రాష్ట్రంలో 928కి చేరిన కొరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య మంగళవారం రాత్రి వరకు 928కి చేరింది.కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 194 కాగా, ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బులెటిన్ విడుదల చేశారు. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 56 కేసులు నమోదయ్యాయి. వీటిలో సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 26, జీహెచ్ఎంసి పరిధిలో 19, నిజామాబాద్‌లో 3, గద్వాల, ఆదిలాబాద్‌లో 2, ఖమ్మం, మేద్చల్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు.
కాగా, సూర్యాపేట జిల్లాలో కొరోనా ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన పాజిటివ్ 54 కాగా, ఒక్క మంగళవారం రోజే 26 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 80కి చేరడం గమనార్హం. ఇప్పటివరకు సేకరించిన 796 నమూనాలలో ఇంకా 191 నమూనాలకు సంబంధించిన రిజల్టస్ రావాల్సి ఉందని జిల్లా వైద్యాధికారి వెల్లడించారు.