Take a fresh look at your lifestyle.

పార్లమెంటులో ఆదానీ ప్రకంపనలు

  • హిండెన్‌బర్గ్ ‌నివేదికపై చర్చకు విపక్షాల పట్టు…
  • వాయిదా తీర్మానాలు
  • ఉభయసభల్లోనూ గందరగోళం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 2 : గురువారం హిండెన్‌బర్గ్ ‌నివేదికపై చర్చకు డిమాండ్‌ ‌చేస్తూ విపక్షాల గందరగోళం మధ్య లోక్‌సభ, రాజ్యసభలు మొదట మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. దాంతో పాటు పార్లమెంట్‌ ఉభయసభల్లో బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అదానీ కంపెనీలపై చర్చను చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ విపక్షాలు వెల్‌ ‌లోకి దూసుకువెళ్లి… ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ఇదే అంశం చర్చపై ఆందోళన కొనసాగడంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా.. రాజ్యసభ ఛైర్మెన్‌ ‌ధన్‌కర్‌ ‌మధ్యాహ్నాం రెండు గంటల వరకు సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోట్లాది మంది భారతీయుల కష్టార్జిత సొమ్మును ప్రమాదంలో పడేస్తూ మార్కెట్‌ ‌విలువను కోల్పోతున్న కంపెనీల్లో ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల పెట్టుబడుల సమస్యపై చర్చించేందుకు రూల్‌ 267 ‌కింద బిజినెస్‌ ‌నోటీసును సస్పెండ్‌ ‌చేశామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే పార్లమెంటు వెలుపల అన్నారు. ఈ అంశంపై జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎం‌పీ మనీష్‌ ‌తివారీ డిమాండ్‌ ‌చేశారు.

ప్రశ్న ఒక ప్రమోటర్‌ ‌గురించి మాత్రమే కాదని, మొత్తం నియంత్రణ వ్యవస్థ యొక్క సమర్థత గురించని ఆయన స్పష్టం చేశారు. అదానీ గ్రూపు కంపెనీలపై వెలువడిన హిండెన్‌బర్గ్ ‌నివేదికపై చర్చించాలని ప్రతిపక్షాలు గురువారం ప్రభుత్వాన్ని డిమాండు చేశాయి. అదానీ గ్రూపు అక్రమాలకు, అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ‌రిసెర్చ్ ‌చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపక్షాలు కోరాయి. పార్లమెంట్‌లో అనుసరించవలసిన వ్యూహాన్ని చర్చించేందుకు భావసారూప్యతగల ప్రతిపక్షాలు గురువారం పార్లమెంట్‌ ‌సమావేశాల ప్రారంభానికి ముందు సమావేశమయ్యాయి. ఈ అంశంపై సభ చర్చించాలని కోరుతూ పలువురు ప్రతిపక్ష ఎంపిలు సంబంధిత సభలకు నోటీసులు ఇచ్చాయి. అయితే సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఇలా ఉండగా..ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్‌ ‌సింగ్‌ ‌విలేఖరులతో మాట్లాడుతూ మోసాలు, అబద్ధాలతో గౌతమ్‌ అదానీ నిర్మించిన సౌధాలు పేకమేడల్లా కూలిపోతున్నాయని ఆరోపించారు. దేశంలోని కోట్లాదిమంది పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారని, అదానీ కంపెనీలకు వేల కోట్లలో రుణాలిచ్చిన ఎల్‌ఐసి, ఎస్‌బిఐ పరిస్థితే ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ సభనుద్దేశించి వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగితే ఆర్‌బిఐ, ఇడి, సిబిఐ ఏం చేయకుండా ఎందుకు ఉన్నాయో ఆర్థిక మంత్రి చెప్పాలని, ఎఫ్‌పిఓ కేవలం ఆరంభమేనని, అదానీ అసత్యాల గుట్టలు కూలిపోవడం తథ్యమని సంజయ్‌ ‌సింగ్‌ అన్నారు. అదానీ పాస్‌పోర్టును జప్తు చేసుకోవాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఇకపోతే అదానీ కంపెనీలపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ ‌రీసెర్చ్ ‌సంస్థ ఇచ్చిన రిపోర్టుపై చర్చ చేపట్టాలని పార్లమెంటు ఉభయసభల్లో బీఆర్‌ఎస్‌ ‌తీర్మానం ప్రవేశ పెటింది. ఈ నివేదికతో దేశ ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని వాదించింది. ఈ అంశంలో బీఆర్‌ఎస్‌ ఎం‌పీ కేశవరావు రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. రూల్‌ 267 ‌కింద చర్చ చేపట్టాలని ఎంపీ డిమాండ్‌ ‌చేశారు. ఇక లోక్‌సభలోనూ ఇదే అంశంపై చర్చించాలని బీఆర్‌ఎస్‌ ‌నేత నామా నాగేశ్వరరావు డిమాండ్‌ ‌చేశారు. కేవలం బీఆర్‌ఎస్‌ ‌మాత్రమే కాదు అదానీ గ్రూపు పాల్పడిన ఆర్థిక అవకతవకలపై చర్చించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. 267 చట్టం కింద ఈ అంశాన్ని చర్చించాలని ఆప్‌ ఎం‌పీ సంజయ్‌ ‌సింగ్‌ ‌కోరారు. అదానీ గ్రూపు మోసానికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.

Leave a Reply