృష్టించారు. కానీ నేడు అభివృద్ధికి తెలంగాణ నిదర్శనంగా నిలిచింది. గతంలో విమర్శలు చేసిన వారి నోళ్లు మూతపడ్డాయి. తెలంగాణ ప్రగతి చూసి దేశం ఆశ్చర్యపోయింది. సంక్షేమానికి తెలంగాణ పెద్దపీట వేస్తోంది. కేసీఆర్ నేతృత్వంలో వినూత్న పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యుత్ రంగంలో విప్లవాత్మక అభివృద్ధి సాధించాం. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామనీ, కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా అభివృద్ధి చెందామని చెప్పారు. కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా పడిందనీ, పరిస్థితి అదుపు తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. కరోనా రికవరీ కేసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఎంతో కష్టపడ్డారు.
వాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని రంగాల్లోనూ తెలంగాణ దూసుకెళ్తుందని అన్నారు. ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. వనరుల సద్విని యోగం ద్వారా రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై దృష్టి సారించామని తెలిపారు. ఈ ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2 లక్షల 28 వేలకు పెరిగిందన్నారు. ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తున్నామని చెప్పారు. కొవిడ్ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి, మేం వ్యూహాత్మకంగా అడుగులు వేశాం. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం అద్వితీయ విజయాలు సాధించిందని తెలిపారు. 24 గంటల పాటు విద్యుత్ అందించే తొలి రాష్ట్రంగా రికార్డు సాధించామన్నారు. ఇండ్లు, దుకాణాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. జాతీయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్ తలసరి వినియోగం ఎక్కువ అని చెప్పారు. విద్యుత్‌రంగ సంస్కరణల పై కేంద్రం రాష్ట్రాన్ని ప్రశంసించింది.