ప్రభుత్వ ఆస్తులు, గోడలపై పోస్టర్లు వేస్తే చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం గ్రీవెన్స్ అనంతరం నిర్వహించిన రివ్యూ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ నగరంలో 38 బస్ షెల్టర్లు ఉన్నాయని వాటిని పునరుద్ధరించడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఎస్ఈని ఆదేశించారు. నగరంలో ఎక్కువ ట్రాఫిక్ ఉండే జంక్షన్లను క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాలని ప్రయారిటీ ప్రాతిపదికన వాటిని గుర్తించి పునరుద్ధరించేలా ప్రణాళికలు ఉండాలని, షెల్టర్లకు ఆకర్షణీయమైన పెయింటింగ్‌లతో పాటు చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే తక్షణమే పూర్తి చేయించి, బస్సు షెల్టర్లను అందంగా తీర్చిదిద్దేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు, కాంపౌండ్ వాల్లపై ఇష్టారీతిన వివిధ రకాల సంస్థల, యూనియన్ల, ప్రైవేటు వ్యాపార సంస్థలు కాంపౌండ్ గోడలపై పోస్టర్లు అతికించి నగరాన్ని అందవిహీనంగా మారుస్తున్నారని, కాంపౌండ్ వాల్లకు ఆకర్షణీయమైన పెయింటింగ్‌లు, ప్రజలను ఆలోచింపజేసే చిత్రాలు వేయించడం జరిగిందని అలాంటి వాటి పైన పోస్టర్లు వేయడం వల్ల కళావిహీనంగా తయారవుతున్నాయని ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని, టిపిబిఓల నేతృత్వంలో వివిధ విభాగాల లోని జవాన్లు, ఫీల్డ్ ఇన్స్పెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లైన్ మెన్లు, డిఆర్ఎఫ్ సిబ్బందితో ప్రత్యేకంగా క్రాస్ ఫంక్షన్ టీంలను ఏర్పాటు చేసేలా ప్రొసీడింగ్ ఇవ్వాలని కమిషనర్ ఇన్చార్జి సిటీ ప్లానర్ ను ఆదేశించారు. ఈ విభాగాలు క్షేత్రస్థాయిలో ఒక నెల లోపు నగరంలోని అన్ని ప్రాంతాలలో పర్యటించి పోస్టర్లు వేసిన ప్రాంతాలను గుర్తించి వాటిని 2 నెలల్లో పూర్తిగా తొలగించాలని అవసరమైతే పీనల్ యాక్టు ప్రకారంగా చర్యలు తీసుకోవాలని, పెనాల్టీలు వసూలు చేయాలని కమిషనర్ అన్నారు. పెయింటింగ్ కనుక దెబ్బతిన్నట్లయితే రీ-పెయింటింగ్ చార్జీలు వారి వద్ద నుండి వసూలు చేయాలని ఖచ్చితంగా తేడా కనిపించాలని కమిషనర్ పమేలా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా ఇంచార్జ్ ఏసి జివి.నారాయణరావు, ఎంహెచ్ఓ డాక్టర్ రాజా రెడ్డి, ఎస్ఈ భాస్కర్ రెడ్డి, ఇన్చార్జి సిపి నరసింహ రాములు, సిహెచ్ఓ సునీత, సెక్రెటరీ విజయలక్ష్మి, ఉప కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.