తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో రూ.44 లక్షలతో చేపడుతున్న స్మశాన వాటిక నిర్మాణం పనులను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. అయితే గ్రామానికి అదనపు కలెక్టర్ వచ్చిన నేపథ్యంలో స్థానిక కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్, రాంసింగ్ నాయక్ లు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు స్థానిక కౌన్సిలర్లమైన తమకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. గ్రామంలో ఓ వర్గం వారు ప్రత్యేకంగా చితి మండపాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఇతర వర్గాల వారు కూడా సొంత నిధులతో ప్రత్యేకంగా స్మశానవాటికలు నిర్మిస్తామని తమపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. బోరు బావిని పూడ్చి షెడ్ నిర్మాణం చేపడుతున్నారని వారు అదనపు కలెక్టర్ కు వివరించడంతో ఏఈ సంజయ్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగంగా హెచ్ఎండీఏ అధికారులు గ్రామ స్మశాన వాటికను ఆనుకొని కొంత స్థలాన్ని కేటాయించారని, కానీ ప్రస్తుతం గ్రామానికి సంబంధించిన స్మశాన వాటిక ప్రహరి తొలగించి మొత్తం ఒకటిగా చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు అదనపు కలెక్టర్ కు చెప్పడంతో డబుల్ బెడ్ రూమ్ స్మశాన వాటికలోకి రాకుండా ప్రస్తుతం ఉన్న స్మశాన వాటికను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని ఆయన తెలిపారు. కొల్లూరు నుండి రంగారెడ్డి జిల్లా జొన్నాడ గేట్ వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కౌన్సిలర్లు కోరడంతో వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వెంకట మణికరణ్ ను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మల్లేపల్లి లలితా సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.