న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : అదానీ స్టాక్స్ మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని భారత్ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీలు గురువారం కూడా పార్లమెంట్‌లో డిమాండ్ చేశాయి. ఉభయసభలను బహిష్కరించిన ఇరు పార్టీలు..పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్, ఆప్ పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేశారు. అదానీ సంక్షోభంపై తేల్చేందుకు జేపీసీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మోసాలను ఇక సహించమని అన్నారు. ఆదానీ అక్రమాలపై నిగ్గు తేల్చాలని బిఆర్‌ఎస్ నేత కేశవరావు డిమాండ్ చేశారు.
ఆదానీ మోసాలను కప్పిపుచ్చలేరని అన్నారు. ఇక రాజ్యసభలో ప్రధాని మోదీపై ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ఇష్యూలను డైవర్ట్ చేస్తున్నారని, అదానీ గురించి ఎన్నో ప్రశ్నలు వేశామని, కానీ ఒక్కదానికి కూడా సమాధానం రాలేదని ఖర్గే అన్న వ్యాఖ్యల్ని తొలగించారు. దేశ ప్రజల హక్కు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటుందని ఖర్గే అన్నారు. అన్ని రూల్స్‌ను పరిగణలోకి తీసుకుని తన వ్యాఖ్యల్ని తొలగించాలని, ఈ అంశంలో మూడు పేజీల రిప్లై ఇచ్చినట్లు ఖర్గే తెలిపారు.