Take a fresh look at your lifestyle.

దేశ వ్యాప్తంగా.. భారత్‌ ‌బంద్‌ ‌ప్రశాతం

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్‌ ‌బంద్‌ ‌విజయవంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బిజెపియేతర పాలిత ప్రాంత రాష్ట్రాల్లో బంద్‌ ‌ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్‌ ‌బంద్‌ ‌కొనసాగింది. భారత్‌ ‌బంద్‌లో 25 రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులతో పాటు ఆయా పార్టీల నాయకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ ‌చేశారు. పలు రాష్ట్రాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే రాస్తారోకోలు, ప్రదర్శనలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ పొలిమేర్లలో రైతులు కదంతొక్కారు. లక్షల మంది రైతులు కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు.

ఇప్పటి వరకు ఐదు సార్లు కేంద్రంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు బంద్‌కు పిలుపు ఇచ్చారు. కాగా రైతు సంఘాల నేతలతో కేంద్రం బుధవారం మరోసారి చర్చలు జరపనుంది. రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఇంతవరకు తిరస్కరిస్తూ వొచ్చింది. రైతులు సూచించిన సవరణలను చేస్తామని, రద్దు అసాధ్యమని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. పంజాబ్‌లో బంద్‌ ‌సంపూర్ణంగా కొనసాగింది. అమృత్‌సర్‌లో రైతు, కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. మొహాలీలో టోల్‌ప్లాజాలను అధికారులు మూసివేశారు. ఒడిశాలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఒడిశాలో వామపక్షాలు, కార్మిక, రైతు సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. భువనేశ్వర్‌ ‌రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో నిర్వహించారు. మహారాష్ట్రలో పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి.

స్వాభిమాని శెట్కారి సంఘటన రైతు సంఘం ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహించారు. బుల్దానా జిల్లా మల్కాపూర్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌ట్రాక్‌పై రైతులు నిరసన వ్యక్తం చేశారు. బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో వామపక్ష శ్రేణులు ప్రదర్శన చేపట్టాయి. కర్ణాటకలో రైతు సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి.. అగ్రి చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశాయి. మైసూర్‌లో బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. తమిళనాడులోనూ భారత్‌ ‌బంద్‌ ‌కొనసాగింది. అక్కడ డిఎంకె తదితర పార్టీలు మద్దతు పలికి బంద్‌లో పాల్గొన్నాయి. అసోంలోనూ రైతులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణలో..భారత్‌ ‌బంద్‌కు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply