- మా పార్టీ నేతలను పోలీసులే కిడ్నాప్ చేయడం దారుణం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం వారి భూములనే కబ్జా చేయడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం దాడులు చేస్తున్నదనీ, ప్రజలను పీడిస్తున్న కేసీఆర్‌కు భయం పుట్టిస్తానని పేర్కొన్నారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ మోర్చా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ గుర్రంపోడులో గిరిజనుల పక్షాన పోరాడుతున్న బీజేపీ నేతలను పోలీసులే కిడ్నాప్ చేయడం దారుణమనీ, దేశంలో పోలీసులనే కిడ్నాపర్లుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు.
కనీసం అరెస్టు చేసిన నేతలు, కార్యకర్తల వివరాలను కూడా వెల్లడించకపోవడం దారుణమనీ, తక్షణమే తమ పార్టీ కార్యకర్తలను ఏ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో అరెస్టు చేసిన తమ పార్టీ కార్యకర్తల వివరాలను వెల్లడించని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే కిడ్నాపర్లుగా మారితే ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరనీ, బీజేపీ కోసమే రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు స్వస్తి పలికారా అని ప్రశ్నించారు.
హైకోర్టు తీర్పును అమలు చేయలేని స్థితిలో అధికారులు ఉన్నారనీ, పదవీ విరమణ చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ పనిచేస్తునన ఐపీఎస్‌లను అవమానిస్తున్నారని అన్నారు. అనుభవం లేదనే కారణంతో పదవీ విరమణ చేసిన, తనకు దగ్గరగా ఉండే అధికారులకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు ఇస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకరరావు అనే ఇంటలిజెన్స్ అధికారి సీఎం కేసీఆర్‌కు తొత్తులా వ్యవహరిస్తున్నారనీ, గిరిజనులపై దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో ఇం•లిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షునికి ఏమైనా జరిగితే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ హెచ్చరించారు.