Take a fresh look at your lifestyle.

సచివాలయ ముట్టడికి ఎబివిపి యత్నం

అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు – సిపిఎం కార్యాలయంలో నిరాహారదీక్ష
అమరావతి, జూన్‌ 30 : ఆం‌ధ్రప్రదేశ్‌లో జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌వివాదం రోజు రోజుకు ముదురుతోంది. జాబ్‌ ‌క్యాలెండర్‌ను నిరిసిస్తూ సచివాలయం ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. సీఎం జగన్‌ ‌విడుదల చేసిన జాబ్‌ ‌క్యాలెండర్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆందోళన కారులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. కొత్త ఉద్యోగాలతో మరోసారి జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించాలని కోరారు. కేబినెట్‌ ‌సమావేశానికి ముఖ్యమంత్రి బయలుదేరిన సమయంలో ఏబీవీపీ నాయకులు సచివాలయం ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా రావడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ ‌క్యాలెండరపై పునరాలోచించాలని, కొత్తగా మరో జాబ్‌ ‌క్యాలెండర్‌ను విడుదల చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్‌ ‌చేశారు. ఇదిలావుంటే నిరుద్యోగు లందరికీ ఉప యోగపడేవిధంగా జాబ్‌ ‌క్యాలెండరును విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ… వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలోని సిపిఎం కార్యాలయంలో బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, నిరుద్యోగులు, విద్యార్ధి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని నేతలు డిమాండ్‌ ‌చేశారు.

నిరుద్యోగ యువత అర్థనగ్న ప్రదర్శన
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో యువకులు అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. గుంటూరు హిమని సెంటర్‌ ‌గాంధీ విగ్రహం వద్ద నిరుద్యోగ సంఘాల నేతలు నిరసన తెలిపారు. జాబ్‌ ‌లెస్‌ ‌క్యాలెండర్‌ను రద్దు చేసి కొత్త జాబ్‌ ‌క్యాలెండర్‌ను విడుదల చేయలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. నేడు క్యాబినెట్‌ ‌సమావేశంలో కొత్త జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేస్తూ తీర్మానం చేయాలన్నారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ ‌చేసి లాలాపేట స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply