Take a fresh look at your lifestyle.

తెలుగు ‘డ(బ్బు)బ్బా’ హీరోలు…!!

  • గడప దాటని తెలుగు హీ(జీ)రోలు..   
  • లాక్‌డౌన్‌లో  టాలీవుడ్‌ ‌సేవల్‌ ‌నిల్‌…
  • ‌సోనూసూద్‌ను చూసైనా సోయి తెచ్చుకోని టాలీవుడ్‌
  • ‌ప్రజలు బాగుంటేనే కదా సినీమాలు చూసేది…నడిచేది 
  • పరిశ్రమ బాగుపైన ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేకపాయే..
  • అన్నం పెట్టి..వాహనాలను సమకూర్చి వలస కూలీలను స్వస్థలాకు పంపిన బాలీవుడ్‌ ‌హీరోలు..రి(ల్‌)‌యల్‌ ‌హీరోలు ఎవరూ?
  • వరుసగా తెలుగు రాష్ట్రాల సిఎంలతో భేటీలతో కాలం గడిపిన టాలీవుడ్‌
  • ‌సిఎం కేసీఆర్‌తో తెలుగు పెద్దల భేటీపై టాలీవుడ్‌లో భిన్న స్వరాలు

సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు చిత్ర పరిశ్రమ…కొరోనా  వైరస్‌ ‌మహమ్మారి వ్యాప్తి చెందిన లాక్‌డౌన్‌ ‌వేళ…బాధితులను ఆదుకునే విషయంలో పూర్తిగా విఫలమయ్యారనీ అపకీర్తిని ‘మూట’కట్టుకుందని చెప్పాలి. తెలుగు పరిశ్రమకు చెందిన హీరోలు, నిర్మాతలు, దర్శకులకు చిత్ర పరిశ్రమపైన ఉన్న ప్రేమ ప్రజలపై ముఖ్యంగా లాకడౌన్‌లో బాధితులపై లేదని స్పష్టమైంది. చిత్ర పరిశ్రమ బాగుండాలి, బతకాలంటూ… ముఖ్యమంత్రుల చుట్టూ తిరగారే తప్పిస్తే…ఏ ఒక్క కొరోనా  బాధితుల(వలస కార్మికులు)ను ఆదుకుందాం. అండగా ఉందాం. సాయం చేద్దాం అంటూ విజ్ఞప్తి చేయడానికి ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాకపోవడం సిగ్గుచేటు! లాక్‌డౌన్‌తో వలస కూలీలు బిడ్డా, పాపల్ని భుజాన వేసుకుని  వందల కిలో మీటర్లు కాలినడకన నడుస్తూ వారి వారి స్వస్థలాలకు వెళ్లారు. ఓ పక్క ఆకలి, ఇంకో పక్క సొంతూరుకు వెళ్లాలన్న తపనతో కాళ్లకు పగుళ్లొచ్చినా, కాయలు కాసినా వారి నడకను ఆపలేదు. ఇలాంటి వలస కూలీల బతుకు బాధలను చూసి ఎన్నో హృదయాలు స్పందించాయి. మేమున్నామంటూ వారికి తోచిన కాడికి ఆర్థిక సాయం చేశారు. అన్నం పెట్టారు. చిట్ట చివరకు నెల నెలా పింఛన్‌ ‌తీసుకునే వారైనా స్పందించారు కానీ, ఎంతో పేరు, ప్రఖ్యాతలు గడించిన, వేల కోట్లకు ఎదిగిన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక హీరో గుండె కూడా స్పందించలేదు. ఏ ఒక్క వలస కూలీని వారి స్వస్థలాకు చేర్చేందుకు ముందుకొచ్చిన పాపనపోలేదు  తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు.  తాజా పరిస్థితులలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు వ్యవహరించిన తీరుతో వీళ్లందరూ రీల్‌ ‌హీరోలే కానీ, ఒక్కరు కూడా రియల్‌ ‌హీరో కాదన్న విషయం చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనబడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వందలు, వేల కోట్లు ఉన్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. కానీ, వీరిలో ఏ ఒక్కరు కూడా బాలీవుడ్‌కు చెందిన సోనూసూద్‌ ‌చూపెట్టిన ప్రేమ, సాయంలో ‘పైసా’వంతు కూడా చూపెట్టకపోవడం నిజంగానే దురదృష్టకరం అని చెప్పాలి. అంతేకాదు, వీరు తెలుగు హీరోలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి!  కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి సందర్భంలో బాలీవుడ్‌ ‌హీరోలతో పోల్చుకుంటే టాలీవుడ్‌ ‌హీరోలు డ(బ్బు)బ్బా హీరోలుగా మిగిలిపోయారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇంతగా ఖ్యాతి చెందిందన్నా…అనేక మంది హీరోలుగా వెలుగొందుతున్నారన్నా…దానికి కారణం తెలుగు ప్రజలు. కష్టార్జితంతో వందల రూపాయలు పెట్టి సినీమాలు చూస్తేనే సినీమాలు ఆడేది. హీరోలయ్యేది. సినిమా పరిశ్రమ బతికేది. సినీమా పరిశ్రమకు జీవం పోసే వారికే జీవం లేకుండా పోతుంటే…ఇక సినిమా చూసేది ఎవరూ. ఈ మాత్రం సోయి కూడా టాలీవుడ్‌కు చెందిన వారికి లేకపోవడం ప్రజలు చేసుకున్న పాపంగానే చెప్పాలి. కొరోనా వేళ…చిత్ర పరిశ్రమ బతకాలంటూ ముఖ్యమంత్రుల చుట్టూ టాలీవుడ్‌ ‌తిరిగిందే తప్పా..కష్టాల్లో ఉన్న కూలీలు, ప్రజల దగ్గరికి ఒక్కడంటే ఒక్క సినీమా హీరో వెళ్లిన దాఖలాలు లేవు. కష్టాల్లో ఉన్న ప్రజలపై కనీసం మానవత్వం కూడా చూప్టెని తెలుగు డ(బ్బు)బ్బా హీరోలు చరిత్రలో జీరోలుగా మిగిలిపోవడం ఖాయం. తెలుగు డ(బ్బు)బ్బా హీరోలపై ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం ఇదీ…

ప్రజలుంటేనే కదా…సినిమా పరిశ్రమ బతికేది..నడిచేది…
లాక్‌డౌన్‌ ‌కారణంగా ఆగిపోయిన సినీమా షూటింగ్‌లు, పోస్ట్ ‌ప్రొడక్షన్‌ ‌పనులను దశలవారీగా పునరుద్ధరించాలంటూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు డి. సురేష్‌బాబు, సి. కల్యాణ్‌, అల్లు అరవింద్‌, ‌దిల్‌ ‌రాజు, దామోదర ప్రసాద్‌, ‌కిరణ్‌, ‌దర్శకులు రాజమౌళి, ఎన్‌. ‌శంకర్‌, ‌మెహర్‌ ‌రమేష్‌, ‌త్రివిక్రమ్‌ ‌శ్రీనివాస్‌, ‌రాధాకృష్ణ, కొరటాల శివ, తమ్మారెడ్డి భరద్వాజ్‌, ‌సి. కల్యాణ్‌ ‌వంటి ప్రముఖులు సినీమా మంత్రి తలసాని శ్రీనివాస్‌తో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొరోనా వైరస్‌ ‌బాగా వ్యాప్తిచెందిన వేళ…ఇంటి నుంచి బయట కాలు పెట్టడానికి భయపడిన సమయంలోనే సినీ ప్రముఖులందరూ ప్రగతిభవన్‌కు వచ్చి సిఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలమంది జీవిస్తున్నందున సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ‌ప్రొడక్షన్‌ ‌వర్కస్‌, ‌సినిమా థియేటర్ల పునఃప్రారంభం చేసుకునేలా అనమతి ఇవ్వాలంటూ సిఎంను కోరారు.  సినిమా షూటింగ్‌లు, థియేటర్లను రీ ఓపెన్‌ ‌చేసేందుకు అనుమతులు ఇవ్వాలన్న సినీ ప్రముఖుల విజ్ఞప్తికి స్నిఎం కేసీఆర్‌ ‌కూడా సానుకూలంగా స్పందించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే, సినీమా పరిశ్రమ బతకాలంటే ముందుగా సినీమాను చూసే ప్రజలు బతికి ఉండాలి కదా. కొరోనాతో లాక్‌డౌన్‌తో యావత్‌ ‌ప్రజానీకం అష్ట కష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి లేక…ఉండటానికి చోటు లేక‘బతికి ఉంటే బలుసు ఆకైనా తిని బతుకొచ్చని’ వందల కిలో మీటర్లు కాలినడకన వారి వారి స్వస్థలాకు పయనమయ్యారు. ఈ ప్రయాణంలో వలస కూలీల బాధలు వర్ణనాతీం. వీరి కష్టాలను చూసి ప్రతి ఒక్క గుండె స్పందించింది ఒక తెలుగు పరిశ్రమకు చెందిన
వాళ్లు మినహా.  ఇలాంటి వారు చిత్ర పరిశ్రమ బతకడానికి మంత్రులు, ముఖ్యమంత్రులను కలుస్తున్నారే కానీ, అదే సమయంలో లాక్‌డౌన్‌తో ప్రజలు మరీ ముఖ్యంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వారిని కూడా ఆదుకోవాలంటూ చిన్న విజ్ఞప్తి కూడా చేసిన పాపాన పోలేదు మన తెలుగు డ(బ్బు)బ్బా హీరోలు.

సోనూసూద్‌ను చూసైనా సోయి రాకపాయే…
బాలీవుడ్‌కు చెందిన సోనూసూద్‌ ‌సినీమాలలో విలన్‌ ‌పాత్రలు పోషించినప్పటికీ…కొరోనాలో లాక్‌డౌన్‌ ‌వేళ.. నిజంగా హీరో అనిపించుకున్నారు. అందరి మనస్సులో స్థానం సంపాదించుకున్నారు. బాలీవుడ్‌కు చెందిన సోనూసూద్‌ ‌నుంచి షారుఖ్‌ ‌వరకూ…బాలీవుడ్‌ ‌నటులెందరో కోవిద్‌-19 ‌బాధితులకు విరాళందించడం కన్నా ఎక్కువగా సేవలందించారు. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి సందర్భంలో బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్‌ ‌నటులు సమయానికి సాయం అందించడంతో పాటు తాము చేయగలిగినదాని కన్నా ఎక్కువే చేశారని చెప్పాలి.  తెరమీదనే కాదు, బాహ్య ప్రపంచంలోకూడా వారు హీరోలు అనిపించారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపడంలో వారు ఎక్కువ ఆసక్తిని  ఉత్సాహాన్నీ ప్రదర్శించారు. అక్షయ్‌ ‌కుమార్‌ అనాథ పిల్లలను చేరదీసి వారికి అవసరమైన సాయం అందించారు. వీరు కొరోనా బాధితులకు విరాళాలు అందించడం సంగతి సరేసరి. కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇతరేతర సాయం అందించే విషయంలో చొరవ తీసుకున్నారు. బీ-టౌన్‌ ‌స్టార్‌లు అందించిన సాయం గురించజాబితా  పెద్దదే ఉంది. షారూఖ్‌ ‌ఖాన్‌ ‌తన కార్యాలయాన్ని క్వారంటైన్‌ ‌కెంద్రంగా ఇచ్చారు   అనాథపిల్లలు తమ అవ్వ,తాతలతో కలిసేందుకు తోడ్పాటు అందించారు. దాంతో ఆయన మీడియాలో అత్యధికంగా పేరు సంపాదించారు. షారూఖ్‌ఖాన్‌ ‌తన ఫౌండేషన్‌ ‌ద్వారా అవసరార్ధులకు తగిన సాయం అందించారు. తల్లిని కోల్పోయిన పిల్లలను అవ్వతాతల వద్దకు చేర్చారు. వారిలో చెప్పలేని ఆనందం కనిపించింది. ఇప్పుడు ఆ పిల్లలు తాత, నాయనమ్మల సంరక్షణలో ఉన్నారు. ఈ విషయం తెలిసి తాను ఆనందించానని షారూఖ్‌ఖాన్‌ ‌ట్విట్టర్‌ ‌లో పోస్టు చేశారు.అక్షయ కుమార్‌ ‌పీపీఈలు, మాస్క్‌లు, రాపిడ్‌ ‌టెస్టింగ్‌ ‌కిట్స్ ‌విరాళంగా ఇచ్చారు.అక్షయ్‌ ‌కుమార్‌ ‌ముంబాయి పోలీసులకు రిస్ట్ ‌బాండ్లు వెయ్యివరకూ విరాళంగా ఇచ్చారు. సల్మాన్‌ ‌ఖాన్‌ ‌లక్ష పైగా శానిటైజర్లు ముంబాయి పోలీసులకు అందజేశారు. అజయ్‌ ‌దేవగన్‌ ఆక్సిజన్‌ ‌సిలిండర్లర్లు, వెంటిలేటర్లను సాయంగా అందించారు. పాన్వెల్‌లో అనాథ పిల్లలకు నిత్యావసరాలను సరఫరా చేశారు. విరాట్‌ ‌కొహ్లీ కూడా నగరంలో  ఆపన్నులకు సాయం అందించారు. కోవిడ్‌హొ-19 సహాయ నిధికి విరాళాలు అందించారు. ప్రియాంకా చోప్రా అమెరికాలో ఉన్నప్పటికీ బాధితులకు పాదరక్షలు ఇతర వస్తువులను అందించారు. మొత్తం మీద బాలీవుడ్‌ ‌నటీనటులు  కొరోనా బాధితులకు  కేవలం నగదు రూపంలోనే కాకుండా తమకు తోచిన విధంగా సాయం అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు.అయితే,  ముఖ్యంగా  సోనూ సూద్‌ ‌వలస కార్మికులను స్వస్థలాలకు పంపడంలో తీసుకున్న చొరవ నిజంగా అభినందనీయం.  సోనూ సూద్‌ ‌నిజ జీవితంలో హీరో అనిపించుకున్నారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేకంగా బస్సులను,  రైళ్లనే కాకుండా ప్రత్యేకంగా విమానాలను కూడా ఏర్పాటు చేశారు. వాహనాల ఏర్పాటే కాకుండా వలస కార్మికులు వారి వారి స్వస్థలాలకు చేరే వరకు వారికి మంచినీరు, భోజనం, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు.  శానిటైజర్‌ ‌లను కూడా అందించారు. బాలీవుడ్‌కు చెందిన నటులు ఇంతగా చేస్తే తెలుగు పరిశ్రమకు చెందిన వాళ్లు మాత్రం తెలుగు పరిశ్రమ బతుకాలంటూ పాలకుల చుట్టూ తిరగడంతోనే సరిపెట్టుకున్నారు. ఈ తిరగడంపై కూడా టాలీవుడ్‌లో భిన్న స్వరాలు వచ్చాయి. చిత్ర పరిశ్రమ బతుకు పేరుతో రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం చేశారన్న ఆరోపణలు బహిరంగంగనే వ్యక్తమయ్యాయి.

సంపాదనే ముఖ్యం కాదూ…సేవ చేయడం ముఖ్యమే…
సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు చిత్ర పరిశ్రమ..ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ముఖ్యంగా వానలు, వరదలు, తుఫాన్లు వంటి విపత్తు వచ్చినప్పుడు నాటి నటులు జోలి పట్టి విరాళాలు సేకరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలు బాగుండి డబ్బులు పెట్టి సినీమాను చూస్తేనే సినీమాలు ఆడేది, తాము హీరోలుగా ఉండేదని గ్రహించిన నాటి తరంకు చెందిన నటులు ప్రజలకు తమకు చేతనైంతగా సేవ చేసేవాళ్లు. కానీ, ప్రస్తుతతరంకు చెందిన నటుల్లో మాత్రం సంపాదనపైన ఉన్న ధ్యాస…కష్టాల్లో ఉన్న ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చే వారు లేకుండాపోయారు. సేవను సైతం వ్యాపారం చేసిన హీరోలున్నారు టాలీవుడ్‌లో. రాష్ట్రంలో భీకరమైన కరువు వచ్చినప్పుడు వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోవడం అటుంచి కనీసం పలకరించిన టాలీవుడ్‌ ‌హీరోలు లేరు. తాజాగా లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు, కష్టాల్లో ఉంటే కనీసం వారిని ఓదార్చడానికి ఒక తెలుగు హీరోకు, నటులకు మనస్సు రాకపోవడం నిజంగా బాధకరమైన విషయమే. ఒక్కో నటుడు ఈ గడ్డపై వందలు, వేల కోట్ల ఆస్థులు, అంతస్థులు కూడబెబ్టుకున్నారు. అక్రమంగానో, సక్రమంగానో వాళ్లు సంపాదించుకున్న దాంట్లో ‘పైసా’కూడా ఇవ్వమని ఎవరూ అడగడం లేదు. కాకపోతే, కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామనే  ఇవ్వడంలో, ఒక చిన్న ఓదార్పు ఇవ్వడంలో నష్టమేమీ లేదు. వాళ్లకయ్యే ఖర్చు కూడా ఏమీ లేదు. ఏది ఏమైనా ఇప్పటికైనా  బాలీవుడ్‌కు చెందిన సోనూసూద్‌ ‌వంటి నటుడిని చూసైనా తెలుగు పరిశ్రమకు చెందిన నటులు ‘సోయి’ తెచ్చుకుంటే చాలూ. చూడాలి మరి!

Leave a Reply